జస్టిస్‌ ఫర్‌ పీఆర్సీ పేరుతో ఎమ్మెల్సీల దీక్ష

అమరావతి,మార్చి4 ( జనంసాక్షి ) :  ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ, గ్రాంట్లు, సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జస్టిస్‌ ఫర్‌ పీఆర్సీ పేరుతో ఉపాధ్యాయులు, పీడీఎఫ్‌, స్వతంత్ర ఎమ్మెల్సీలు నిరసన దీక్ష నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలపై జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలకు స్పందించిన ఏపీ ప్రభుత్వం పిట్‌మెంట్‌ను పెంచకపోవడంతో దశలవారీగా ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. దీంట్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన నిరసన దీక్షలో ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ప్రభుత్వం జీతాలు పెంచకుండా తగ్గించటం దారుణమని అన్నారు. ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేలా పోరాటాన్ని కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన స్పందన లేదని విమర్శించారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, సచివాలయ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలని ఎమ్మెల్సీలు కోరారు.