సుబ్రమణ్యస్వామితో భేటీలో మతలబు

వ్యతిరేక ఫ్రంట్‌ అంటూ అధికార పార్టీతో మంతనాలా

కెసిఆర్‌ పాలనలో అన్ని ర్గాలకు ఆశాభంగం

పాదయాత్రలో మల్లు భట్టి విక్రమార్క

ఖమ్మం,మార్చి4 (జనం సాక్షి ) :  బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తానన్న సిఎం కేసీఆర్‌.. ఆ పార్టీ ఎంపి సుబ్రహ్మణ్య స్వామిని ఎలా కలిశారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అసలు ఆయనను కేసీఆర్‌ ఎందుకు కలిశారో బయట పెట్టాలని భట్టి డిమాండ్‌ చేశారు. ఢల్లీికి వెళ్లి బిజెపి నేతలతో మంతనాలు సాగిస్తున్నారని అన్నారు. వ్యతిరేక ఫ్రంట్‌ అంటూ లోపాయకారి చర్చలు సాగిస్తున్నారని మండిపడ్డారు. ముదిగొండ మండలం బాణాపురంలో భట్టి పాదయాత్ర కొనసాగించారు. పీపుల్స్‌మార్చ్‌ పేరుతో జిల్లాలో ఆయన చేపట్టిన పాదయాత్రలో మాట్లాడుతూ నిరుద్యోగులు, పెన్షన్‌ దారులు, రేషన్‌ కార్డుల కోసం పీపుల్స్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడిరచారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను దిక్కులేని వాళ్లుగా చేసిందన్నారు. మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని భట్టి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారులను మధ్యవర్తులుగా మార్చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌కు ఉరి వేయడం ఖాయమన్నారు. ఇదిలావుంటే ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని, ఉమ్మడిరాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లానకు ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకోవడం లేదని, అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించడంలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన జరగడం లేదని, అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించకపోవడం ద్వారా కేసీఆర్‌ నియంతృత్వ పోకడ బహిర్గతమైందన్నారు. రాజ్యాంగం నిబంధనలకు భిన్నంగా పరిపాలన చేస్తునన్న కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదన్నారు.  పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని , ఇందుకోసమే తాను పాదయాత్ర చేస్తున్నానన్నారు.