ప్రజలను చైతన్యం చేసే లక్ష్యంతో అడుగులు
ఏడాది పాటు బిఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ ప్రజాయాత్రహైదరాబాద్,మార్చి5(జనం సాక్షి): ఐపిఎస్ పదవికి రాజీనామా చేసి బిఎస్పీలో చేరిన తరవాత రాష్ట్ర రాజకీయాల్లో ప్రవీణ్ కుమార్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ధనరాజకీయాల కారణంగా ఎస్టీఎస్టీ,
బిసిలు కూడా ఒక్కతాటిపైకి రాలేకపోతున్నాయి. ఒకప్పుడు అంతోఇంతో ప్రభావం చూపిన బిఎస్పీ ఇప్పుడు యూపిలో కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోతోంది. ఈ క్రమంలో తెలంగాణలో పగ్గాలు చేపట్టిన ప్రవీణ్ కుమార్ ఒంటరిపోరాటం చేస్తున్నారు. తనపోరాటంలో భాగంగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సుదీర్ఘ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 6 నుంచి మొదలై ఏడాది కాలం పాటు బహుజన రాజ్యాధికార యాత్ర సాగనుంది. జనవరి 15న బీఎస్పీ చీఫ్ మాయావతి జన్మదినం రోజున ఘనంగా బహుజన రాజ్యాధికార యాత్ర ప్రారంభించాలని నిర్ణయించినా కరోనా కారణంగా వాయిదా వేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో త్యాగాలు బహుజనులవి.. భోగాలు అగ్రవర్ణాలవా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ తీరు మారాలని, కొందరి తెలంగాణను అందరి తెలంగాణగా చేయడానికే తాను యాత్రను మొదలుపెడుతున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలను ప్రత్యక్షంగా కలిసి, సమాజంలో వారి ప్రాధాన్యత ఏమిటో తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బహుజనులకు రాజ్యాధికారం ఎందుకు కావాలో వీరందరికీ అర్థమయ్యే రీతిలో వివరించడమే ప్రవీణ్ కుమార్ తన యాత్ర లక్ష్యంగా చెప్పారు.మరో ఏడాదిన్నర కాలంలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు తమతమ ప్రయత్నాల్లో మునిగిపోయాయి. మళ్లీ అగ్రవర్ణాలకే అధికారం దక్కితే బహుజనులకు తీరని నష్టం కలుగుతుంది. అందుకే వారిలో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నం చేపట్టారు. బహుజనుల త్యాగాల పునాదుల విూద ఏర్పడ్డ తెలంగాణ అగ్రవర్ణాల అధికారిక సొత్తుగా మారిందని ఆయన పార్టీలో చేరిననాటినుంచీ ప్రచారంచేస్తున్నారు. ఇచ్చిన ఏ హావిూ కూడా నెరవేరిందే లేదు. అందుకే సబ్బండ వర్ణాలు పాలనలో మార్పు కోరుకుంటున్నాయి. అందుకే ఈసారి రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఒక చారిత్రక కార్యక్రమంగా బహుజన రాజ్యాధికార యాత్రతో ప్రవీణ్ ముందుకు వస్తున్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర పేరిట ప్రారంభం కానున్న బహుజనుల ఉద్యమం భారీ బహిరంగ సభతో మొదలుకాబోతోంది. రాష్ట్రంలో బాహుజనులను ఏకం చేసి, జనాభా ప్రాతిపదికన ప్రజలకు రావాల్సిన వాటా దక్కించు కోవాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. తన యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలను ప్రవీణ్ ప్రత్యక్షంగా కలవనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకుంటారు. బహుజన రాజ్యంలో ప్రతి సమస్యను తీరుస్తామని హావిూ ఇస్తున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్వగ్రామం ఖిలాశాపూర్ వీరుడి చరిత్రను తెలియజేస్తూ.. తెలంగాణలో బహుజన రాజ్యాధికార యాత్ర మొదలుకానుంది. సామాజిక చైతన్యంతో బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని మొట్టమొదటగా నిరూపించిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ నిరంకుశ ప్రభుత్వంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 300 రోజులు బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టనున్నారు. బహుజన రాజ్య స్థాపన చేయడానికి అడుగేస్తున్న ప్రవీణ్ కుమార్ ఏ మేరకు ప్రజలను కదిలిస్తారో చూడాలి. ప్రవీణ్ కుమార్ ఈ యాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయాలపై బలమైన ముద్రను వేయాలని భావిస్తున్నారు.