1.9 నెలల్లో కొలువుల భర్తీ

 


1.9 నెలల్లో కొలువుల భర్తీ
` జూన్‌లో కొత్త పెన్షన్లు
` కరీంనగర్‌కు నయాపైసా పనిచేయని బండి
` నన్నడిగితే వేయిపనులు చెబుతా
` బండి ఒక్క పనైనా చేసాడేమో చెప్పాలి
` మూడేండ్లయినా మూడు కోట్ల పనులు లేవు
` కరీంనగర్‌లో సభలో సంజయ్‌పై ధ్వజమెత్తిన కేటీఆర్‌
` నగరంలో వివిధ అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన
కరీంనగర్‌,మార్చి 17(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగఖాళీలభర్తీ ప్రక్రియను 9 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.కరీంనగర్‌ జిల్లాలో రూ. 1,067 కోట్లతో వివిధ పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్‌ ప్రసంగిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. కరీంనగర్‌ పట్టణానికి అర పైసా పని కూడా చేయని బండి సంజయ్‌పై ధ్వజమెత్తారు. దమ్ముంటే మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలువాలని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలవాలని బండికి సవాల్‌ విసిరారు. తెలంగాణకు కేంద్రం ఏం అభివృద్ధి చేసింది? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం బండి సంజయ్‌ ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా అని నిలదీశారు. హిందూ ముస్లిం పంచాయతీ తప్ప సంజయ్‌కు ఏవిూ రాదని ఎద్దేవాచేశారు. కరీంనగర్‌కు కనీసం ఓ గుడి అయినా తెచ్చావా అని ప్రశ్నించారు. మూడేళ్లలో మతం పిచ్చి కడుపు నింపదని, బండి సంజయ్‌ యువతను చెడగొడుతున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కరీంనగర్‌ను ఒక లక్ష్మీనగరంగా సీఎం చూస్తారు. ఇక్కడ ప్రారంభించే ప్రతి పని విజయవంతం అవుతుందని కేసీఆర్‌ నమ్ముతారు. మే 17, 2001న సింహగర్జన సభ పెట్టి తెలంగాణ సాధనకు నాంది పలికారు. తెలంగాణ వచ్చింది. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తెలంగాణ రాకముందు రూ. 200 పెన్షన్‌ ఉండే. ఇప్పుడు ఆసరా పెన్షన్ల కింద రూ. 2016లు ఇస్తున్నాం. ఆసరా పెన్షన్లు పెద్ద మనషుల్లో ఆత్మగౌరవం తీసుకొచ్చింది. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది మాత్రమే. భర్తల చేత నిరాదరణకు గురైన మహిళలకు సైతం పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు రూ. 3,016 ఇస్తున్నాం. కులం, మతంతో సంబంధం లేకుండా 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అమలు చేసి లక్షా నూట పదహారులు ఇస్తున్నామని కేటీఆర్‌ గుర్తు చేశారు. కరీంనగర్‌ జిల్లాకు మెడికల్‌ కాలేజీ కేటాయించాం. వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా ప్రారంభం కాబోతున్నది అని కేటీఆర్‌ తెలిపారు. రూ. 1067 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. కరీంనగర్‌కు ఒకప్పుడు తాగునీటికి ఇబ్బంది ఉండేది. ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. 50 వేల కనెక్షన్లకు 24 గంటల పాటు నీళ్లు ఇస్తామన్నారు. కరీంనగర్‌ ఎల్‌ఎండీ వద్ద అద్భుతమైన తీగల వంతెనను నిర్మించారు. రూ. 410 కోట్లతో సదాశివపల్లి దాకా మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులకు శంకుస్థాపన చేశామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.
కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి.. ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెయ్యి పనులు చేసింది. వినోద్‌ కుమార్‌ ఎంపీగా ఉన్న సమయంలో స్మార్ట్‌ సిటీ స్టేటస్‌ కరీంనగర్‌కు వచ్చింది. బండి సంజయ్‌ గెలిచి మూడేండ్లు అయింది. కనీసం కరీంనగర్‌ పట్టణం కోసం రూ. 3 కోట్ల పని కూడా చేయలేదు. దమ్ముంటే చెప్పాలి. కరీంనగర్‌కే కాదు.. సిరిసిల్ల నేతన్నలకు పవర్‌ లూమ్‌ కస్టర్‌ ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. చొప్పదండికి కూడా ఏం
చేయలేదు. కాళేశ్వరం ద్వారా పూర్వ కరీంనగర్‌ జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కనీసం జాతీయ హోదా ఇప్పియ్యలేదు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కనీసం పార్లమెంట్‌లో కూడా మాట్లాడలేదని కేటీఆర్‌ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కరీంనగర్‌కు మెడికల్‌ కాలేజీ కేటాయించిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. కేంద్రం నుంచి ఒక మెడికల్‌ కాలేజీ, ట్రిపుల్‌ ఐటీ, ఐఐటీ రాలేదు. చివరకు పాలిటెక్నిక్‌ కాలేజీ కూడా తేలేదు. పొద్దున్నే లేస్తే హిందూ ముస్లిం అంటారు. ఒక గుడి కూడా తేలేదు. ఏం చేతకాదు. కేసీఆర్‌ను తిట్టడం, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. కరీంనగర్‌ ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయలేదు. చేనేత సముహాలు, బ్లాక్‌ లెవల్‌ క్లస్టర్‌ ఇవ్వాలని కోరితే కూడా తెప్పించలేదు. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో అర పైసా పని కూడా చేయలేదు. బూతులు తిట్టడం తప్ప మంచి చేసిందేవిూ లేదన్నారు. పిల్లల భవిష్యత్‌కు పనికొచ్చే పనికి ఒకటి కూడా చేయలేదు. పనికిమాలిన మాటలతో కడుపు నిండదు. మతం అనే పిచ్చి కడుపు నింపదు. భారతదేశానికి బువ్వ పెట్టే మొదటి నాలుగు రాష్టాల్ల్రోతెలంగాణ ఉంది. తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. బీజేపీ నాయకులు మాట్లాడే మాటలు డొల్ల మాటలు. బండి బాగా మాట్లాడుతున్నావ్‌.. దమ్ముంటే గంగుల విూద పోటీ చేసి గెలువాలని సవాల్‌ విసురుతున్నా. కమలాకర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

