ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శ
కేసులకు భయపడేది లేదన్న ఎంపి కేశినేని నాని
అమరావతి,ఫిబ్రవరి12(జనం సాక్షి ): టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబును టీడీపీ నాయకులు పరామర్శించారు. టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు తదితరులు ఆయనను పరామర్శించిన వారిలో ఉన్నారు. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారని వచ్చిన ఫిర్యాదుకు ఏపీ సీఐడీ అధికారులు నిన్న అశోక్‌బాబును అరెస్టు చేశారు. ఏపీ హైకోర్టులో అశోక్‌బాబు వేసిన మధ్యంతర బెయిల్‌ను నిరాకరించడంతో సీఐడీ అధికారులు గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి తరలించి ప్రశ్నించారు. అక్కడి నుంచి శుక్రవారం రాత్రి విజయవాడలోని సీఐడీ ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి ముందు అశోక్‌బాబును హాజరుపరిచారు. మొదట బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేసిన అధికారులు.. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా 467 సెక్షన్ పెట్టారని న్యాయవాదులు వాదించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అరెస్ట్ చేశారని, ఇటీవలే అశోక్‌బాబు గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారని.. అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినాని మాట్లాడుతూ .. అధికార వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. టీడీపీ నాయకులపై విధిస్తున్న కేసులకు ఎవరూ భయపడరని అన్నారు. ప్రభుత్వాన్ని శిక్షించేందుకు ప్రజలు సిద్ధంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్సీ అశోక్ బాబును టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల మాట్లాడుతూ జగన్ రెడ్డి ఆదేశాల మేరకే అశోక్ బాబు అరెస్టు జరిగిందని మంత్రి కొడాలినానినే చెప్పారన్నారు. ఉద్యోగుల తిరుగుబాటుతో ప్రభుత్వానికి భయం పట్టుకుందని తెలిపారు. అశోక్ బాబుని అరెస్టు చేసి ఉద్యోగుల ఉద్యమంపై ప్రశ్నించటమేంటి అని అన్నారు. ప్రశ్నించే గొంతుల్ని నొక్కటమే అజెండాగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. డీజీపీ చెప్పినట్లే ప్రతీ పౌరుడు భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగా ప్రభుత్వంపై తమ నిరసన తెలుపుతున్నారని అన్నారు. దృతరాష్ట్ర పాలన చేస్తూ జనరంజిక పాలనగా జగన్ రెడ్డి చెప్పు కుంటున్నారని విమర్శించారు. అక్రమ కేసులు బనాయింపు కోసమే రాజ్యాంగ వ్యవస్థల్ని వాడుతు న్నారన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే వరకూ టీడీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఏ శక్తితోనూ జగన్ రెడ్డి టీడీపీ పోరాటాన్ని ఆపలేరని అన్నారు. నియంతలకు పట్టిన గతే జగన్ రెడ్డికి పడుతుందని ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు.
అశోక్‌బాబుకు టిడిపి నేతల పరామర్శ