7నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు


తొలిరోజే బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న ఆర్థికమంత్రి

గవర్నర్‌ ప్రసంగం లేకుండానే సమావేశాల ప్రారంభం
వివిధ సమస్యలపై నిలదీసేందుకు విపక్షలు సిద్దం
విపక్షాలను ఎండగట్టేలా అధికార టిఆర్‌ఎస్‌ వ్యూహాలు
విపక్ష ఎమ్మెల్యేగా అడుగు పెట్టనున్న ఈటెల రాజేందర్‌
హైదరాబాద్‌,మార్చి5 (జనం సాక్షి):  ఈ నెల 7 నుంచి తెలంగాణ రాష్ట్ర బ్జడెట్‌ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. 2022`2023 సంవత్సరానికి మొదటి రోజే అసెంబ్లీలో ఆర్థికమంత్రి హరీష్‌ రావు బడ్జెట్‌ ప్రవేశ పెడతారు. ఈ యేడు గగవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండడం విశేషం. దీనిపై ఇప్పటికే విమర్శలు,ప్రతివిమర్శలు చెలరేగాయి. ఇకపోతే అధికార టిఆర్‌ఎస్‌ను నిలదీసేందుకు కాంగ్రెస్‌, బిజెపిలు తమ వ్యూహాలతో సిద్దంగా ఉన్నాయి. అలాగే విపక్షాల దాడిని
ఎదుర్కొనేలా అధికార పార్టీ సన్నద్దంగా ఉంది. ఇక ఈ సమావేశాల్లో ఈటెల రాజేందర్‌ బిజెపి ఎమ్మెల్యేగా అడుగు పెట్టనున్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూలపై అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, సభ్యుల సంఖ్యా బలంతో టీఆర్‌ఎస్‌ రెచ్చగొట్టే అవకాశమున్నందున సంయమనంతో వ్యవహరించాలని అన్నారు. అసెంబ్లీలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, ఖర్చు, నిధుల దారి మళ్లింపుపై చర్చకు సిద్ధం కావాలని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తీవ్ర అసహనంతో ఉన్న టీఆర్‌ఎస్‌.. బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు అధికార పక్షంవ్యూహాలు రచిస్తోంది. ప్రతిపక్షాలను ఆత్మరోణలోకి నెట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ ట్రాప్‌లో పడకుండా ప్రజా సమస్యలు, ఏడేళ్లలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని విపక్ష పార్టీలు సన్నద్దం అవుతున్నాయి. ఇకపోతే ప్రతి సంవత్సరం ప్రణాళిక కేటాయింపులు భారీగా వుంటున్నా, ఆయా శాఖలకు, పథకాలకు నిధుల విడుదల, వాస్తవ ఖర్చు క్రమంగా తగ్గిపోతున్నాయి. భవిష్యత్తుకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు శాస్త్రీయంగా లేకపోవడం వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. రాష్ట్ర అప్పు మూడు లక్షల కోట్లకు పైమాటే ఉంది. ఈ అప్పుపై గత రెండేళ్లుగా అసలు, వడ్డీ ప్రతి ఏటా భారీ మొత్తంలో చెల్లించాల్సి రావడం వల్ల, కీలక రంగాలకు నిధుల కొరత ఏర్పడుతున్నది. ప్రభుత్వం పన్నుల ఆదాయం కోసం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నదిని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేటాయించిన నిధులు సకాలంలో విడుదల చేయక పోయినా, ఖర్చు చేయకపోయినా, నిధులను దారి మళ్లించినా అడిగే పరిస్థితి లేదు. ప్రభుత్వం కేటాయి స్తున్న నిధులు కూడా ఆయా రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరించే దిశగా ఉపయోగపడటం లేదు. తెలంగాణాలో కోట్లాది మంది పేద మధ్య తరగతి ప్రజలకు అత్యవసరమైన విద్యా వైద్య రంగాలకు కేటాయింపులు అతితక్కువగా ఉండడం వల్ల, ప్రభుత్వ రంగంలో వీటి పని తీరు నాసిరకంగా ఉంటున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ రంగాలు పూర్తిగా ప్రైవేటు, కార్పొరేటు శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీ అనేది ఒక ప్రహసనంగా మారిపోయిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్‌ నిధులు 50 శాతం కూడా ఖర్చు చేయడం లేదు. నిధుల కోతకు గురవుతున్న రంగాలలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఇతర సామాజిక, సంక్షేమ రంగాలు ఉన్నాయి. ఆసరా పథకం కోసం గత మూడేళ్లుగా దరఖాస్తుదారులకు పెన్షన్‌లు చెల్లించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిరుద్యోగ భృతి, రైతులకు లక్ష రూపాయల ఋణ మాఫీ లాంటి ఎన్నికల హావిూలు అమలు చేయనే లేదు. పంట ఋణాలకు వడ్డీ రాయితీ నాలుగేళ్ళుగా చెల్లించకపోవడం, పంటల బీమా పథకాల అమలు నిలిపి వేయడం ఇలా అన్ని చోట్లా బకాయిలు పేరుకు పోతున్నాయి. వీటన్నిటిని ప్రస్తావించే అవకాశం ఉంది. ఉద్యోగ నియామకాలు, బదిలీ జీవో,దళితబందు లాంటి పథకాలు కూడా చర్చకరు వచ్చే అవకాశం ఉంది.