అంతరిక్షం గుర్తించిన హైదరాబాద్‌ వెలుగులు

 



` నాడు రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారం అయితదన్నరు
` నేడు అంతరిక్షానికి సైతం చేరిన హైదరాబాద్‌ వెలుగులు
` ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడి లైట్లను గత డిసెంబర్‌ నెలలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
` రాత్రిపూట వెలుగులు విరజిమ్ముతున్న హైదరాబాద్‌ మహానగర చిత్రాన్ని విడుదల చేసిన ‘నాసా’
హైదరాబాద్‌,మార్చి 6(జనంసాక్షి):ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే అభివృద్ధి నిలిచిపోయి రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని ఉద్యమ సమయంలో సమైఖ్యవాదులు చేసిన ఆర్తనాదాలను సందర్భం వచ్చిన ప్రతీ సందర్భంలో ఉద్యమకారులు గుర్తుచేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి కనీసం గృహావసరాలకు సైతం రోజుకు పద్దెనిమిది గంటల విద్యుత్‌ సరఫరా చేయలేని దుస్థితి ఉండేది. అలాంటిది రాష్ట్రం ఏర్పడ్డాక ఏడాదిలోపే ఇరవై నాలుగు గంటల విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు రెండేళ్లలోనే వ్యవసాయానికి సైతం ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించే స్థాయికి చేరుకున్నాం. నిరంతర విద్యుత్‌ సరఫరా కారణంగా ఐటీ, పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలలో రాష్ట్రం అభివృద్ధిపథాన దూసుకుపోతోంది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలకు, వేడుకలకు హైదరాబాద్‌ మహానగరం వేదికగా నిలుస్తోంది. హైదరాబాద్‌ మహానగరంలో మౌలికసౌకర్యాల ఏర్పాటు కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న నేపథ్యంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డులో హెచ్‌ఎండిఏ మరియు హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో వంద కోట్ల రూపాయలు వెచ్చించి 136 కిలో విూటర్ల మేర ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. వీటిని గత డిసెంబర్‌ నెలలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఇప్పుడు ఔటర్‌ రింగ్‌ రోడ్డు విూద ఏర్పాటు చేసిన అదే ఎల్‌ఈడీ లైట్ల వెలుతురు సరిహద్దుగా హైదరాబాద్‌ మహానగరం ప్రకాశిస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా తాజాగా చిత్రీకరించి విడుదల చేసిన చిత్రంలో ఇదే విషయం ప్రతిబింభించింది.