తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా


పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన జెనీలియా ఇటీవలే బాలీవుడ్‌ లో రీఎంట్రీ ఇవ్వగా తాజాగా ఇప్పుడు తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. విభిన్న కథలను ఎంచుకుంటూ వైవిధ్య భరిత పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న హీరోయిన్‌ జెనీలియా. సై, బొమ్మరిల్లు, రెడీ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంది. బాలీవుడ్‌ యాక్టర్‌, ప్రొడ్యూసర్‌ రితీష్‌ దేశ్‌ముఖ్‌ను జెనీలియా 2013లో పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం కావడంతో పాటు..ముంబైలోనే సెటిల్‌ అయింది.

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు,కన్నడ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వారాహి చలన చిత్రం పతాకంపై రజినీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన
పూజా కార్యక్రామాలు గ్రాండ్‌గా జరిగాయి. దర్శక దిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి ఈ వేడుకకు ముఖ్య అథితిగా వచ్చాడు. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో జెనీలియా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. 2012లో రానా నటించిన ’నా ఇష్టం’ తరువాత జెనీలియా ఇప్పటి వరకు మరో సినిమాలో నటించలేదు. ఈ చిత్రం జెనీలియా కీలకపాత్రలో నటించనుందట. దీని గురించి జెనీలియా ఇన్ట్సాగ్రామ్‌లో ’సౌత్‌ సినిమాల్లోకి నా రీఎంట్రీని ఇస్తున్నాను. నా ఇంటిగా భావించే ఇంటికి ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. నన్ను గుర్తుంచుకొని మరీ ఈ సినిమాలో భాగస్వామిని చేసినందుకు సాయి కొర్రపాటి, రాధాకృష్ణ రెడ్డికి ధన్యవాదాలు. డెబ్యూ ఫిల్మ్‌ సందర్భంగా కిరీటీకి శుభాకాంక్షలు. నీ తొలి చిత్రంలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను’ అంటూ జెనీలియా పోస్ట్‌ చేసింది.