 

2.త్వరలో అందుబాటులోకి 8 కొత్త వైద్యకళాశాలలు
` రామగుండం మినహా మిగతా వైద్య కళాశాలల నిర్మాణాలు ఏప్రిల్‌లో పూర్తి
` రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి
హైదరాబాద్‌,మార్చి 17(జనంసాక్షి): పెద్దపల్లి జిల్లా రామగుండం మినహా మిగతా 8 వైద్య కళాశాలల నిర్మాణాలు ఏప్రిల్‌లో పూర్తవుతాయని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మొదటి సంవత్సరం కళాశాలల నిర్మాణాలు ఏప్రిల్‌లో పూర్తవుతాయాన్నారు. రామగుండం కళాశాల నిర్మాణం మాత్రం జూన్‌ నాటికి పూర్తవుతుందని చెప్పారు. వైద్య కళాశాలల నిర్మాణ పురోగతిపై ఆర్‌ అండ్‌ బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతి రెడ్డి, అధికారులతో మంత్రి సవిూక్ష నిర్వహించారు. నిర్మాణ పనులు పూర్తి నాణ్యతతో నిర్దేశిత సమయంలో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. పనులు వేగవంతం చేయాలని.. ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచించారు. వర్క్‌ చార్ట్‌ ప్రకారం పనులు జరగాలని.. పురోగతిని ప్రతిరోజూ సవిూక్షించాలని వెల్లడిరచారు. భవన నిర్మాణాలు పూర్తయిన చోట మొదటి ఏడాది తరగతుల నిర్వహణకు అవసరమైన వసతుల కల్పనకు టీఎస్‌ఎండీసీతో సమన్వయం చేసుకోవాలని ఈఎన్సీ గణపతిరెడ్డిని మంత్రి ఆదేశించారు.

