మంత్రి గౌతమ్‌ రెడ్డి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి

 కుటుంబానికి సజ్జల,కొడాలి తదితరుల పరామర్శ

హైదరాబాద్‌,ఫిబ్రవరి21: మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి భౌతిక కాయానికి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కొడాలి నాని, వలభనేని వంశీ, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నివాళులు అర్పించారు. గౌతమ్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.
అధికార లాంఛనాలతో మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నెల్లూరులో నిర్వహించనున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానికులు, కార్యకర్తలు గౌతమ్‌రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. గౌతమ్‌ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. సోమవారం రాత్రికి స్వగ్రామం బ్రహ్మణపల్లికి తరలించనున్నారు. అమెరికాలోఉన్న కుమారుడు వచ్చాక బుధవారం అధికార లాంఛనాలతో గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆంధప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.16 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఉదయం 7.45 నిమిషాలకు అపోలో అసుపత్రికి చేరుకోగా.. 90 నిమిషాల పాటు వైద్యులు గౌతమ్‌రెడ్డికి ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించారు. అయినా ప్రాణాలు దక్కలేదు. దీంతో కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు సమాచారం అందించారు. అయితే మేకపాటి వారం రోజులపాటు దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపి కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొని
ఆదివారమే హైదరాబాద్‌ చేరుకున్నారు. గత నెల 22న కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారు. అయితే సోమవారం ఉదయం గుండె పోటు రావడంతో అపోలో ఆస్పత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. గౌతమ్‌రెడ్డి మరణ వార్త విన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. హైదరాబాద్‌కు బయల్దేరారు.