పంచాయితీల్లో పేరుకుపోతున్న విద్యుత్‌ బిల్లులు

విూటర్లు లేకపోవడంతో అధిక ఛార్జీలు వసూళ్లు

ట్రాన్స్‌కో తీరుపై సర్పంచ్‌ల మండిపాటు
మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి):  ఉమ్మడి జిల్లాలో విద్యుత్‌ బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయి. దీంతో చెల్లింపులు సక్రమంగా లేని పంచాయతీలు, మున్సిపాలిటీలకు నోటీసులు అందజేయడంతో పాటు, అవసరమైతే విద్యుత్‌ సరఫరాను నిలిపేసే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. పంచాయతీల వారీగా బిల్లులు తయారు చేసి పంచాయతీ అధికారులు, సర్పంచులను స్వయంగా కలిసి చెల్లింపుల జరిగే విధంగా చూస్తున్నారు. గ్యులర్‌ బిల్లుల పేచీ లేకున్నా పెండిరగ్‌ బిల్లుల చెల్లింపులపై పంచాయతీలపై ఆర్థిక భారం పడుతోంది. దీంతో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొని భారం లేకుండా చూడాలని సర్పంచులు కోరుతున్నారు. గృహ అవసరాలతో పాటు వివిధ వ్యాపార,వాణిజ్య రంగాలకు నిరంతరం వీటన్నింటికీ విద్యుత్‌ సరఫరా జరుగుతున్నా బిల్లుల చెల్లింపుల్లో చాలా తేడాలు వస్తున్నాయి. ట్రాన్స్‌కో సరఫరా చేస్తున్న విద్యుత్‌, వసూలు అవుతున్న బిల్లులకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు, మునిసి పాలిటీలు వాడుకున్న విద్యుత్‌కు తగినట్టుగా బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసుకునేందుకుగాను ట్రాన్స్‌కో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు నడుంబిగించింది. ఫిబ్రవరి నుంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా బిల్లులు చెలిస్తే సరి లేకుంటే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.