 

3.భూముల అమ్మకంతో రూ.503కోట్ల ఆదాయం
హైదరాబాద్‌,మార్చి 17(జనంసాక్షి): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భూముల అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.503 కోట్లు ఆదాయం సమకూరింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని బహదూర్‌పల్లి, తొర్రూరుతో పాటు వివిధ జిల్లాల్లోని ఖాళీ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వేలం వేసింది. తొర్రూరు, బహదూర్‌పల్లితో పాటు నల్గొండ, మహబూబ్‌ నగర్‌, గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ప్లాట్లను విక్రయించారు. మరికొన్ని జిల్లాల్లో ప్లాట్లు అమ్ముడుపోలేదు. తొర్రూరులో గరిష్ఠంగా గజం స్థలం ధర రూ.50వేలుగా, సగటున రూ. 20వేల వరకు వచ్చింది. బహదూర్‌పల్లిలో గజం స్థలం ధర గరిష్ఠంగా రూ. 38,500, సగటున రూ. 25వేలు పలికింది. ఈ రెండు చోట్లా భూముల విక్రయంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.298 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లో గరిష్ఠంగా రూ.26 వేలు, సగటున రూ.8 వేలు ధర పలికింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని బహదూర్‌పల్లి, తొర్రూరుతో పాటు ఏడు జిల్లాల్లోని భూముల విక్రయంతో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 503 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది.

 

 

 

4.అవినీతి అధికారుల భరతం పడతా
` ఫిర్యాదుకు నా ఫోన్‌ నంబర్‌ ఇస్తా
` పంజాబ్‌ నూతన సీఎం భగవంత్‌మాన్‌
చండీగఢ్‌,మార్చి 17(జనంసాక్షి): పంజాబ్‌ నూతన సీఎం భగవంత్‌ మాన్‌ సంచలన ప్రకటన చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటిరోజే అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చరిత్రాత్మక నిర్ణయాన్ని వెల్లడిరచారు. భగత్‌సింగ్‌ వర్ధంతి రోజున (మార్చి 23న) అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ నంబర్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఆ హెల్ప్‌లైన్‌ నంబర్‌గా తన వ్యక్తిగత వాట్సాప్‌ నంబరే ఉంటుందని తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే దాన్ని వీడియో/ఆడియోను రికార్డు చేసి తనకు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్విటర్‌లో పేర్కొన్నారు. పంజాబ్‌లో ఇకపై అవినీతి పనిచేయదని హెచ్చరిస్తూ ట్వీట్‌ చేశారు.పంజాబ్‌ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఈ ఉదయం భగవంత్‌ మాన్‌ చేసిన ట్వీట్‌ ఉత్కంఠరేపింది. కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన భగవంత్‌ మాన్‌ ఎలాంటి చారిత్రక నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించడం విశేషం. ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లకు గాను ఆప్‌ 92 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే.

 

 

5.పుతిన్‌ యుద్ధ నేరస్థుడు:అమెరికా
` పాశ్చత్యదేశాల ఆధిపత్యం సహించం:రష్యా
మాస్కో,మార్చి 17(జనంసాక్షి):ఉక్రెయిన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తూ యుద్ధానికి దిగి సైనికులతో సహా వేలమంది సామాన్యపౌరులకు మరణాలకు కారణమైన రష్యాఅధ్యక్షుడు పుతిన్‌ యుద్ధనేరస్థుడని ఆమెరికా ఆరోపించింది.కాగా ఉక్రెయిన్‌ విషయంలో రష్యా అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతుందని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉద్ఘాటించారు. ఈ సమయంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సహించమన్న ఆయన.. వారికి తలొగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై దాడికి నిరసనగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తోన్న నేపథ్యంలో వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఉక్రెయిన్‌కు తటస్థ స్థితిపై చర్చించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్న పుతిన్‌.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగుతుందన్నారు.గడిచిన మూడు వారాలుగా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దాడులను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి టెలివిజన్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పాశ్చాత్య దేశాలు విధిస్తోన్న ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయని అంగీకరించిన ఆయన.. ఇటువంటి దెబ్బలను రష్యా తట్టుకొని నిలబడగలదనే ధీమా వ్యక్తం చేశారు.రష్యాను ఆర్థికంగా బలహీన దేశంగా మార్చాలని పశ్చిమదేశాలు కోరుకుంటున్నాయని వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా పశ్చిమదేశాలన్నీ కలిసి తీసుకుంటున్న చర్యల వెనుక భౌగోళిక రాజకీయ లక్ష్యాలున్నాయని ఆరోపించారు. రష్యాను బలమైన, సార్వభౌమాధికార దేశంగా చూడడం వారికి ఇష్టం లేదని పుతిన్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రష్యా విచ్ఛిన్నమవుతుందని లేదా ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందని వారు భావిస్తే.. రష్యా ప్రజల గురించి, మా చరిత్ర గురించి వారికి తెలియదు అంటూ పుతిన్‌ పశ్చిమ దేశాలను మరోసారి హెచ్చరించారు.దేశాన్ని నాశనం చేయడానికి రష్యాలోని కొందరు ద్రోహులను పశ్చిమ దేశాలు పావులుగా వాడుకుంటున్నాయని అధ్యక్షుడు పుతిన్‌ ఆరోపించారు. రష్యా కంటే పశ్చిమదేశాల వాదనకు సానుకూల గళాన్ని వినిపించే వారిని దేశద్రోహులుగా అభివర్ణించిన ఆయన.. అటువంటి వారిని రష్యన్‌ ప్రజలు తేలికగా గుర్తించగలరని అన్నారు. రష్యాను విభజించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని మరోసారి పేర్కొన్న ఆయన.. ‘ఫిఫ్త్‌ కాలమ్‌’ (రష్యాన్‌ విూడియాలో పుతిన్‌కు వ్యతిరేకంగా ఇటీవల ఓ జర్నలిస్ట్‌ నిరసన తెలిపిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ) సహాయంతో ఇక్కడి పౌరుల్లో ఘర్షణలు రేకెత్తించేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలా వారి ఏకైక లక్ష్యం రష్యాను నాశనం చేయడమేనని.. అయినప్పటికీ అటువంటి ప్రయత్నాలను రష్యా తిప్పికొడుతుందని వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు.

