చర్చకు అనుమతించకపోతే పోరుతప్పదు


` సీఎల్పీ సమావేశంలో రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌,మార్చి 6(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇదే చివరి బడ్జెట్‌ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ తాజ్‌ డెక్కన్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబరులో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చకు అనుమతివ్వకపోతే రోడ్లపైనే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు అనుబంధ విభాగాలు కూడా రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడి పథకాలు మరెక్కడైనా ఉంటే కేటీఆర్‌ రాజీనామా చేస్తానన్నారు... ఛత్తీస్‌గఢ్‌లో ఇక్కడి కంటే మంచి పథకాలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి వివరించారు. ఇక్కడ వరి వేస్తే ఉరే అని తెరాస ప్రభుత్వం అంటోంది... ధాన్యం కొనుగోలుపై చర్చకు కేటీఆర్‌ సిద్ధమా? అని ప్రశ్నించారు. నెల రోజులు గడువిస్తున్నా... కేటీఆర్‌ స్పందించాలని సూచించారు.కాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్టు మల్లు రవి తెలిపారు. ‘‘ బిహార్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వొద్దని రేవంత్‌ అనలేదు. ఐఏఎస్‌ల పోస్టింగ్‌లలో సమతుల్యత పాటించాలన్నారు. బిహార్‌ అధికారులకే అధిక ప్రాధాన్యమివ్వడంపై ప్రశ్నించారు. బిహార్‌ అధికారులకు రేవంత్‌రెడ్డి వ్యతిరేకం కాదు. తెలంగాణ అధికారులకు ప్రాతినిధ్యం లేదనడం తప్పా? కండువా కప్పుకున్న క్షణం నుంచే రేవంత్‌ కాంగ్రెస్‌ నాయకుడు. రాష్ట్రంలో తెదేపా కాంగ్రెస్‌ లేదు.. ఉన్నది ఒకటే కాంగ్రెస్‌. కాంగ్రెస్‌నేతలు తెరాసకు లాభం చేకూరేలా మాట్లాడారు’’ అని మల్లు రవి అన్నారు.