జిల్లాలో బీజేపీ పార్టీకి భారీ షాక్‌

మందమర్రి పట్టణ అధ్యక్షుడు మద్ది శంకర్‌ రాజీనామా

మోడీ తెలంగాణ వ్యతిరేక విధానాలపై ఆగ్రహం

మంచిర్యాల,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): జిల్లాలో బీజేపీ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరే విధానాలు నచ్చక బీజేపీ  మందమర్రి పట్టణ అధ్యక్ష పదవికి మద్ది శంకర్‌తో పాటు మరికొంత మంది రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ.. ప్రదాని మోదీ తెలంగాణ వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నాను. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చడం లేదన్నారు. తెలంగాణా సమాజం పట్ల చిన్న చూపు, వివక్ష చూపుతున్న భారతీయ జనతా పార్టీ విధానాలతో విసిగిపోయాని తెలిపారు.తెలంగాణా ఆత్మగౌరవానికి బీజేపీలో విలువ లేదని తెలిసి, ఆ పార్టీ మందమర్రి పట్టణ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని శంకర్‌ ఒక ప్రకటనలో వెల్లడిరచారు. పార్లమెంటులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని గేలి చేస్తూ తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు. ఈ మాటను బట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల ఆయనకి సదభిప్రాయం లేదని అర్థమైందన్నారు. అంతేకాదు గుజరాత్‌, జార్ఖండ్‌, కర్ణాటక రాష్టాల్లో ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు బొగ్గు గనుల వేలం పాటలు ఉపసంహరించుకున్నారు. కానీ, తెలంగాణలో ఆ పనికి పూనుకోవడం జీర్ణించుకోలేకపోయానని ఆయన పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు బొగ్గు గనుల వేలం పాటలను రద్దు చేసి సింగరేణికి అప్పగించాలని మూడు రోజులు సమ్మె చేసినా.. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరించిందని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీలో మనసు చంపుకొని ప్రజావ్యతిరేకిగా ఉండలేకనే రాజీనామా చేస్తున్నాను. తనతొ పాటుగా బీజేపీ మందమర్రి పట్టణ ఉపాధ్యక్షులు అందుగుల లక్ష్మణ్‌, బియ్యాల సమ్మయ్య , పట్టణ ప్రధాన కార్యదర్శి సెపూరి లక్ష్మణ్‌, పట్టణ కార్యదర్శి దోనుగు రమేష్‌, పట్టణ పార్టీ కోశాధికారి మురళి, యువ మోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు రంగు రమేష్‌, బీసీ మోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు పూసాల ఓదెలు, బూత్‌ అధ్యక్షులు బండి రవి, చెల్లేటి తిరుపతయ్యలు కూడా రాజీనామా చేస్తున్నారని శంకర్‌ తెలిపారు.