 

6.పోలాండ్‌ అందగత్తెకు ప్రపంచసుందరి కిరీటం
` మిస్‌ వరల్డ్‌ 2021గా కరోలినా బిలస్కా
న్యూఢల్లీి,మార్చి 17(జనంసాక్షి): పోలండ్‌కు చెందిన కరోలినా బిలస్కా మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలుచుకున్నది. ప్యూర్టోరికోలోని షాన్‌జువాన్‌లో జరిగిన 70వ ఎడిషన్‌ మిస్‌ వరల్డ్‌ 2021 పోటీల్లో కరోలినా విజేతగా నిలిచింది. అమెరికాకు చెందిన ఇండియన్‌ ఆరిజన్‌ శ్రీ సైనీ మొదటి రన్నరప్‌గా, కోట్‌ డి ఐవరీకి చెందిన ఒలివియా యాస్‌ రెండో రన్నరప్‌గా నిలిచింది.షాన్‌ జువాన్‌లోని కొకొ కోలా మ్యూజిక్‌ హాల్‌లో జరిగిన వేడుకల్లో 69వ ఎడిషన్‌ విజేత టోని ఆన్‌ సింగ్‌.. కరోలినాకు ప్రపంచ సుందరి కిరీటాన్ని బహూకరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజేతగా తన పేరు విన్నప్పుడు షాక్‌ అయ్యానని, ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని చెప్పారు. మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని ధరించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది.కాగా, కరోలినా ప్రస్తుతం మేనేజ్‌మెంటులో పీజీ చేస్తున్నది. తర్వాత పీహెచ్‌డీ చేస్తానని, అదేవిధంగా మోడల్‌గా కొనసాగుతానని తెలిపింది. బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, స్కూబా డైవింగ్‌, స్విమ్మింగ్‌ చేయడాన్ని ఆమె అమితంగా ఇష్టపడుతుంది.

 

