కోదాడలో చిక్కిన అంతరాష్ట్ర దొంగల ముఠా..


సూర్యాపేట: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకుని వారి నుండి బంగారం, నగదును రికవరీ చేసినట్లుగా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.కేసు వివరాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్ క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్‌నగర్ సీఐ రామలింగ రెడ్డి తన పోలీసు సిబ్బందితో హుజుర్‌నగర్‌లోని ఇందిరా చౌక్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కోదాడ వైపు నుంచి వస్తున్న లారీలో అంతర్రాష్ట్ర దొంగలు దేవరకొండ రాంబాబు, దేశావత్ ఈశ్వర్‌లు పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. విచారణలో భాగంగా వారి వద్ద నుంచి సుమారు రూ.13 లక్షల విలువ గల 27 తులాల బంగారం, నగదు రూ. 2,50,000 మొత్తం రూ.15,50,000లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దేవరకొండ రాంబాబుపై తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 9 కేసులు ఉన్నాయని చెప్పారు. రాంబాబు ఒంటిపై దుస్తులు లేకుండా దొంగతనాలకు పాల్పడతాడని పోలీసులు వెల్లడించారు. వీరు దొంగతనం చేసిన అనంతరం బస్సులు, లారీల్లో ప్రయాణం చేస్తారని పేర్కొన్నారు