ఉక్రెయిన్ లో యుద్ధం వస్తుందా?

 


ఫ్రెంచ్ ప్రెసిడెంట్  మాక్రాన్ ఉక్రెయిన్ యుద్ధ నివారణకు రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్సకీ, జర్మనీ ఛాన్సలర్ ఉల్ఫ్ షుల్జ్ తో సుదీర్ఘ చర్చలు జరిపారు. శిఖరాగ్ర సమావేశానికి రష్యా అమెరికా అధ్యక్షులిద్దరూ సూత్రప్రాయంగా అంగీకరించారు. అమెరికా అధికారుల కథనం ప్రకారం లక్ష పదివేల సైన్యాన్ని ఉక్రెయిన్ సరిహద్దులలో రష్యా మోహరించింది. ఫిబ్రవరి 16 వ తేదీన  లక్షా యాభై వేల మంది సైనికులతో పూర్తిస్థాయిలో ఉక్రెయిన్ పై దాడి చేయాలని నిర్ణయించుకుందని మొన్నటిదాకా చెప్పింది., ఏ క్షణమైనా దాడి చేయవచ్చని అమెరికా అనుకూల మీడియా పదే పదే చెప్తూంది. ఉక్రెయిన్ పై దాడి తమ ధ్యేయం కాదనీ, రష్యా యొక్క రక్షణ గ్యారెంటీ లే ప్రధానమని రష్యా అధినేత పుతిన్  చెప్తున్నారు. ఉక్రెయిన్ కు నాటో సైనిక కూటమి లో స్థానం కల్పించకుండా పశ్చిమ దేశాలు రక్షణ పరమైన హామీ ఇవ్వాలని, మే 1997 తర్వాత నాటో లో సభ్యులుగా చేరిన దేశాల్లో నాటో ఆయుధాలను, బలగాలను మోహరించరాదని  రష్యా డిమాండ్ చేస్తున్నది. ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకుంటే రష్యా చూస్తూ ఊరుకోదని పుతిన్  స్పష్టం చేశారు.

ఉక్రెయిన్ కు రష్యాకు తగాదా ఏమిటి? మధ్యలో అమెరికా ఎందుకు వచ్చింది. ?తగాదా వలన ఎవరి ప్రయోజనాలు నెరవేరతాయి?

రష్యా, ఉక్రెయిన్ లు సోవియట్ యూనియన్ లో భాగంగా వున్నపుడు, వివిధ జాతుల మధ్య ఐక్యతను సాధించారు. జాతుల మధ్య వైరుధ్యాలు లేకుండా ప్రజలంతా ఐక్యంగా సమ సమాజ  స్థాపన చేసుకుంటూ రెండవ ప్రపంచ యుద్ధంలో 27,000,000 మంది ప్రాణత్యాగంతో ఫాసిజం ప్రమాదం నుంచి ప్రపంచ ప్రజలను కాపాడారు. అమెరికా కుట్రలకు అంతర్గత సిధాంత దివాళాకోరుతనం తోడయి 1991లో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్  రిపబ్లిక్ విఛిన్నమయింది. ఒక దేశంగా అవతరించిన ఉక్రెయిన్ కి తూర్పున రష్యా,  పశ్చిమంగా పోలండ్ వున్నాయి. పోలండ్ పక్కన జర్మనీ ,ఫ్రాన్స్ దేశాలున్నాయి. తూర్పు ఉక్రెయిన్ ప్రజలు రష్యా భాష మాట్లాడుతుండగా పశ్చిమ ఉక్రెయిన్ ప్రజలు ఉక్రెయిన్ భాష మాట్లాడుతున్నారు. శతాబ్దాలుగా ఒకటై జీవించిన రష్యన్లు-ఉక్రెయిన్ల మధ్య అమెరికా భాషా భేదాలను జాతి భేదాలు రెచ్చగొట్టగలిగింది.

