వాస్తవాలను విస్మరించిన మోడీ

మోడీ ప్రసంగంపై మండిపడ్డ పొన్నాల

హైదరాబాద్‌,ఫిబ్రవరి8(జనం సాక్షి): రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో ప్రధాని మోడీ వాస్తవాలకు భిన్నంగా మాట్లాడారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్‌ ఇచ్చింది అని నిజం ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మూడు రాష్టాల్రను ఏర్పాటు చేసిన బీజేపీ... ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారా? అని ప్రశ్నించారు. చప్పట్లు కొడితే, దీపాలు వెలిగిస్తే కరోనా ఆగిందా? అని నిలదీశారు. ప్రజాస్వామ్యం కోసం నిరంతరం పాటుపడే పార్టీ కాంగ్రెస్‌ అని అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు కాంగ్రెస్‌ ఏం చేసిందని మోదీ అడుగుతున్నారని.... రైతు రుణమాఫీ చేసి, మద్దతు ధరపై కమిషన్‌ వేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది అని చెప్పుకొచ్చారు. స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీని పట్టుకుని తుకుడే.. తుకుడే పార్టీ అని మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. చమురు ధరలు విపరీతంగా పెంచి, సామాన్యుల నడ్డి విడిచిన చరిత్ర మోడీదని మండిపడ్డారు. పారిశ్రామికులకు మేలు చేయడం మినహా.. సామాన్యులకు
మోడీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఏ పార్టీకైనా అధికారం శాశ్వతం కాదని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.