ఉద్యోగుల పరస్పర బదిలీలకు అవకాశం

15 తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలి: సిఎస్‌
హైదరాబాద్‌,మార్చి4 (జనం సాక్షి ) : ఉద్యోగుల పరస్పర బదిలీలకు గాను ఈ నెల 15 తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ బదిలీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో సీనియారిటీ ప్రొటెక్షన్‌ ను కల్పించడం జరుగుతుందని సీ.ఎస్‌. స్పష్టం చేశారు. ఈ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే జీ.ఓ ఎం.ఎస్‌. నెంబర్‌ 21 తేదీ 2 .2 . 2022 విడుదల చేసినట్టు తెలిపారు, ఈ జీ.ఓ లోని పారా 7, 8 పారాల్లో పేర్కొన్న నిబంధనలను మార్పులు చేస్తూ ప్రభుత్వం జీ.ఓ. ఆర్‌.టి నెం. 402 తేదీ ,ఫిబ్రవరి 19న జారీ చేసినట్టు తెలిపారు. తద్వారా, ఉమ్మడి జిల్లా క్యాడర్‌ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్టయితే, వారి
సీనియారిటీకి కొత్త లోకల్‌ కేడర్‌ లో కూడా రక్షణ ఉంటుందని వివరించారు. ఈ బదిలీలకై దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులు ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌ ద్వారా ఈ నెల 15 తేదీలోగా సమర్పించాలని అన్నారు. ఇప్పటి వరకు పరస్పర బదిలీలకై 31 దరఖాస్తులు అందాయని సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.