హైదరాబాద్‌కు నలువైపులా ఐటీ విస్తరణే లక్ష్యం ` కేటీఆర్‌


హైదరాబాద్‌,ఫిబ్రవరి 13(జనంసాక్షి):హైదరాబాద్‌కు నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తూర్పు హైదరాబాద్‌లో లక్ష మంది ఉద్యోగులు పని చేసేలా కార్యచరణ రూపొందించామన్నారు. జెన్‌ ప్యాక్ట్‌ విస్తరణ పూర్తయితే లక్ష లక్ష్యానికి సవిూపిస్తామని కేటీఆర్‌ అన్నారు. నగరంలోని ఉప్పల్‌లో జెన్‌ ప్యాక్ట్‌ విస్తరణకు మంత్రి మల్లారెడ్డితో కలిసి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.జెన్‌ ప్యాక్ట్‌ సంస్థకు హృదయపూర్వక అభినందనలు చెప్పారు. తూర్పు ప్రాంత అభివృద్ధి కోసం నాగోల్‌లో శిల్పారామం ఏర్పాటు చేశామని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఈ ప్రాంతంలోనే ఉందని మంత్రి చెప్పారు. ఉప్పల్‌ నుంచి నారాపల్లి వరకు, ఉప్పల్‌ జంక్షన్‌లోనూ స్కైవాక్‌ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. పశ్చిమ హైదరాబాద్‌కు దీటుగా తూర్పు హైదరాబాద్‌ ఎదుగుతుందోని కేటీఆర్‌ అన్నారు. ఇక్కడ ఐటీ పార్కుల నిర్మాణానికి డెవలపర్లు ముందుకొస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు డెవలపర్లకు ప్రభుత్వం తప్పకుండా మద్దతిస్తుందని కేటీఆర్‌ హావిూ ఇచ్చారు. జెన్‌ప్యాక్ట్‌ వరంగల్‌లోనూ విస్తరిస్తున్నందుకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.