7.ఇకపై నాలుగేళ్ల డిగ్రీ కోర్సు..
`8 సెమిస్టర్లు
` యూజీసీ కీలక నిర్ణయం
న్యూఢల్లీి,మార్చి 17(జనంసాక్షి):యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల కోర్సు, 8 సెమిస్టర్ల విధానానికి యూజీసీ గురువారం నాడు ఆమోదం పలికింది.ఈ నాలుగేళ్లలో ఒక్కో సెమిస్టర్‌ కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లలో మ్యాథ్స్‌, సోషల్‌, హ్యూమానిటీస్‌, వృత్తి విద్య వంటి సబ్జెక్టులు ఉంటాయని యూజీసీ తెలిపింది. మూడో సెమిస్టర్‌ ముగిసిన తర్వాత మేజర్‌, మైనర్‌ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆసక్తి, అప్పటివరకు విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా సబ్జెక్టుల కేటాయింపు ఉంటుంది. ఏడు, ఎనిమిది సెమిస్టర్లలో విద్యార్థులు తాము ఎంచుకున్న సబ్జెక్టులోని ఏదైనా అంశంపై పరిశోధనలు చేయాల్సి ఉంటుంది.కాగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ఆర్ట్స్‌, సైన్స్‌ గ్రూపులకు, వొకేషనల్‌, అకడమిక్‌ విభాగాలకు పెద్దగా వ్యత్యాసం ఉండదని యూజీసీ స్పష్టం చేసింది. మరోవైపు పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి కూడా యూజీసీ కీలక మార్పులు చేసింది. ఇప్పటికే ఉన్న నేషనల్‌ ఎలిజిబులిటీ టెస్టుకు అదనంగా మరో ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టింది. ఇన్నాళ్లు యూనివర్సిటీలు మాత్రమే పీహెచ్‌డీ ప్రవేశాలను అందించేవి. ఇకపై ఎన్‌ఈటీ లేదా జేఆర్‌ఎఫ్‌ ద్వారా 60 శాతం ప్రవేశాలను అధికారులు భర్తీ చేయనున్నారు. మిగిలిన 40 శాతం సీట్లను యూనివర్సిటీలు ప్రత్యేక కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించి భర్తీ చేయనున్నాయి. ఈ వివరాలను యూజీసీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు.

 

8.కరోనాలో మరో కొత్త వేరియంట్‌..
ఇజ్రాయెల్‌లో వెలుగులోకి..!
జెరూసలెం,మార్చి 17(జనంసాక్షి):ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. మళ్లీ విరుచుకుపడుతున్నట్లే కన్పిస్తోంది. వైరస్‌ తొలుత వ్యాపించిన చైనా సహా పలు దేశాల్లో కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.ఈ నేపథ్యంలో కరోనాలో మరో కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చినట్లు వార్తలు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్‌లో ఈ వేరియంట్‌ బయటపడినట్లు తెలుస్తోంది.తమ దేశంలో కరోనా కొత్త రకాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల విదేశాలకు వెళ్లి ఇజ్రాయెల్‌ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు వెల్లడిరచింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉద్ధృతంగా ఉన్న ఒమిక్రాన్‌ వెర్షన్‌లోని రెండు సబ్‌ వేరియంట్లు బీఏ.1, బీఏ.2లు కలిసి ఈ కొత్త వేరియంట్‌గా రూపాంతరం చెందినట్లు తెలిపింది. ‘’ఈ వేరియంట్‌ గురించి ఇంకా ప్రపంచానికి తెలియదు. మా దేశంలోనే పుట్టుకొచ్చి ఉంటుందని భావిస్తున్నాం. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అంచనాలు చేయలేం. వ్యాధి తీవ్రత ఎలా ఉండనుందన్నదో తెలియాలంటే అధ్యయనం చేయాల్సి ఉంది. అయితే ఇది గత వేరియంట్లతో పోలిస్తే మరీ అంత ప్రమాదకరం కాదని, దీని వల్ల మరో దశ ఉద్ధృతి ఉండకపోవచ్చని అనుకుంటున్నాం’’ అని ఇజ్రాయెల్‌ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతవరకూ స్పందించలేదు.ఈ వేరియంట్‌ బారిన పడిన ఇద్దరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జ్వరంతో పాటు కండరాల నొప్పి, తలనొప్పి వంటి మోస్తరు లక్షణాలు మినహా ప్రాణాపాయం ఏం లేదని చెప్పారు. వీరికి ప్రత్యేక చికిత్స ఏదీ అవసరం లేదని పేర్కొన్నారు.ఇజ్రాయెల్‌లో ఇటీవల కొత్త రకం బయటపడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో అక్కడ ఫ్లొరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా, ఇన్‌ఫ్లూయెంజా కలవడంతో డబుల్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా ఈ ఫ్లొరోనా వ్యాధి సోకుతున్నట్లు అధికారులు తెలిపారు.

