ఉత్తర తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు


ఎండలకు తోడు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి

కరీంనగగర్‌,మార్చి18  (జనంసాక్షి): ఉత్తర తెలంగాణలో మళ్లీ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత రెండుమూడు రోజలులుగా ఎండవేడిమికి తోడు ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇన్నాళ్లూ చలితో వణికిపోయిన ప్రజలు తాజాగా ముదురుతున్న ఎండలు చెమటలు పట్టిస్తున్నాయి. జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లోనే జనాలు రోడ్లపైకి వస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటకు రావడంలేదు.రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఉక్కపోత ఎక్కు వైంది. మధ్యాహ్నం సమయంలో ఇళ్లల్లో ఉండడమే కష్టమవుతోంది. ఎప్పుడు ఏప్రిల్‌ నెలలో ఎండల తీవ్రత పెరిగేది. కానీ ఈసారి ముందుగానే ఎండలు మొదలయ్యాయి. ఉత్తర తెలంగాణలో నిజామబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఎండల తీవ్రత అప్పుడే పెరిగింది. గరిష్ఠం 38 డిగ్రీలుగా నమోదు అవుతోంది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైతే రాబోయే ఏప్రిల్‌, మేలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని జనం బెంబేలెత్తి పోతున్నారు. వేసవి సీజన్‌ ప్రారంభం కావడంతో వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే శీతల పానియాల కేంద్రాలు సిద్ధమవుతుండడంతో కూలర్‌ల తయారీలో వ్యాపారులు నిమగ్నమయ్యారు. ఎండల తీవ్రతకు ముందే ముందస్తుగా కూలర్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సీజన్‌ ఊపందుకుంటే ధరలు
మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్య వ్యాపార కేంద్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వేసవి సీజన్‌లో జ్యూస్‌ వ్యాపారం పెరిగింది. ఎండలు మండుతుండడంతో.. ద్రాక్ష, పైనాఫిల్‌, అరటి, బత్తాయి, సపోట, పుచ్చకాయ,నిమ్మ, ఆపిల్‌ పండ్లకు మార్కెట్‌లో గిరాకీ పెరిగింది. చెరకు, లస్సీ, మజ్జిగ, మామిడి, మిక్స్‌డ్‌ ప్రూట్స్‌ లాంటి పలు రకాల పానీయాల జ్యూస్‌ సెంటర్లలో లభిస్తున్నాయి.