వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు


అభయారణ్యాల్లో అండర్‌పాస్‌ల నిర్మాణం

రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం
రాష్ట్ర వన్య ప్రాణి మండలి సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్‌,ఫిబ్రవరి 24 (జనంసాక్షి ): అభయారణ్యాల్లో రహదారుల నిర్మాణాలు, వన్యప్రాణుల ఆవాసాలకు అడ్డు రాకుండా అవి స్వేచ్ఛగా సంచరించేందుకు అండర్‌ పాస్‌ల ఏర్పాటుకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. అభయారణ్యాల్లో వన్యప్రాణులు స్వేచ్చగా సంచరించేలా రహదారుల వద్ద అండర్‌ పాస్‌ల నిర్మాణం, వేగ నియంత్రణ, రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం, అఖిల భారత పులుల గణన, తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అధ్యక్షతన గురువారం రాష్ట్ర వన్య ప్రాణి మండలి సమావేశం జరిగింది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నుంచి వర్చువల్‌ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొనగా, అరణ్య భవన్‌ నుంచి అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర వన్యప్రాణి బోర్డు గతంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రగతిని గురించి పీసీసీఎఫ్‌ ఆర్‌. శోభ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మండలి సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ వన్యప్రాణి సంరక్షణకు తగిన చర్యలు తీసుకున్నాకే రహదారుల నిర్మాణం, అండర్‌ పాస్‌ ల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసినట్టు తెలిపారు.రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపిన ప్రతిపాదనలకు కేంద్ర వన్యప్రాణి మండలి నుంచి త్వరితగతిన అనుమతులు వచ్చేలా చూడాలని తెలిపారు. రహదారుల నిర్మాణం, మరమ్మత్తులు సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభయారణ్యల్లో వన్యప్రాణుల ప్రమాదాల భారిన పడకుండా వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్‌ బ్రేకర్లను ఏర్పాటు చేసి, వేగ నియంత్రణ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వన్య ప్రాణుల దాహాన్ని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, శాంతికుమారి, పీసీసీఎఫ్‌ ఆర్‌. శోభ, పీసీసీఎఫ్‌ (సోషల్‌ ఫారెస్టీ) ఆర్‌.ఎం, డొబ్రియల్‌, బోర్డు సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే కోనప్ప, రాఘవ, ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు.