యువత మత్తు వైపు మళ్లకుండా చూడడం అందరి బాధ్యత - డిఎస్పి సదయ్య


డోర్నకల్ ఫిబ్రవరి 9 (జనం సాక్షి)

మహబూబాబాద్ ఎస్పీ శరచ్చంద్ర పవర్ ఆదేశానుసారం బుధవారం డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో గంజాయి,మత్తుపదార్థాల నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానుకోట డిఎస్పి సదయ్య హాజరయ్యారు.సర్పంచులు,కౌన్సిలర్లు,రెవిన్యూ, వ్యవసాయ,పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ... దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి,మత్తు పదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్ట్యా మత్తుపదార్థాల సరఫరా,ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు.మత్తు పదార్ధాలకు యువతను దూరం చేయాలనే లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గంజాయి,గుట్కా,గుడుంబా, గేమింగ్ (పేకాట) మత్తు పదార్థాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.యువతను,ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మనపైనే ఉందని పేర్కొన్నారు.మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తి మత్తులో ఎన్నో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ముందుగానే దాన్ని నిర్మించాలన్నారు. గ్రామాల్లో,పట్టణంలో మత్తు పదార్థాలు రవాణా, క్రయ విక్రయలు చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు,స్థానిక పోలీస్,ఎక్స్చేంజ్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.మత్తు పదార్థాలు అమ్మినా,తీసుకున్నా కొన్ని సందర్భాల్లో పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సిఐలు శ్రీనివాస్,రమేష్ చంద్ర,ఎస్సై రమాదేవి, డిప్యూటీ తాసిల్దార్ సుధాకర్,చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం,సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బోయినపల్లి వెంకన్న వివిధ గ్రామాల సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.