ఇందులో జగన్ రెడ్డి ప్రధాన భాగస్వామి
ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్‌లో జగన్ పేరు చేర్చాలిటిడిపినేత యనమల రామకృష్ణుడు డిమాండ్
విజయవాడ,మార్చి5 (జనం సాక్షి): వివేకాందనరెడ్డి హత్య నేరపూరిత కుట్ర అని.. దీనిలో జగన్ రెడ్డి ప్రధాన భాగస్వామి అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వివేకా హత్య కేసులో సీబీఐ అవినాశ్ రెడ్డితో పాటు జగన్ రెడ్డి పేరు కూడా ఎఫ్‌ఐఆర్, చార్జ్ షీట్‌లో చేర్చాలన్నారు. రాజధానిపై మరో చట్టం తీసుకురావటానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందన్నారు. ఇంకా యనమల మాట్లాడుతూ.. శాసన సభ రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాదన్నారు. సజ్జల రామకృష్టారెడ్డి మాట్లాడుతూ చట్టసభల్లో తమకు బలముందని అంటున్నారు. ఆయన చెప్పేది నిజమే. వారికి అధికార బలం, అహంకార మదం ఉంది తప్ప ఆలోచన బలం లేదు. అభివృద్ది వికేంద్రీకరణకు అర్థం కూడా తెలియకుండా అభివృద్ది వికేంద్రీకరణ గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం. అభివృద్ది వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదు. బడ్జెట్‌ను అన్ని ప్రాంతాలకు సమానంగా పంచి రాష్ట్రం అంతా అభివృద్ది చేయాలని యనమల పేర్కొన్నారు. స్వార్థప్రయోజనాల కోసం పోలవరాన్ని తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. సీబీఐ, ఈడీ, బాబాయి హత్య కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ రాజీపడి కేంద్రం ముందు నోరెత్తలేదని విమర్శించారు. నిర్వాసితులను ద్రోహంచేసే హక్కు సీఎం జగన్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రివర్స్ డ్రామా ఆడకుండా ఉంటే ఈపాటికి పోలవరం పూర్తయ్యేదన్నారు. పునరావాసం కింద దాదాపు లక్ష
కుటుంబాలకు కట్టాల్సిన ఇళ్లపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పర్యటనలో రూ.47,725కోట్లు ఇస్తే చాలని రాజీపడటంలో పిరికితనం ఏంటి అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం ఏం మాట్లాడతారు, కేంద్రమంత్రి ఏం చెప్తారని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తుంటే మంత్రులు కార్ పార్కింగ్ గొడవకి పరిమితమయ్యారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.