 నాటో సైనిక కూటమి విస్తరణ 

 1949 లో సోవియట్ కి వ్యతిరేకంగా అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతోనాటో. సైనిక కూటమి గా ఏర్పడింది. నాటోసభ్య దేశాల్లో ఏ ఒక్క దేశం పైన అయినా సాయుధ దాడి జరిగినట్లయితే.. ఆ దేశానికి మిగతా దేశాలన్నీ సహాయంగా రావాలన్నది ఈ కూటమి ఒప్పందం. సోవియట్ అనుకూల దేశాలు వార్సా కూటమి గా ఏర్పడ్డాయి. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత సైనిక కూటముల అవసరం ముగిసిందనుకున్నారు. వార్సా కూటమి రద్దు అయింది. కానీ నాటో రద్దు కాలేదు. సోవియట్ అనుకూల పోలండ్, రుమేనియా  నాటో సభ్య దేశాలయ్యాయి. ఇప్పుడు నాటో సభ్య దేశాల సంఖ్య 30కి పెరిగింది.నాటో  దురాక్రమణ యుధాలతో ప్రపంచప్రజలను యుధాలలోకి నెట్తూనేవుంది.      

యూరోపియన్ యూనియన్ లో ఉక్రెయిన్ ను చేర్చుకుని ఆర్థిక బంధాలను బలపరచి రష్యా నుంచి దూరం చేసి యూరోపియన్ యూనియన్ ను, నాటో ను విస్తరించాలని అమెరికా కుట్రలు పన్నుతూనే వుంది. యూరప్ ప్రజలు యుధం వద్దంటున్నా నాటో కూటమి యుద్ధం కావాలని రాజకీయం నడుపుతున్నది.

సంభాషణల ద్వారా అంగీకరించిన మిన్స్ -2 అగ్రీమెంటు 2015 ని అమలుపరచి శాంతిని సాధించాలని ఉక్రెయిన్, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ప్రయత్నించాయి.. అమెరికా దురాక్రమణ ప్రయోజనాల దృష్ట్యా ప్రయత్నాలను చెడగొట్టింది, రష్యా యూరప్ తో సఖ్యంగా ఉండాలని చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా అడ్డుపడ్తూంది..ఉక్రెయిన్ ను రష్యాకు దూరం చేయాలనే ధ్యేయంతో అమెరికా కృషి చేస్తున్నది ఉక్రెయిన్ ను నాటో సైనిక కూటమి లో సభ్య దేశంగా చేర్చుకుని నాటో సైనిక కూటమిని విస్తరించాలనీ రష్యా కు వ్యతిరేకంగా నిలపాలని అమెరికా ప్రయత్నిస్తూంది.

ఎట్టి పరిస్థితులలోనూ పక్కలో బల్లెం గా వుండే నాటోను సహించేది లేదని రష్యా అడ్డం  తిరిగింది.

క్యూబా లో రష్యా న్యూక్లియార్  మిస్సైల్స్ ని అమెరికా అంగీకరించిందా 

అమెరికా లోని ఏ పట్టణాన్నైనా క్షణాలలో భస్మీపటలం చేయగలిగనంత శక్తివంతమైన మిస్సైల్స్ ని క్యూబా రక్షణ కోసం సోవియట్ రష్యా క్యూబా లో ఏర్పాటు చేసింది. క్యూబా లో రష్యా న్యూక్లియార్  మిస్సైల్స్ ను ఏర్పాటు చేయడం అమెరికా సహించలేకపోయింది. అణు యధ ప్రమాదం అమెరికా ముంగిట్లోకి వచ్చిందని గగ్గోలు పెట్టింది. అణుయుధపుటంచులకు  మిస్సైల్స్ సంక్షోభం వెళ్ళింది.13 రోజులు అమెరికా వణికిపోయింది. క్యూబాలోని మిస్సైల్స్ ని రష్యా తీసివేసిందని నవంబర్ 2, 1962 న కెనెడీ ప్రకటించారు,కానీ రష్యాకు వ్యతిరేకంగా టర్కీలో ఎక్కుపెట్టిన మిస్సైల్స్ ని అమెరికా తొలగించడాన్ని కెనెడీ ప్రకటించలేదు. 1962 లో అమెరికా కు 90 మైళ్ళ దూరంలో వున్న క్యూబా లో అణ్వాయుధ మిస్సైల్స్ పెట్టడం తప్పయినపుడు

 రష్యాకు 100 మైళ్ళ దూరంలో పోలెండ్ లో అణ్వాయుధ మిస్సైల్స్ పెట్టడం తప్పు కాదా . రష్యాను చుట్టుముట్టే టట్లుగా ఉక్రెయిన్, పోలెండ్, దేశాలలో మిలిటరీ స్థావరాలను పెట్తున్నది.

