మల్లన్న సాగర్ ప్రారంభోత్సవం సక్సెస్





విజయవంతంగా జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్

100 ఎకరాల్లో ఇరిగేషన్ కాంప్లెక్స్ 
ఇంటర్నేషనల్ డెస్టినేషన్ మ్యారేజ్ సెంటర్

 హైద‌రాబాద్‌ఫిబ్రవరి 23  (జనం సాక్షి):
తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్‌ జలాశయం ప్రారంభోత్సవంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూరిపూర్ణమైంది.  కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ జలాశయాన్ని ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధ‌వారం మధ్యాహ్నం జాతికి అంకితం చేశారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాదు నుంచి హెలీకాప్టర్లో బయలుదేరిన సీఎం మల్లన్నసాగర్ వద్దకు చేరుకున్నారు. అండర్ గ్రౌండ్ టన్నెల్ లోని ప్రాజెక్టు ప్రారంభోత్సవ ప్రదేశానికి వెళ్లారు, ముందుగా కొముర‌వెల్లి మ‌ల్ల‌న్నకు ప్రత్యేక పూజ‌లు చేశారు. ఆ తర్వాత మోటార్లు స్విచ్ఛాన్ చేసిన సీఎం కేసీఆర్, మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌లోకి నీటిని విడుద‌ల చేశారు. అనంతరం మల్లన్నసాగర్ కట్టమీదికి చేరుకొని నీరు విడుదలైన ప్రాంతంలో గోదావరి తల్లికి పసుపు కుంకుమలు చల్లి, వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. 
ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడుతూ, మల్లన్నసాగర్ రిజర్వాయర్ వద్ద 100 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇరిగేషన్ కాంప్లెక్స్ నిర్మించాలని ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ ను ఆదేశించారు. మల్లన్నసాగర్ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని, ఆలిండియా డెస్టినేషన్ మ్యారేజెస్ జరిగే కేంద్రంగా దీన్ని రూపుదిద్దాలని మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ లను ఆదేశించారు. రిజర్వాయర్ కు సమీపంలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం కానున్నందున 60 కిలోమీటర్ల పరిధిలోని సిద్దిపేట, కరీంనగర్, జనగామ, ఆలేరు వంటి టౌన్ షిప్ లకు మల్లన్నసాగర్ పర్యాటక కేంద్రంగా ఉంటుందని, ప్రజలకు అత్యంత సౌకర్యంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. సమీపంలో ఉన్న 7500 ఎకరాల అడవిలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు టి.హ‌రీశ్‌రావు, వి.శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి,  ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డితోపాటు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, ఫారూఖ్, రఘోత్తం రెడ్డి, యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, రఘునందన్ రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రసమయి బాలకిషన్, ఉపేందర్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వి.ప్రకాశ్, వంటేరు ప్రతాప్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీనివాస్ గుప్తా, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, కలెక్టర్ హన్మంతరావు, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, ఈఎన్.సీ. మురళీధర్ రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, నీటిపారుదల సలహాదారు (లిఫ్టులు) పెంటారెడ్డి, కాళేశ్వరం ఈఎన్సీ హరిరాం, డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత ఏరియ‌ల్ వ్యూ ద్వారా మల్లన్నసాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప‌రిశీలించారు.

కొమురవెల్లి మల్లన్న అభిషేకానికి గోదావరి జలాలు సమర్పించిన సీఎం కేసీఆర్

కాళేశ్వరం జలాలు మల్లన్నసాగర్ కు తీసుకొచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు కడుగుతానని గతంలో ప్రకటించిన మేరకు, మల్లన్నసాగర్ సభానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా మల్లన్నసాగర్ నుంచి తెచ్చిన గోదావరి జలాలను స్వామివారి అభిషేకానికి సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.