నేటి నుండి మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర ఉత్సవాలు

 


జనంసాక్షి/పాపన్నపేట ఫిబ్రవరి 28          జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలగుండా  అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. సోమవారం ఏడుపాయల జాతర  ఏర్పాటు పనుల పురోగతిని పరిశీలించి  సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతర ఎర్పాట్లపై ఇప్పటివరకు మూడు సార్లు సమావేశాలు ఏర్పాటు చేయడంతోపాటు పనులను పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. ఏడుపాయల వన దుర్గమాత ఆలయ ప్రాంగణంలో శివలింగం ఏర్పాటు, పూల అలంకరణ రాత్రి వరకు పూర్తవుతుందని అన్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు మంత్రి వర్యులు వన దుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పించి జాతరను ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు పాటిస్తున్నామని అన్నారు. ఇందుకోసం 1200 మంది పోలీసు సిబ్బంది, 600 మంది పారిశుద్య కార్మికులు, మరో 400ల మంది ఇతర సిబ్బందికి విధులు కేటాయించామని, వారు భగవత్కార్యంగా భావించి అంకితభావంతో పనిచేసి జిల్లా యంత్రాంగానికి మచ్చ రాకుండా చూడాలని కోరారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని ఉపేక్షించేది లేదని వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ట్రైనీ కలెక్టర్ అశ్విని వాకాడె, ఆర్డీఓలు సాయిరామ్, వెంకట ఉపెందర్రెడ్డి, శ్యామ్ ప్రకాశ్, డిపిఓ తరుణ్కుమార్ లతో కలిసి నాగ్సానిపల్లి, టేకుల  గడ్డ వద్ద ఏర్పాటు చేసిన బస్సు ప్రయాణ ప్రాంగణంను పరిశీలించి పోలీసులకు ట్రాఫిక్ నియంత్రణా చర్యలను వివరించారు.