రష్యా సరిహద్దులలో ఉన్న దేశాలను నాటో సభ్యులు గా చేర్చుకుని రష్యాను చుట్టుముట్టి అంతం చేయాలనేది అమెరికా కోర్కె అని పుతిన్ అంటున్నారు.మా మిస్సైల్స్ ని అమెరికా సరిహద్దులలో ఏర్పాటు చేయలేదు. మేము బ్రిటన్, అమెరికా సరిహద్దులకు రాలేదు. మాఇంటిపైన మిస్సైల్స్ ని ఎందుకు పెట్తున్నారని పుతిన్ అడుగుతున్నాడు. అమెరికా సరిహద్దులోవున్న కెనడా లోనో మెక్సికో లోనో మా మిస్సైల్స్ ని ఏర్పాటు చేస్తే మీరేం చేస్తారని కూడా పుతిన్ అడుగుతున్నాడు.

సంక్షోభాన్ని ఎవరు ప్రారంభించారని ప్రశ్నించాడు.1990 సం.లో మేము ఒక్క అంగుళం కూడా తూర్పుకి రాము అని నాటో ఇచ్చిన గారంటీ ఏమైందంటున్నాడు పుతిన్. రష్యా అమెరికా తో స్నేహం గా ఉండటానికి ప్రయత్నించింది. రష్యా న్యూక్లియార్ సైట్స్ ను అమెరికా సీఐఏ పరిశీలించటానికి అనుమతించింది. అయినా రష్యన్ ఫెడరేషన్ ని విఛిన్నంచేశారని పుతిన్ ప్రెస్ మీట్ లో అన్నారు.గ్ గ్యాస్ రాజకీయం

        ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో అతి కీలకమైనది గ్యాస్‌ పైపులైన్‌ సమస్య. రష్యాపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలను విధించాలని అమెరికా నాటో ద్వారా ఒత్తిడి చేస్తోంది. రష్యా పై ఆంక్షలు విధిస్తే యూరోపియన్ యూనియన్ కు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే మా పరిస్థితి ఏంటని యూరోపియన్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. యూరప్ దేశాల గ్యాస్ దిగుమతుల్లో 40 శాతానికి పైగా రష్యా నుంచే ఉంది. రష్యా నుంచి ఐరోపా దేశాలకు గ్యాస్‌, పెట్రోలు సరఫరా చేయాలంటే ఉక్రెయిన్‌ భూభాగం మీదుగా వేసిన పైపులైన్లే ఆధారం.అయితే ఉక్రెయిన్‌ పాలకులు తరచూ ఈ పైపులైన్లను స్తంభింపజేస్తామని బెదిరిస్తుండడంతో రష్యా ప్రత్యామ్నాయం గా  బాల్టిక్‌ సముద్రగర్భం గుండా11 బిలియన్ల ఖర్చుతో  నార్డ్ స్ట్రీమ్ 2 గాస్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టింది. జర్మనీ వరకు పూర్తి చేసింది. ఫ్రాన్స్‌కు కూడా దీని ద్వారా ఇంధన సరఫరా చేస్తానంది. ఎలాగోలా తగాదా సృష్టించి కొత్త పైప్ లైన్ పూర్తి కాకుండా.రష్యా యూరప్ కు దగ్గర కాకుండా చూడాలని అమెరికా తహతహలాడుతోంది

  జర్మనీ, ఫ్రాన్స్ లు యుద్ధానికి సిద్ధంగా లేవు. అమెరికా దూకుడు తమ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని జర్మనీ, ఫ్రాన్స్ లు భావిస్తున్నాయి.

