ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి

` రష్యా మిసైల్‌ దాడిలో మృతి చెందిన కర్ణాటక వైద్యవిద్యార్థి నవీన్‌ శేఖరగౌడ
` ఆందోళనలో భారతీయులు
` ఘటనపై ప్రధాని దిగ్భార్రతి
` కుటుంబ సభ్యులకు ఫోన్‌లో ఓదార్పు
` ప్రభుత్వం అండగా ఉంటుందని హావిూ
` కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై విచారం..
` కీవ్‌ను కాళీ చేయాలని భారతీయులకు ఆదేశాలు
కీవ్‌,మార్చి 1(జనంసాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో భారత విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోవడం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో ఈ ఉదయం రష్యా ప్రయోగించిన షెల్‌ దాడిలో కర్ణాటకకు చెందిన నవీన్‌ శేఖరగౌడ ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని హవేరీ జిల్లాకు చెందిన నవీన్‌.. ఖార్కివ్‌లోని నేషనల్‌ మెడికల్‌ కాలేజీలో మెడిసిన్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఖార్కివ్‌లోని గవర్నర్‌ కార్యాలయం పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా ఖార్కివ్‌లో భయానక పరిస్థితులు నెలకొనడంతో వీరంతా సవిూపంలోని బంకర్‌లోకి వెళ్లారు.  మంగళవారం ఉదయం నవీన్‌ కర్ణాటకలో ఉంటున్న తన తండ్రికి ఫోన్‌ చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బంకర్‌లో భోజనం, నీళ్లు లేవని అప్పుడు నవీన్‌ చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ ఉదయం అతడు కరెన్సీ మార్చుకుని ఆహారం తెచ్చుకునేందుకు బంకర్‌ నుంచి బయటకు వచ్చాడు. గవర్నర్‌ కార్యాలయానికి సవిూపంలోనే ఉన్న ఓ గ్రాసరీ స్టోర్‌కు వెళ్లి అక్కడ క్యూలైన్‌లో నిల్చున్నాడు. అదే సమయంలో రష్యా బలగాలు.. గవర్నర్‌ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని షెల్‌ ప్రయోగించింది. అయితే అది కాస్తా గురితప్పి గ్రాసరీ స్టోర్‌ సవిూపంలో పడిరది. దీంతో నవీన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఉదయం ఖార్కివ్‌లోని భారత విద్యార్థి కో ఆర్డినేటర్‌ పూజ ప్రహరాజ్‌ నవీన్‌కు ఫోన్‌ చేశారు. అయితే అప్పటికే బాంబు దాడిలో నవీన్‌ మృతిచెందాడు. అతడి ఫోన్‌ను స్థానిక ఉక్రెయిన్‌ మహిళ ఒకరు లిఫ్ట్‌ చేసి.. నవీన్‌ మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లినట్లు చెప్పారని పూజ తెలిపారు.
భారతీయ విద్యార్థి మృతిపై ప్రధాని దిగ్భార్రతి
ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో మృతి చెందిన భారతీయ విద్యార్థి కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి తెలిపారు. ఖార్కివ్‌ కాల్పుల్లో భారతీయ విద్యార్థి నవీన్‌ మృతి చెందిన వార్త తెలియగానే.. అతని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ప్రధాని మోదీ మాట్లాడారు. నవీన్‌ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదిలాఉంటే.. కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన నవీన్‌ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సంతాపం ప్రకటించారు. నవీన్‌ తండ్రి శేఖర్‌ గౌడ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. నవీన్‌ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నవీన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నవీన్‌ పార్థీవ దేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.దీనికి సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుగుతున్నాయన్నారు. కాగా, తన కుమారుడు నవీన్‌తో ఇవాళ ఉదయం కూడా ఫోన్‌లో మాట్లాడానని, ప్రతి రోజూ రెండుసార్లు ఫోన్‌కాల్‌ చేసేవాడంటూ కుమారుడి గురించి చెబుతూ నవీన్‌ తండ్రి శేఖర్‌ గౌడ్‌ కన్నీరుమున్నీరయ్యారు. ఉక్రెయిన్‌లో కర్ణాటక విద్యార్థి నవీన్‌ మృతితో ఒక్కసారిగా భారతీయులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. దేశం మొత్తాన్ని అతని మృతి కలచివేసింది. దీంతో నవీన్‌ కుటుంబ సభ్యులను కర్నాటక సీఎం ఓదార్చారు. ఉక్రెయిన్‌లోని హవేరీకి చెందిన కర్నాటక విద్యార్థి నవీన్‌ జ్ఞానగౌడ్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై. నవీన్‌ తండ్రి శేఖర్‌ గౌడ్‌తో ఫోన్‌లో మాట్లాడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.నవీన్‌ గురించి మరిన్ని వివరాలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఈ దుఃఖ సమయంలో అతని కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ’ఇది పెద్ద దెబ్బ. నవీన్‌కు శాశ్వత శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ విషాదాన్ని భరించడానికి విూరు ధైర్యంగా ఉండాలి’ అని బొమ్మై అన్నారు. మరోవైపు నవీన్‌ పార్థివదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు సీఎం బొమ్మై. ఈ విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. నవీన్‌ గురించి పలు విషయాల్ని అతని తండ్రి సీఎంకు తెలిపారు. కొడుకు పోయిన దుఖంలో ఉన్న తండ్రి శేఖర్‌ గౌడ్‌ తన కొడుకుతో ఉదయమే ఫోన్‌ లో మాట్లాడానని సీఎంకు చెప్పారు. రోజూ రెండు మూడుసార్లు ఫోన్‌ చేసేవాడని సీఎంకు ఆయన వివరించారు.
