నాలాల విస్తరణకు రాజకీయ గ్రహణం

 భారీ లక్ష్యాన్ని నీరుగారుస్తున్న స్వార్థం

హైదరాబాద్‌,ఫిబ్రవరి21: రాజధానికి పెనుముప్పుగా పరిణమించిన నాలాల విస్తరణకు కొంతమంది ప్రజాప్రతినిధులే అడ్డంకిగా తయారయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద నాలాలను విస్తరించడం వల్ల నగరంలో ఎంత వర్షం పడినా ఒక్క ప్రాంతానికీ ముంపు ముప్పు లేకుండా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనికి అనుగుణంగా సర్వే పూర్తయినా ఇంతవరకు విస్తరణ పనులు మొదలు కాలేదు. ఆక్రమణలతో ప్రవాహ సామర్థ్యం తగ్గి వర్షాకాలంలో ఆ నీరంతా కాలనీలను ముంచెత్తుతోంది. రాజకీయ
ప్రయోజనాలను ఆశించి కొందరు అడ్డు తగలడంతో ముంపు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నారు.లితంగా ఆస్తి నష్టంతోపాటు అనేకమంది నిరాశ్రయులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో నాలాల వ్యవస్థను గాడిలో పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆనాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నాలాల ఆక్రమణలపై సర్వేకు ఆదేశించారు. నాలాలను చాలా వరకు విస్తరిస్తే భవిష్యత్తులో ముంపు ఇబ్బంది ఉండదన్న భావనలో ఆనాటి మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ అధికారులకు తగు సూచనలు చేసి ప్రణాలికలు రూపొందించారు. వచ్చే వర్షాకాలం నాటికైనా కొన్ని నాలాలపై ఆక్రమణలను తొలగించి విస్తరించపోతే మళ్లీ నగరానికి ముంపు ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే నగరంలోని కొంతమంది ప్రజాప్రతినిధులు పది అడుగుల మేర విస్తరిస్తే వేలాది ఆక్రమణలను తొలగించాల్సి వస్తుందని, అదే జరిగితే ఆమక్రణదారుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఆక్రమణలు తొలగించకుండా నాలాలు విస్తరించకుండా ప్రస్తుతమున్న నాలాల్లో లోతుగా పూడిక తీస్తే సరిపోతుందని వీరి వాదనగా ఉంది. ఆక్రమణల తొలగింపు మొదలుపెడితే ప్రజల నుంచి పెద్దఎత్తున ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని వీరు భయపడుతున్నారు. అందుకే విస్తరణకు మోకాలడ్డు తున్నారు. ప్రజాప్రతినిధులు ఒత్తిడితో నాలాల ఆక్రమణ తొలగింపు విస్తరణ వేగంగా ముందుకు వెళ్లడం లేదు. ఎలాగూ నిధులు సమస్య ఉంది కాబట్టి నాలాల్లో పూడిక తొలగింపుపైనే మహానగరపాలక సంస్థ అధికారులు దృష్టి పెట్టారు. అధికారులు అయిదారు నెలలపాటు శ్రమించి క్షేత్రస్థాయిలో 390 కిలోవిూటర్ల పొడువునా సర్వే చేశారు. ఈ నాలాలపై దాదాపు 12 వేల వరకు ఆక్రమణలు ఉన్నాయని తేల్చారు. వర్షపు నీరు వెళ్లేందుకు ఉన్న కాలువలన్నీ మురుగు నాలాలుగా మారిపోయాయి. పైగా ఇటీవలి వర్షాకాలంలో నిజాంపేట, బాచుపల్లి, బండారి లేఅవుట్‌, నాచారం, ఆల్విన్‌ కాలనీ తదితర అనేక ప్రాంతాలు ముంపు నీటిలో చిక్కుకున్నాయి. వీటిని ఎంతమేర విస్తరించాలన్న దానిపైనా సర్వేలో గుర్తించి అందుకు అనుగుణంగా మార్కింగ్‌ చేశారు. ప్రస్తుతం నగరంలో పడే వర్షం నీటినీ పరిగణనలోకి తీసుకుని ఈ నాలాలను కనీసం పది అడుగుల మేర అదనంగా విస్తరించాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. లేని పక్షంలో భారీ వర్షాలొస్తే అనేక కాలనీలు ముంపు నీటిలో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు.