ఇగురం లేని ఇంటి నెంబర్ల కేటాయింపు...

 

` ఐదు సంవత్సరాలవుతున్నా ఆన్‌లైన్‌లో రావట్లే

` విలీన గ్రామాలపై మున్సిపల్‌ పట్టింపేది...?`

ఇంటి నెంబర్ల మార్పిడిపై పట్టించుకోని కౌన్సిలర్లు

జనంసాక్షి, సిరిసిల్లటౌన్‌ : సిరిసిల్ల పట్టణంలో ఏడు గ్రామాలు విలీనమై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్దికి నోచుకోని విషయం పక్కన పెడితే కనీసం ఇంటి నెంబర్ల ఆన్‌లైన్‌ చేయడంలో కూడా నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. గ్రామపంచాయతీలుగా ఉన్నప్పుడు గ్రామ కారోబార్లు మ్యానువల్‌గా గరిపట్టీ పట్టించుకునేవారు. అందుకు రశీదు ఇంటి నెంబర్‌తో సహా రాసిచ్చేవారు. అయితే మున్సిపల్‌లో విలీనమైనప్పుడే ఏడు గ్రామపంచాయతీలకు సంబంధించిన అన్ని రకాల రికార్డులు మున్సిపల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు చాలా విలీన గ్రామాల్లో 20 శాతం కూడా ఇంటి నెంబర్లు ఆన్‌లైన్‌లో రావడం లేదు. అలాగే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌లో, గరిపట్టీలో ఉన్న ఇంటి నెంబర్‌ మున్సిపల్‌ ఆన్‌లైన్‌లో ఉండడం లేదు. విలీన గ్రామమైన రగుడులో అన్న ఇంటి నెంబర్‌ తమ్మునికి, తమ్ముని ఇంటి నెంబర్‌ అన్నకు కేటాయించి కొత్త పంచాయతీకి తెరలేపారు. విలీన గ్రామాలకు సంబంధించి ఎవరైనా ఆపతికి ఇండ్లు అమ్ముకుంటే రిజిస్ట్రేషన్‌ కావడం లేదు. సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయంలో ఇంటి నెంబర్‌ ఆన్‌లైన్‌ లేదని రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు. మున్సిపల్‌ అసెస్‌మెంట్‌ నెంబర్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌ అవుతుంది. ఈ విషయంపై పలుమార్లు మున్సిపల్‌ అధికారులను కలిసినప్పటికీ ఇదిగో అదిగో అంటూ దాటవేస్తున్నారే తప్ప కొత్త నెంబర్లు కేటాయించడం లేదని విలీన గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపైన విలీన గ్రామాలకు చెందిన కౌన్సిలర్లు ఇప్పటి వరకు మున్సిపల్‌ కౌన్సిల్‌లో ఒక్కసారి కూడా మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొంతమంది కౌన్సిలర్‌లకు ఇంటినెంబర్‌ ఆన్‌లైన్‌పై కనీస అవగాహన లేకపోవడం శోచనీయం.
ఏడాదిన్నరగా తిరుగుతున్నా..మున్సిపల్‌ అధికారులు పట్టించుకుంటలే`కత్తెరపాక రాజు, చంద్రంపేట నా ఇంటి నెంబర్‌ డాక్యుమెంట్‌లో ఒకలాగా, గరిపట్టిలో మరొకలాగా మున్సిపల్‌ రికార్డులో మరొకలాగా ఉండడంతో దీన్ని రెగ్యూలరైజ్‌ చేయాలని సంవత్సరన్నర నుండి మున్సిపల్‌ అధికారుల చుట్టూ తిరుగుతున్నా. మా కౌన్సిలర్‌ రాజిరెడ్డిని కూడా కలిసినా పనికావడం లేదు. నా ఇంటిపై బ్యాంకు లోను తీసుకొని వ్యాపారం చేసుకుందామని బ్యాంకుకు వెళ్తే మున్సిపల్‌ ఆన్‌లైన్‌ నెంబర్‌ కావాలని తెలిపారు. దీంతో మున్సిపల్‌ వెళ్తే మున్సిపల్‌లో నా నెంబర్‌ ఇంకొకరి పేరుపై కేటాయించి ఉంది. నా డాక్యుమెంట్‌లో ఉన్న నెంబర్‌ ప్రకారం నెంబర్‌ కేటాయించాలని సంవత్సరన్నర నుండి తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు.