అంగన్‌వాడీ,ఆశాలకు న్యాయం చేయాలి: ఎంపి

న్యూఢల్లీి,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  అంగన్‌వాడీ ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరిస్తామని సీఎం జగన్‌ చెప్పారని, ఇప్పుడు న్యాయం చేయాలని అడిగిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లను అరెస్ట్‌ చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. బుధవారం ఆయన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పింది చేయకపోతే కాలర్‌ పట్టుకోవాలని జగన్‌ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది ఆశావర్కర్లు, లక్షకు పైగా అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన ఆశావర్కర్లకు న్యాయం చేయాలని కోరుతున్నానని అన్నారు. ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లను అరెస్ట్‌ చేయించడం ఏంటని రఘురామ ప్రశ్నించారు.