 

9.వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలి
` సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌
హైదరాబాద్‌,మార్చి 17(జనంసాక్షి): ఉద్యోగ నియామకాల ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా ఖాళీల సమగ్ర వివరాలు, రూల్‌ ఆప్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌ తదితర సమాచారాన్ని వీలైనంత త్వరగా ఆర్థికశాఖకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియ సన్నాహకాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, నియామక బోర్డుల ఛైర్మన్‌లతో సీఎస్‌ సవిూక్ష నిర్వహించారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్‌, విద్య, వైద్యశాఖ కార్యదర్శులు సందీప్‌ కుమార్‌ సుల్తానియా, రిజ్వీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి తదితరులతో సోమేశ్‌ కుమార్‌ సమావేశమయ్యారు. పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఛైర్మన్‌ జనార్థన్‌రెడ్డి, పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు, ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి కూడా సమావేశంలో పాల్గొన్నారు. 80వేల పై చిలుకు పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని, అందుకు అనుగుణంగా ముందస్తు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్‌ అధికారులకు స్పష్టం చేశారు. ఖాళీల సమగ్ర సమాచారం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌ తదితరాలను ఖచ్చితంగా నిర్ధారించి ఆర్థికశాఖకు అందించాలని ఆదేశించారు. ఖాళీలతో పాటు రిజర్వేషన్లు, రోస్టర్‌, లోకల్‌ తదితరాలకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అధికారులకు స్పష్టం చేశారు. ఆయాశాఖల కార్యదర్శులు, హెచ్‌ఓడీలతో అన్ని అంశాలను సరిచూసుకొని నిర్ధారించుకున్న తర్వాత నియామకాలకు ఆయా నియామక సంస్థలకు అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది.

 

10.సివిల్స్‌ (మెయిన్‌) పరీక్ష ఫలితాలు విడుదల
దిల్లీ,మార్చి 17(జనంసాక్షి): అఖిల భారత సర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ మెయిన్‌`2021 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 7 నుంచి 16 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను యూపీఎస్‌సీ గురువారం విడుదల చేసింది. ఇంటర్వ్యూలకు 1,823 మంది అర్హత సాధించారు. మెయిన్‌ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్‌ 5 నుంచి ఇంటర్వ్యూలు దిల్లీలో ప్రారంభం కానున్నాయి. దేశంలో ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, తదితర అఖిల భారత సర్వీసులకు ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఏటా సివిల్స్‌ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తుంటుంది. ప్రిలిమినరీ, మెయిన్‌, ఇంటర్వ్యూ దశల్లో ఉద్యోగుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తోన్న విషయం తెలిసిందే.

 

11.దక్షిణ కొరియాలో కరోనా విలయం..
` ఒక్కరోజే 6లక్షల కొత్త కేసులు
సియోల్‌,మార్చి 17(జనంసాక్షి): దక్షిణ కొరియాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గత నెలరోజులుగా అక్కడ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో 6 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.దక్షిణ కొరియాలోకి మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి అని కొరియా వ్యాధి నియంత్రణ, నివారణ సంస్థ (కేడీసీఏ) వెల్లడిరచింది.దక్షిణకొరియాలో తాజాగా 24 గంటల వ్యవధిలో 6,21,328 కొత్త కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య ఏకంగా 55శాతం పెరగడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 82లక్షలకు చేరింది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో దక్షిణ కొరియాలో తొలిసారిగా ఐదంకెల కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి వైరస్‌ ఉద్ధృతి మరింత పెరుగుతూనే ఉంది. మార్చి 9న తొలిసారి 3లక్షలు దాటగా.. సరిగ్గా వారం రోజులకు కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఇదే సమయంలో మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా 429 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోగా.. ఒక రోజులో ఈ స్థాయిలో మరణాలు నమోదవ్వడం ఇదే తొలిసారి అని కేడీసీఏ తెలిపింది.ఒమిక్రాన్‌ వేరియంట్‌తో పాటు కరోనా ఆంక్షల సడలింపు కారణంగానే కేసులు అమాంతం పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్నప్పటికీ.. దేశంలో మరోసారి కఠిన ఆంక్షలు విధించే అవకాశాలు కన్పించడం లేదు సరికదా.. ఉన్న వాటిని మరింత సడలించాలని కొరియా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి బృందాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ఆంక్షలను ఎత్తివేసే అంశంపై ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ రాత్రి 11 గంటల తర్వాత బిజినెస్‌ కర్ఫ్యూతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ప్రైవేటు కార్యక్రమాల్లో ఆరుగురు కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదనే ఆంక్షలు అమల్లో ఉన్నాయి.