సబ్బండ వర్గాల అభ్యున్నతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం


-వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

 
రామకృష్ణాపూర్, మార్చి 4, (జనంసాక్షి):
 తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల జిల్లాలో పర్యటించి,  అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రికి చేరుకున్న మంత్రుల కాన్వాయికి మంచిర్యాల టీఆర్ఎస్ అధ్యక్షులు, ప్రభుత్వ విప్, చెన్నూరు ఎంఎల్ఎ బాల్క సుమన్ ఆధ్వర్యంలో మందమర్రి మున్సిపాలిటీ లోని యాపల్ ఏరియా కేకే-2 నుండి పాల చెట్టు వరకు స్వాగత బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించి, ఘన స్వాగతం పలికి పాల చెట్టు ఏరియాలోని ఆదర్శ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక వరకు పలు సంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతించారు. మందమర్రి పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో 2.04 కోట్ల నిధులతో నిర్మించిన సమ్మక్క-సారలమ్మ మహిళ భవనం, 9.12 కోట్ల నిధులతో 8 కేసిఆర్ కమ్యూనిటీ భవనాలు, 1.35 కోట్ల నిధులతో పట్టణంలోని 24 వార్డుల్లో బతుకమ్మ మైదానాలను, 2.385 కోట్ల నిధులతో పలు అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ వేదికలో మంత్రులు మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుందని, దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శనీయం అని అన్నారు. సబ్బండ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేద నిర్ములనకు తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమం అనంతరం చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని క్యాతనపల్లితో సమ్మక్క- సారలమ్మ భవనం, స్టార్ హౌజ్, కమ్యూనిటీ భవనాలు, పార్కులు
ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి  హాళ్ళికెరీ, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్,  వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తెరాస పార్టీ శ్రేణులు, పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.