కెసిఆర్‌ను బొందపెట్టడం ఖాయం

 


కెసిఆర్‌ అంటే ఏమిటో ప్రజలు తెలుసుకున్నారు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం
కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదులో రేవంత్‌
హైదరాబాద్‌,  ( జనం సాక్షి):  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ లాంటి వ్యక్తులను ఎంత మందిని తెచ్చుకున్నా సీఎం కేసీఆర్‌ గెలవలేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. ప్రశాంత్‌ కిషోర్‌, ప్రకాశ్‌రాజ్‌లను పెట్టుకుని కెసిఆర్‌ డ్రామాలు ఆడుతున్నాడని, కెసిఆర్‌ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. కెసిఆర్‌ను బొందపెట్టడం ఖాయమని అన్నారు. హైదరాబాద్‌ నగరంలో డిజిటల్‌ సభ్యత్వ నమోదును ప్రారంభించిన సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు. కేసీఆర్‌ కుట్రలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్‌ కుట్రలను మేధావులు ఆలోచించాలని సూచించారు. రాష్ట్రం కోసం అనేకమంది తెలంగాణ బిడ్డలు అమరులయ్యారని తెలిపారు. కేసీఆర్‌ ఏపీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేలకోట్లు సంపాదించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ 40 లక్షల సభ్యత్వం పొందిందని, 80 లక్షల ఓట్లు సంపాదిస్తే..90 సీట్లతో కాంగ్రెస్‌ పాలన వస్తుందని అన్నారు. ఇందుకు ప్రతి కార్యకర్తా కృషి చేస్తే సోనియమ్మ రాజ్యం వస్తుందని అన్నారు. అప్పుడు కోరుకున్న తెలంగాణ పాలన సాగుతుందన్నారు. కెసిఆర్‌కు రోజులు దదగగ్గర పడ్డాయని, మరో 12 నెలల్లో కాంగ్రెస్‌ పాలన రాబోతోందని రేవంత్‌ అన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికే పికెలు,ప్రకాశ్‌రాజులను వెంటేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కెసిఆర్‌ను బొందపెట్టడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరుగుతోంది.. కేసీఆర్‌ గ్రాఫ్‌ పడిపోతోంది అందుకే పీకేను తెలంగాణకు తెచ్చుకున్నారని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి అన్నారు. 34లక్షల మెంబర్‌ షిప్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ నంబర్‌ వన్‌గా నిలిచిందని అందరి శ్రమతో అది సాధ్యం అయిందన్నారు. రాష్ట్రంలో నల్గొండ పార్లమెంట్‌ 4లక్షల మెంబర్‌ షిప్‌తో ఫస్ట్‌ ప్లేస్‌ లో ఉందన్నారు. ట్రైబల్‌ ఏరియా ఎక్కువ ఉన్నచోట అంత సభ్యత్వం సాధ్యం అయిందన్నారు. మరి నగరంలో తక్కువ మెంబర్‌ షిప్‌ కావడం తప్పుడు సంకేతాలు ఇస్తుందన్నారు. అంబరుపేటలో కేవలం 1600 సభ్యత్వాలే అయ్యాయని చెప్పారు. అక్కడ కష్ట పడాలి..గట్టి నాయకులున్నా కూడా సికింద్రాబాద్‌లో మెంబర్‌ షిప్‌ ఆశించిన స్థాయిలో జరగడం లేదని చెప్పారు. బూత్‌ లెవల్లో బలపడితేనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలువబోతోందని స్పష్టం చేశారు. మెంబర్‌ షిప్‌ విషయంలో ఏఐసీసీ సీరియస్‌గా ఉందని అందరూ సీరియస్‌గా పనిచేయాలని గీతారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.