అమెరికాయుధాన్ని ఎందుకు కోరుతున్నది

2006 లో సద్దాం హుస్సేన్ ని ఉరి తీశారు. మానవ హనన రసాయన ఆయుధాల ఉన్నాయని పచ్చి అబద్ధాలు చెప్పి ఇరాక్ నాయకుడిని హత్య చేశారు. లిబియా లో నాటో జోక్యం చేసుకుని కల్నల్ గద్దాఫీ హత్య తప్పితే సాధించిందేమీ లేదు. 20 సం.లు ఆఫ్ఘనిస్థాన్ లో యుద్ధం చేసి బాంబు దాడులలో వేల మందిని హతమార్చినా గెలవలేక తిరిగి వచ్చింది. వియత్నాం, కొరియా,ఇరాక్, లిబియా,యుగోస్లేవియా, ఆఫ్ఘనిస్థాన్  యుద్ధాలలో చావు దెబ్బతిన్నా 200 సైనిక స్ధావరాలను మూసేయలేదు. అధిపత్య ధోరణితో విశ్వవ్యాపితంగా తమ సైనిక కార్యకలాపాలను పెంచుకుంటున్నాయి. నాటో వలన ప్రభుత్వ ధనం ప్రవహించడం  వలన ఖర్చు తప్ప ఉపయోగం లేదని ట్రంప్ అన్నాడు. నాటో కి బ్రెయిన్ డెడ్ అయి మెదడు పని చేయడం లేదని ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ అన్నాడు.అమెరికా,ఆస్ట్రేలియా,బ్రిటన్ ల తో ఏర్పడిన ఆకస్ పై ఫ్రాన్స్ ,అమెరికా పై మండిపడి తన రాయబారిని వెనక్కి పిలిచింది. అననుకూల పరిస్ధితులలో జో బిడెన్ నాటో కు, పూర్వ వైభవాన్ని తేవాలని ప్రయత్నం చేస్తున్నాడు.

 ఉక్రెయిన్ లోనూ, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలోనూ తగాదాలను పెట్టి యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఆయుధాలను అమ్ముకుంటూ తన నాయకత్వాన్ని కాపాడుకోవాలని అమెరికా అనుకుంటున్నది. నాటో విస్తరణ ను, యూరోపియన్ యూనియన్ విస్తరణను ఆపి రష్యా సరిహద్దులను కాపాడుకోవాలని  పుతిన్ పావులు కదుపుతున్నాడు.

 అమెరికాకు యుద్ధ వాతావరణం కావాలి కానీ యుధం అవసరం లేదు. యుద్ధం చేయాలంటే కొరియా, వియత్నాం,ఆఫ్ఘనిస్థాన్ లు గుర్తొస్తున్నాయి. తమ దేశ ప్రజలు యుద్ధంలోకి రారు. వేరెవరినైనా రెచ్చగొట్టి ఆయుధాలు, డబ్బులు ఇచ్చి యుధాలు చేయించి ఆయుధాలను అమ్మి కార్పొరేట్ కంపెనీల మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కు లాభాలను పంచుతూ ఉండాలి.  ప్రభావిత ప్రాంతాలను కాపాడుకోవడమే ధ్యేయంగా అమెరికా అడుగులు వేస్తున్నది. వలసలు లేని వలన వాదాన్ని కొనసాగిస్తున్నాయి. నూతన ప్రపంచం లో కార్పొరేట్ కంపెనీల దోపిడీని రక్షించడమే ప్రభుత్వాల ప్రధాన కర్తవ్య మయింది .కార్పొరేట్ కంపెనీల వ్యాపార ప్రయోజనాలే రాజకీయాలను నడిపిస్తున్నందున  ప్రజల ఆదాయాలు క్షీణిస్తూ  కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు అనూహ్య రీతిలో పెరిగి ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్నాయి. అంతర్జాతీయ సోషలిస్టు శక్తుల ఐక్యకార్యాచరణ తో ఫైనాన్స్ పెట్టుబడిని నియంత్రించి యుధోన్మాదుల ఆటలు కట్టించి ప్రపంచశాంతిని కాపాడాలి.

  22-02-2022.                             డాక్టర్ కొల్లా రాజమోహన్,  నల్లమడ రైతు సంఘం, గుంటూరు