ఇషాన్‌ కిషన్‌ అరుదైన రికార్డు


ధోనీ,పంత్‌లను అధిగమించేలా స్కోర్‌ నమోదు

న్యూఢల్లీి,ఫిబ్రవరి25( జనంసాక్షి ): టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ అరుదైన ఫీట్‌ సాధించాడు. టి20ల్లో ఒక మ్యాచ్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ తొలి స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన తొలి టి20లో ఇషాన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే. 57 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. తద్వారా టీమిండియా వికెట్‌ కీపర్‌గా ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఇషాన్‌ నిలిచాడు. కాగా టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని 2017లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో 56 పరుగులు చేసి వికెట్‌ కీపర్‌గా ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలచాడు. ధోని రికార్డును రిషబ్‌ పంత్‌ సవరించాడు. 2019లో వెస్టిండీస్‌పై 42 బంతుల్లో 65 పరుగులతో ధోనిని క్రాస్‌ చేసి తొలి స్థానంలో నిలిచాడు. తాజాగా ఇషాన్‌ కిషన్‌ ధోని, పంత్‌లను భారీ మార్జిన్‌తో అధిగమించి తొలి స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు.