పరస్పర విరుద్దంగా అధికార, విపక్ష పార్టీలు
కేంద్రాన్ని నిలదీయంలో ఇరు పార్టీల వైఫల్యంఅమరావతి,పిబ్రవరి17 (జనంసాక్షి): అనూహ్యంగా ఉమ్మడి ఎపి విభజన సమస్యల జాబితా నుంచి ప్రత్యేకహోదా తొలించడం..ఓ రకంగా కేంద్రం అనుసరించిన దుర్మార్గపు చర్యగా చూడాలి. కానీ దీనిని గుర్తించని నేతలు ఎవరికి వారు బిజెపి ఎంపిపైనా, చంద్రబాబుపైనా నెడుతూ అసలు దోషి అయిన కేంద్రాన్ని తక్కువ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రానికి చిత్తశుద్ది లేదు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, వై.ఎస్.ఆర్.సి.పి, టిడిపి నేతలు ఇస్తున్న ప్రకటనలు చూస్తుంటే నేలవిడిచి సాముచేస్తున్నట్లుగా ఉంది. అందరూ ప్రత్యేకహోదా గురించి సమర్ధిస్తూ మాట్లాడుతున్నవారే. కాని హోదా ఇవ్వవలసిన కేంద్ర ప్రభుత్వం బిజెపి చేతుల్లో ఉంది. ఆ పార్టీ నేతలు తాము హోదా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పడం లేదు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఎందుకనో గట్టిగా అడగడం లేదు. చంద్రబాబే హోదా రాకుండా అడ్డుకుంటున్నాడని మంత్రి పెద్దిరెడ్డి,జివెల్ అడ్డుపడ్డాడని ఎంపి మార్గగాని భరత్ ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకోవడం ఏవిధంగా సాధ్యమో వీరు చెప్పాలి.
చర్చించవలసిన ఎజెండాలో ఉన్న తొమ్మిది అంశాలలో ప్రత్యేక హోదా అంశాన్ని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు, పన్ను రాయితీలు, రెవెన్యూ గ్యాప్ ఫండిరగ్ అంశాలను ముందు చేర్చారు. తర్వాత తొలగించారు. ఎందుకు తొలగించారో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంతవరకూ ఏ వివరణా ఇవ్వలేదు. జగన్ అడగలేదు కాబట్టి తొలగించారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల వైఖరి పరస్పర విరుద్ధంగా ఉండడంతో బిజెపికి కలసి వస్తోంది.ప్రత్యేక హోదా ఖాయం అని తిరుపతి సభలో స్వయానా మోడీ ప్రకటించినా అమలుకు వచ్చే సరికి మాటమార్చారు. పార్లమెంటులో ఒకసారి నిర్ణయం అయిపోయినా ఆగిపోతుందని బహుశా ఎపి ప్రజలు ఊహించి ఉండరు. ఈ విసయంలో తొలి ముద్దాయి ముమ్మాటికీ బిజెపియే. ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన హావిూ కూడా అమలు చేయవలసిన బాధ్యత కేంద్రానిది. ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్నది ముఖ్యం కాదు. అలాగే కేంద్రం దోబూచులాట, వైసిపి గేమ్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా పోయింది. హోదా ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి తామెవరమని, తమ చేతుల్లో ఏముందని బిజెపి ఎంపి జివిఎల్ చేసిన ప్రకటన పలాయనవాదంతప్ప మరోటి కాదు. బిజెపి నేతలు మాటల్లో ఒకరికి, ఇంకొకరికి పొంతన ఉండదు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అని కొందరు ప్రకటిస్తారు. ఇక విశాఖ ఉక్కు విషయంలోనైతే రాష్ట్రం యావత్తూ ఒకే మాటగా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఐనా దాని గురించి రాష్ట్ర బిజెపి నేతలు నోరెత్తరు. రైల్వే జోన్ విషయం చూస్తే అది ఎవరికీ అంతు పట్టకుండా ఉంది. పోలవరం నిధులు, పునరావాసం, వెనకబడిన ప్రాంతాల ప్యాకేజిలు, కేంద్ర విద్యా వైద్య సంస్థలకు నిధుల విడుదల` అన్నింట్లోనూ ఎగనామమే పెట్టారు. ఈ నేపథ్యంలో రాష్టాన్రికి జరుగుతున్న అన్యాయాల విషయంలో కేంద్రాన్ని నిలదీయడంలో గాని, పార్లమెంటులో ప్రతిఘటించడంలోనూ అధికార వై.ఎస్.ఆర్.సి.పి ఘోరంగా విఫలమైంది. విజ్ఞప్తులకు, వేడికోళ్ళకే పరిమితం అవుతోంది. మారు మాట్లాడకుండా కేంద్రం విధిస్తున్న షరతులను, ముందుకు తెస్తున్న ప్రజా వ్యతిరేక సంస్కరణలను అమలు చేస్తోంది. ఈ విషయం విూద చర్చించి కార్యాచరణ రూపొందించడానికి అఖిలపక్ష సమావేశమైనా పెట్టడానికి జగన్ ముందుకు రావడం లేదు. ఇలా రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ చేస్తున్న అన్యాయాన్ని విస్మరించి ఒకదానిపై ఇంకొకటి కత్తులు
దూసుకుంటున్నాయి. సంకుచిత రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను పట్టించుకోవడం లేదు. వీరికి ఎన్నికల్లో ప్రజలు ఎలా గుణపాఠంచెబుతారన్నది చూడాలి.