టెన్సిన్‌ స్టార్‌ను వేధించిన పోకిరీకి మొట్టి కాయలు


ఆమె వైపు వెళ్లకుండా కోర్టు కఠిన ఆదేశాలు

లండన్‌,ఫిబ్రవరి25( జనంసాక్షి ): బ్రిటన్‌ టెన్నిస్‌ సంచలనం ఎమ్మా రాడుకానును వెంబడిస్తూ వేధించిన కేసులో అమ్రిత్‌ మగర్‌ అనే వ్యక్తికి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ కోర్టు మొట్టికాయలు వేసింది. ఎమ్మాను వేధించినందుకు గానూ ఈ సైకో అభిమానిని ఐదేళ్లపాటు ఆమెకు చుట్టుపక్కలకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. గతేడాది నవంబరు 1 నుంచి డిసెంబరు 4 వరకు మగర్‌ ఎమ్మాను వెంబడిరచాడు. మూడుసార్లు ఆమె ఇంటికి వెళ్లి వివిధ బహుమతులు, కార్డులు అక్కడ పెట్టాడు. తాను ఎమ్మాను కలిసేందుకు 23 మైళ్ల దూరం నడిచానని, కాబట్టి తాను ఆమె ప్రేమకు పాత్రుడినని ఓ నోట్‌ రాశాడు. అంతేకాదు ఎమ్మా ఇంటి వద్ద ఉన్న క్రిస్‌మస్‌ ట్రీని కూడా అతడు దొంగిలించాడు. అంతేగాక ఆమె తండ్రి షూ కూడా ఎత్తుకొచ్చాడు.
ఈ క్రమంలో ఎమ్మా రాడుకాను తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు మగర్‌ను దోషిగా తేల్చింది. ఇక ఈ వేధింపుల గురించి ఇటీవల ఎమ్మా మాట్లాడుతూ... అతడి ప్రవర్తన తనను భయాందోళనకు గురిచేసిందని, ఈ ఘటన తర్వాత ఒంటరిగా బయటకు వెళ్లలేకపోయానని చెప్పుకొచ్చింది. నా ఇంట్లోనే నాకు భద్రత లేదంటే మరి ఎక్కడ రక్షణ ఉంటుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా 19 ఏళ్ల ఎమ్మా యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.