రంజీ మ్యాచ్‌లో అదరగొట్టిన యశ్‌ధుల్‌


ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ

న్యూఢల్లీి,ఫిబ్రవరి17  (జనంసాక్షి)  : అండర్‌` 19 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు ప్రపంచకప్‌ సాధించి పెట్టిన కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు. తద్వారా ఆడిన మొదటి రంజీ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తున్న దేశవాళీ రంజీ టోర్నీ రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు 17న గురువరాం మొదలైంది. ఇందులో భాగంగా ఢల్లీి, తమిళనాడు జట్లు మొదటి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన తమిళనాడు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనింగ్‌కు దిగిన ఢల్లీి బ్యాటర్‌ యశ్‌ ధుల్‌ 136 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 150 బంతులు ఎదుర్కొన్న అతడు 113 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు ఉన్నాయి. కాగా యశ్‌ ధుల్‌కు ఇదే మొదటి రంజీ మ్యాచ్‌ కావడం విశేషం. ఇక తమిళనాడు వంటి పటిష్ట జట్టుపై అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇలా అదరగొట్టడం పై అభిమానులు ఫిదా అవుతున్నారు. యశ్‌ ధుల్‌ మరో కోహ్లి అవుతాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నీలాంటి అత్యుత్తమ ఆటగాడిని ఢల్లీి క్యాపిటల్స్‌ లక్కీగా తక్కువ ధరకే సొంతం చేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌ మెగా వేలం`2022లో భాగంగా ఢల్లీి ఫ్రాంఛైజీ 50 లక్షల రూపాయలు వెచ్చించి యశ్‌ ధుల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.