కర్ణాటక సీఎం విచారం..
నవీన్‌ మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బొమ్మై తెలిపారు


2.ఉక్రెయిన్‌ అధ్యక్షుడి హత్యకు కుట్ర!
` సిద్ధంగాఉన్న 400 మంది కిరాయి గుండాలు
` అంతర్జాతీయ వార్తా సంస్థ సంచలన కథనం
కీవ్‌,మార్చి 1(జనంసాక్షి):రష్యా`ఉక్రెయిన్‌ మధ్య జరుగుతోన్న సైనిక పోరు ఎక్కడికి దారితీస్తుందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీని హత్య చేసేందుకు రష్యా కిరాయి గుండాలను సిద్ధంగా ఉంచిందన్న వార్త కలకలం సృష్టిస్తోంది. వారంతా ప్రత్యేకంగా శిక్షణ పొందారని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం వెలువరించింది. వారంతా వాగ్నర్‌ గ్రూప్‌గా చెప్పుకుంటోన్న ఒక ప్రైవేటు మిలిషియాకు చెందినవారు. ఆ బృందాన్ని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. జెలెన్‌స్కీతో సహా 23 మంది ప్రభుత్వ పెద్దల్ని హత్యచేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నుంచి ఆ బృందానికి ఆదేశాలున్నట్లు ఆ సంచలన కథనం పేర్కొంది.  ఆ కథనం ప్రకారం.. ఈ వాగ్నర్‌ గ్రూప్‌ను పుతిన్‌ సన్నిహితుడు ఒకరు నిర్వహిస్తున్నారు. ఆ సన్నిహితుడిని పుతిన్‌ చెఫ్‌ అని పిలుస్తారట. కాగా, వాగ్నర్‌ గ్రూప్‌కు చెందిన ఆ కిరాయి గుండాలు.. రష్యా అధ్యక్షుడు అప్పగించిన పని విూద ఐదు వారాల క్రితమే ఆఫ్రికా నుంచి వచ్చారు. ఆ గ్రూప్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పిన వివరాల ప్రకారం.. 2 వేల నుంచి 4 వేల మంది కిరాయి గుండాలు జనవరిలోనే ఉక్రెయిన్‌ చేరుకున్నారు. వారిలో కొందరు వేర్పాటు వాద ప్రాంతాలైన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ వెళ్లారని, 400 మంది బెలారస్‌ నుంచి ప్రవేశించి, కీవ్‌ వైపు వెళ్లారని పేర్కొంది. చెప్పిన పని చేసినందుకు గానూ.. వారికి భారీగానే ఆర్థిక లాభం చేకూరనుంది.జెలెన్‌స్కీ, ఉక్రెయిన్‌ ప్రధాని, కీవ్‌ మేయర్‌ సహా 23 మంది ఆ గ్రూప్‌ లక్షిత జాబితాలో ఉన్నారు. ఈ వారం శాంతి చర్చలు ఉండటంతో పుతిన్‌ తన ప్రణాళిక అమలుకు కాస్త విరామం ఇచ్చారట. ఈ విషయాన్ని వాగ్నర్‌ గ్రూప్‌లోని సీనియర్‌ సభ్యుడి సన్నిహితుడిని ఉటంకిస్తూ కథనం పేర్కొంది. ఇక, ఇరు దేశాలకు మధ్య చర్చలు జరిగినప్పటికీ.. అవి సఫలం కాలేదు. వాగ్నర్‌ గ్రూప్‌ అనేది ఒక ప్రైవేట్‌ మిలిటరీ, సెక్యూరిటీ కంపెనీ. క్రెమ్లిన్‌ తన వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చడానికి దీన్ని ఉపయోగిస్తుందని నమ్ముతారు. దీన్ని 2014లో స్థాపించారు. రష్యా మొదటి గురి తాను, తన కుటుంబమేనని జెలెన్‌స్కీ ఇది వరకే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వార్త రావడం సంచలనం సృష్టిస్తోంది.