చెట్టు అమ్మకు ప్రతిరూపం – రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్


హైద‌రాబాద్‌, జ‌నంసాక్షి

ఒక్క చెట్టు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం లాంటిదే అంటుంది “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”. మార్చి 8 న “అంతర్జాతీయ మహిళ దినోత్సవం” పురస్కరించుకొని ప్రతి మహిళ ఒక పండ్ల చెట్టును నాటేలా వినూత్న కార్యక్రమం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతీ ఒక స్త్రీమూర్తి మొక్కను నాటి 9000365000కి సెల్ఫీ ఫోటోను పంపించాలని కోరింది.
తన జీవితమంతా నిస్వార్ధంగా ఫలాలను అందించే మొక్కలాగే.. ప్రతీ మహిళా త్యాగాలతో కుటుంబాల్ని నిలబెడుతుందని, అచంచలమైన ప్రేమను కురిపిస్తుందని, ఈ స్పూర్తికి ప్రతిరూపంగా ప్రతీ త్యాగమూర్తి మొక్కను నాటి తమ ఔన్నత్యాన్ని చాటాలని “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్యులు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కోరారు. మొక్కల్ని పెంచడం మనమంతా బాధ్యతగా స్వీకరించినప్పుడే పుడమి పచ్చగా ఉంటుందని, మానవ మనుగడతో పాటు సకల చరాచర జీవులు బ్రతుకుతాయని ఆయన తెలిపారు. అందుకే మహిళాలోకానికి ప్రత్యేకమైన “అంతర్జాతీయ మహిళ దినోత్సవం” రోజున స్త్రీమూర్తులంతా మొక్కలను నాటి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”తో పంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.