తెలంగాణను అప్పుల కుప్పచేసిన కెసిఆర్‌

బిజెపి నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు కొత్త స్క్రిప్ట్‌ తయారు చేసుకుని సినిమా చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారాముల దర్శించుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని ఆయన విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి, అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ, ఉద్యోగ నోటిఫికేషన్లు, రెండు పడక గదుల ఇల్లు, దళిత ముఖ్యమంత్రి, నిరుద్యోగ భృతి అంటూ అనేక హావిూలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లో విఫలం చెందారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నిటికీ తెలంగాణ స్టాంపు వేసుకొని తెలంగాణ రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని అన్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలందరూ తెలంగాణలో జరుగుతున్న విషయాలపై గుర్తిస్తున్న సమయంలో ఏదో ఒక కాంట్రవర్సీ తీసుకువచ్చి స్క్రిప్ట్‌ తయారు చేసుకొని సినిమా చూపిస్తున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు చూపించటానికి స్క్రిప్టు రెడీ గా తయారు చేసుకుంటారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను ఎద్దేవా చేశారు. భద్రాద్రి రామయ్య సన్నిధికి ఇస్తానన్న వందకోట్ల అభివృద్ధిని ఎప్పుడో గాలికి వదిలేశారని అన్నారు.