డ్రెస్‌ కోసం మహిళలను ఒత్తడి చేయొద్దు: ఐద్వా

నెల్లూరు,ఫిబ్రవరి8(జనంసాక్షి): గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులకు నెల్లూరు జిల్లాలో పురుష టైలర్స్‌తో కొలతలు తీస్తూ అభ్యంతరకరమైన రీతిలో వ్యవహరిస్తున్నారని, ఇది నేరపూరితమని ఐద్వా రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా సంరక్షణ కార్యదర్శులకు కాకీ ప్యాంట్‌, చొక్కా కుట్టించడం అప్రజాస్వామికమని ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై తక్షణమే హోంమంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు బాధ్యులైన అధికారులను విచారించి తగు చర్యలు తీసుకోవాల న్నారు. అంతకుముందు కాకినాడ, మరికొన్ని జిల్లాల్లో పురుష టైలర్స్‌తో కొలతలు తీస్తూ అభ్యంతరకరమైన రీతిలో వ్యవహరించారని తెలిపారు. మహిళా ఉద్యోగినులను ఒత్తిడికి గురిచేస్తూ పోలీస్‌ యునిఫాం ధరించేలా చేస్తున్నారన్నారు. మహిళలకు ఉన్న ఇబ్బందుల రీత్యా ప్యాంటు, షర్టు వేసుకోవాలని ఒత్తిడి చేయొద్దని, వారికి సౌకర్యంగా ఉండే వస్త్రాలు వేసుకునేందుకు అనుమతివ్వాలని ఆదేశాలు ఉన్నాయని వివరించారు. పోలీస్‌ యునిఫాం ప్యాంటు, షర్ట్‌ ధరించాలని పోలీసు అధికారులు మౌఖికంగా ఆదేశాలిచ్చారని తెలిపారు.