ప్రజలకు లోటుపాట్లు రాకుండా చూసుకోవాలి
అధికారులతో సీమక్షించిన సిఎస్, డిజిపిలుసిద్దంగా ఉన్నామన్న ములుగు ఎస్పీ సంగ్రామ్
హైదరాబాద్,ఫిబ్రవరి11(జనం సాక్షి): దేశంలోనే అతిపెద్ద గిరిజన వేడుక మేడారం జాతర అని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర కొనసాగనుందని తెలిపారు. ఈసారి కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో దేవాదాయ, వైద్యారోగ్య, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్టీసీ, విద్యుత్, ఆర్ అండ్ బీ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతరలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. భక్తులకు స్నానాల కోసం జంపన్న వాగులోకి నీటిని విడుదల చేస్తామన్నారు. భక్తుల కోసం 3,850 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని తెలిపారు. బస్సుల్లో 21 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందన్నారు. మేడారంలో ప్రధాన ఆస్పత్రితో పాటు 35 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. మేడారం పరిసరాల్లో 327 చోట్ల 6,700 టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడిరచారు. మేడారం జాతరకు 9వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. జాతరలో తప్పిపోయిన పిల్లల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. భద్రతా పర్యవేక్షణకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు.
ఇదిలావుంటే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పోలీసుశాఖ సిద్ధంగా ఉందని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ అన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. గిరిజన జాతరకు సుమారు కోటి నుంచి కోటి 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. జాతరకు తరలి వచ్చే భక్తుల వాహనాలు, నాలుగు వేల ఆర్టీసీ బస్సులు పార్కింగ్ చేయడానికి పార్కింగ్ స్థలాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జాతర సందర్భంగా సుమారు 10 వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా శాంతి భద్రతల పర్యవేక్షణ చేస్తామన్నారు. 382 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలు, 20 డిస్ల్పే ప్యానెళ్లను ఏర్పాటుచేశామని, వాటిని కమాండ్ కంట్రోల్‌కి అనుసంధా నించామని తెలిపారు. తద్వారా ట్రాఫిక్, శాంతి భద్రతలను 24 గంటలు పర్యవేక్షిస్తామని అన్నారు. వాహనాలు నిలపడానికి మొత్తం 33 పార్కింగ్ స్థలాలు, 37 హోల్డింగ్ పాయింట్స్ సంసిద్ధంగా ఉన్నాయ న్నారు. 50 ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రజా సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేశామని, జాతర విధులను నిర్వహించే పోలీస్ సిబ్బందికి మాస్క్, శానిటైజర్‌తో కూడిన కిట్ ఇస్తామని వెల్లడిరచారు. జాతరకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలిని, తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ వెంట తెచ్చుకోవాలని సూచించారు.