దేశాన్ని దివాళా తీయిస్తున్న బిజెపి విధానాలు

మండిపడ్డ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

విజయవాడ,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  బిజెపి ఆర్థిక విధానాలతో దేశం నష్టపోతుందని సిపిఎం విరుచుకు పడిరది. ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసి ఉద్యమాలు నిర్వహించడం ద్వారా వామపక్షాల బలం పెంచే కృషి చేస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేకకార్యక్రమాలపై ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కర్నాటక రాష్ట్రం ఉడుపిలో ముస్లిం అమ్మాయిని హిందూ మతోన్మాద గుంపు ఎలా వెంటతరిమి అవమానపరిచిందో మాద్యమాల్లో దేశం అంతా చూసిందన్నారు. జాతీయ సాంస్కృతిక వాదం పేర మతోన్మాదాన్ని ఈదేశంపై రుద్దే విధానంపై పోరాడాల్సి ఉందన్నారు. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక సంస్థకు బానిసగా లేదు. మనదేశంలోనే ఆర్‌ఎస్‌ఎస్‌ అనే మతోన్మాద సంస్థకు బిజెపి బానిసగా ఉంది.. 2014 నుంచి కేంద్రంలో అధికారం చేపడుతూ దివాళాకోరు ఆర్థిక విధానాలతో దేశ జిడిపిని 2022 సంవత్సరం నాటికి మైనస్‌కు తీసుకెళ్లిన ఘనత బిజెపిదేనని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ద్రవ్యపెట్టుబడి శాసిస్తూ ఆర్థిక సంక్షోభాలకు కారణంగా తయారైందని, ఈ ప్రభావం మనదేశంపైనా ఉన్నందునే జిడిపి వృద్ధిలో మైనస్‌కి జారిపోయిందని శ్రీనివాసరావు చెప్పారు. కానీ అదానీ, అంబానీ వంటి వారి ఆస్తులు రూ.లక్షల కోట్లకు పెరిగిపోయా యన్నారు. ప్రపంచంలో సోషలిజం ప్రభావం నానాటికీ పెరుగుతోందని, ఆర్థిక అసమానతలను పరిష్కరించే సిద్దాంత బలం కమ్యూనిజానికే ఉందన్న వాదనలు బలంగా వినిపించడం మంచి పరిణామం అని వివరించారు. అనేక దేశాలు పీడన నుంచి విముక్తిని కోరుకోవడం, పోరాటాల్లోకి రావడం ఈ కాలంలో పెరిగిందన్నారు.