గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు


` సైనికవందనాలతో లతామంగేష్కర్‌ అంత్యక్రియలు పూర్తి
` ఘన నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ
` తీవ్ర సంతాపం వ్యక్తం ముఖ్యమంత్రి కేసీఆర్‌
` అంత్యక్రియలకు హాజరైన పలువురు ప్రముఖులు
ముంబయి,ఫిబ్రవరి 6(జనంసాక్షి):ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గానకోకిల లత మంగేష్కర్‌(92) ఆదివారం ఉదయం కన్నుమూశారు. వివాదాలకు అతీతంగా, అభిమానులకు సవిూపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. 30కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో వేల గీతాలను ఆలపించారు. అత్యధికంగా హిందీ, మరాఠీ భాషల్లో ఆమె పాటలు పాడారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్‌ జనవరి 11న కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.
అధికారిక లాంఛనాలతో లతా మంగేష్కర్‌ అంత్యక్రియలు
ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముంబయిలోని శివాజీ పార్క్‌లో అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు నడుమ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. లతా మంగేష్కర్‌ అంత్యక్రియలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరై నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌, సినీ నటులు షారూక్‌ ఖాన్‌, సినీరచయిత జావెద్‌ అక్తర్‌ తదితరులు హాజరై నివాళులర్పించారు. అంతకు ముందు ముంబయిలోని లతాజీ ఇంటి వద్ద ఆమె పార్థివ దేహంపై జాతీయ పతాకాన్ని కప్పి సైనిక వందనం సమర్పించారు. లతా మంగేష్కర్‌కు ముంబయి వాసులు కన్నీటి వీడ్కోలు పలికారు.
లతా మంగేష్కర్‌ అంత్యక్రియలకు హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. అభిమానుల సందర్శనార్థం లతాజీ పార్థివదేహాన్ని ఆమె ఇంటి నుంచి ముంబయిలోని శివాజీ పార్కుకు తీసుకొచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌ తదితరులు ఆమెకు నివాళులర్పించారు.
ఉత్తర, దక్షిణ భారత సంగీత సరిగమల వారధి లతాజీ: సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌: ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారని, ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని అన్నారు. భారతదేశానికి లతా మంగేశ్వర్‌ ద్వారా గాంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని సీఎం కేసీఆర్‌ అన్నారు. లతా జీ మరణంతో పాట మూగ బోయినట్లైందని, ‘సంగీత మహల్‌’ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.‘20 భాషల్లో వెయ్యి సినిమాల్లో 50 వేలకుపైగా పాటలు పాడిన లతా జీ సరస్వతీ స్వర నిధి. వెండితెర విూది నటి హావభావాలను అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్టు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్యగాయని. సినీ నిర్మాతలు మొదట హీరో హీరోయిన్లను ఖరారు చేసుకుని సినిమా నిర్మాణం ప్రారంభిస్తారు. కానీ, సింగర్‌గా లతా జీ సమయం ఇచ్చినంకనే సినిమా షూటింగ్‌ ప్రారంభించే వారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. పాటంటే లతా జీ.. లతా జీ అంటే పాట. సప్త స్వరాల తరంగ నాదాలలో శ్రోతలను తన్మయత్వంలో వోలలాడిరచిన లతా మంగేష్కర్‌, ఉత్తర దక్షిణాదికి సంగీత సరిగమల వారధి.హిందుస్థానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్‌ అమంత్‌ అలీఖాన్‌ వద్ద నేర్చుకున్న లతాజీ.. ఉర్దూ కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల, తన గాత్రంలో ఉర్దూ భాషలోని గజల్‌ గమకాల సొబగులను వొలికించేది. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన లెక్క లేనన్ని పురస్కారాలకు లతా జీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావచ్చు కానీ లతా జీ లేని లోటు పూరించలేనిది.’ అని సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు.