మరో వేరియంట్‌ పుట్టుకొస్తే.. ఒమిక్రాన్‌ కంటే తీవ్ర వ్యాప్తి


` డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్‌ కెర్ఖోవ్‌
జెనీవా,ఫిబ్రవరి 6(జనంసాక్షి): ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఆయా దేశాల్లో వెలుగుచూస్తున్న కేసుల్లో సింహభాగం ఈ వేరియంట్‌ కేసులే ఉంటున్నాయని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా ఆయా దేశాల్లో ప్రస్తుతం కేసులు దిగి వస్తున్నాయి. అయితే, ఒమిక్రాన్‌ వ్యాప్తి తగ్గిపోయాక మరో వేరియంట్‌ వస్తుందా? వస్తే దాని తీవ్రత ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (చిఊూ) స్పందించింది. మరో వేరియంట్‌ గనుక పుట్టుకొస్తే దాని వ్యాప్తి ఒమిక్రాన్‌ కంటే తీవ్రంగా ఉంటుందని వెల్లడిరచింది.ఒకవేళ కొత్త వేరియంట్‌ గనక పుట్టుకొస్తే.. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లకంటే అధిక శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుందని.. అందుకే దాని వ్యాప్తి వీటికంటే ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌ సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్‌ కెర్ఖోవ్‌ తెలిపారు. కొత్తగా పుట్టుకొచ్చే వాటికి రోగనిరోధకశక్తిని ఏమార్చే గుణం కూడా అధికంగా ఉండొచ్చు.. టీకాల ప్రభావం కూడా వాటిపై ఉండొకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచం ఇలాంటి స్థితిలోకి చేరుకోకూడదని కోరుకుంటున్నాం. అందుకే కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టాలని కోరుతున్నాం. కట్టుదిట్టమైన నిబంధనలతో వైరస్‌ వ్యాప్తి స్వల్పంగానే ఉంటుందని ఆశిస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.కరోనా వైరస్‌ శ్వాసకోశ వ్యాధికారకం కాబట్టి సీజనల్‌ వ్యాధిగా రూపాంతరం చెందే అవకాశాలు కూడా ఉన్నట్లు వాన్‌ కెర్ఖోవ్‌ వెల్లడిరచారు. ఈ అంశంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు. అందుకే వైరస్‌ను అరికట్టేందుకు జాగ్రత్తలు పాటిస్తూ.. మాస్కులు ధరించాలని, టీకాలు తీసుకోవాలని సూచించారు. ‘మనం జీవితాంతం మాస్కులు ధరించాల్సిన పనిలేదు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరం అంతకన్నాలేదు. కానీ వైరస్‌ నుంచి బయటపడాలంటే ప్రస్తుతం ఇవి చేయక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలున్నాయని, ఒమిక్రాన్‌ చివరిదని భావించడం లేదని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ కొద్దిరోజుల క్రితమే వెల్లడిరచారు. ‘వైరస్‌ ఉత్పాతాలు, మహమ్మారి విజృంభణలు నిజజీవితంలో తప్పవని చరిత్ర స్పష్టం చేస్తోంది. రాబోయే మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్నదానికంటే మరింత సంసిద్ధంగా ఉండాలి. ఇందులో భాగంగా ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు భారీగా ఖర్చుచేయాల్సిన అవసరం ఉంది’ అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ స్పష్టంచేశారు. కరోనా వైరస్‌తోనే ఈ ప్రమాదం ముగిసిపోలేదని, రానున్న రోజుల్లో మరిన్ని మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు అప్రమత్తంగా, మరింత సన్నద్ధతతో ఉండాలని హెచ్చరించారు.