కోటప్పకొండలో శివరాత్ర సందడి

 



ప్రభలతో కొండకు చేరుకున్న భక్తులు
దక్షిణామూర్తిగా విరాజిల్లుతున్న స్వామి
గుంటూరు,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో భక్తుల కోలాహలం
నెలకుంది. కోటయ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటయ్య తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు గిరి ప్రదక్షణ చేశారు. కొండ దిగువున సోపాన మార్గం వద్ద ఉన్న విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. వందల సంఖ్యలో భక్తులు మెట్ల పూజ చేశారు. సోపాన మార్గంలో ఉన్న ఆనందవల్లి ఆలయంలో కూడా పూజలు చేశారు. ధ్యాన శివుడు, నాగేంద్రస్వామి పుట్ట వద్ద నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేశారు. పొంగళ్లు చేసి స్వామికి సమర్పించారు.
అభిషేక మండపంలో అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఈ ఏడాది తిరునాళ్లకు రెండు రోజులు ముందుగానే భారీ విద్యుత్‌ ప్రభలు కొండకు చేరుకున్నాయి. ట్రాఫిక్‌ స్తంభించకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. ప్రభుత్వం తరపున ఏటా తిరునాళ్ల రోజున పట్టు వస్త్రాలను అందజేస్తారు. సంప్రదాయానికి అనుగుణంగా ఈ ఏడాది స్వామికి ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలను దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమర్పించనున్నారు. తెల్లవారు జాము నుంచే వేలాదిగా భక్తులు కోటప్పకొండకు తరలి వచ్చి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహాశివరాత్రి రోజున శ్రీ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో జరిగే తిరునాళ్ల మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొక్కుబడి ప్రభలతో భక్తులు కొండకు తరలివచ్చారు. నరసరావుపేట నుంచి చిన్నారులు కాలి నడకన ప్రభలతో కోటయ్య సన్నిధికి చేరుకున్నారు. శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైనలను ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం క్యూలైనలో భక్తుల రద్దీ నెలకుంది. నరసరావుపేట పురపాలక సంఘం ప్రభ కోటప్పకొండకు చేరుకుంది. కొండ దిగువున తలనీలాలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో రామ కోటిరెడ్డి, పాలక మండలి చైర్మన రామక్రిష్ణ కొండలరావు దేవస్థానం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. కోటప్పకొండ తిరుణాళ్లకు రాష్ట్ర పండుగ హోదా ఉండటంతో ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి వెల్లపల్లి శ్రీనివాసరావు స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.20 వేలు నిధలు విడుదల చేసింది. తిరునాళ్ళకు రాష్ట్ర పండుగ హోదా ఉన్నా ఏర్పాట్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. గత మూడేళ్ళుగా ఇదే పరిస్ధితి నెలకొంది. త్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదాన్ని ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు పంపిణీ చేయనున్నారు. ఇందు కోసం దేవస్థానం ప్రసాదం సిద్ధం చేస్తున్నది. ఇందుకు అయ్యే ఖర్చును దేవస్థానానికి ఎంపీ లావు చెల్లించనున్నారు. నరసరావుపేట డిపో నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను కోటప్ప కొండకు నిర్వహిస్తున్నది. తిరునాళ్ళ రోజున నరసరావుపేట, చిలకలూరిపేట డిపోల నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీ వియోగంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి (కోటప్పకొండ) పర్వతం పైన 12 ఏళ్లు వటుడిగా తపమాచరిస్తుండగా, సదాశివుని అనుగ్రహం కోసం బ్రహ్మ, విష్ణు, సకల దేవతలు, రుషి పుంగవులు స్వామి కటాక్షం కోసం అక్కడ తపమాచరించి ప్రసన్నుడిగా స్వామిని దర్శించుకుని జ్ఞాన దీక్ష పొందారు. అందు వల్లే ఈ క్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మచారి అయిన దక్షణామూర్తి క్షేత్రం కావడంతో ఇక్కడ కళ్యాణోత్సవాలు నిర్వహించరు. ధ్వజ స్తంభం కూడా ఉండదు. ఎటువైపు చూసినా మూడు శిఖరాలుగా కోటప్పకొండ కన్పిస్తుంది. అందుకే కొండపై వెలసిన స్వామికి త్రికూటేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ మూడు శిఖరాలకు బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు అని పిలుస్తారు. బ్రహ్మ శిఖరంపై బ్రహ్మ నివసించాడని ప్రతీతి. జ్యోతిర్లింగం ఈ ప్రాంతంలో లేకపోవటంతో బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా అప్పుడు
స్వామి ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక తీర్చుటకు జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఆ జ్యోతిర్లింగమే భక్తుల పూజలందు కుంటున్న కోటేశ్వర లింగం. కోటప్పకొండ వద్ద ఉన్న కొండకావూరులోని గొల్లభామ ఆనందవల్లి త్రికోటేశ్వరునికి పూజలు చేయగా ఈశ్వరుడు జంగందేవర రూపంలో ప్రత్యక్షమైనట్టు స్థల పురాణం చెపుతోంది. ఆనందవల్లి పాప వినాచన దూన వద్దకు వెళ్లి తీర్ధం రుద్ర శిఖరానికి తెచ్చి జంగమయ్యకు అభిషేకాధిపూజలు చేసింది. ఆమెను పరీక్షించేం దుకు ఎన్ని విధాలా కష్ట పెడుతున్నప్పటికీ పూజలు మాననం దునే ఆనందవల్లి ఇంటికి వస్తాను, అక్కడే వ్రతం ఆచరించమని జంగమయ్య ఆమె వెనుకనే
బయలుదేరాడు. ఎలాంటి పరిస్థితుల్లోను వెను దిరిగి చూడవద్దని చెప్పగా ప్రళయ ధ్వనులకు తాళలేక బ్రహ్మశిఖరం వద్ద వెను దిరిగి చూసింది. జంగమయ్య అక్కడే శిలగా మారాడు. ఆ చోటనే కోటేశ్వరాలయం నిర్మించ బడిరది. ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ శిలగా మారిన ప్రాంతంలో ఆనందవల్లి గుడి నిర్మించారు. విష్ణుశిఖరంలో దక్ష యజ్ఞంలో పాల్గొన్న దేవతలు, రుషులు పాప విమోచనం పొందిన పవిత్ర స్థలంలో పాప విమోచనేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆరు వందల అడుగుల ఎత్తులో త్రికోటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఘాట్‌ రోడ్డు నిర్మాణంతో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగు తోంది. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీస్తు శకం 1172 నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి, పెట్లూరివారిపాలెం జమిందార్లు అలాగే శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి భూములు సమర్పించారు.