బిసి పాటశాలలో పాముకాటుకు విద్యార్థి మృతి విజయనగరం,మార్చి4(జనం సాక్షి): విజయనగరం జిల్లాలోని కురుపాం బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో విషాదం నెలకొంది. నిద్రలో ఉన్న విద్యార్థుల్ని విష సర్పం ఒకటి కాటేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది. నిద్రిస్తున్న విద్యార్థుల ముఖంపై పాము కాటేసింది. దీంతో పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన సిబ్బంది, స్థానికులు పామును అక్కడికక్కడే చంపేశారు. విద్యార్థుల్ని పార్వతీపురంలోని ఓ ఆస్పత్రికి తరలించి.. ఆపై మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. ముగ్గురిలో రంజిత్ అనే చిన్నారి మృతి చెందాడు. మరో ఇద్దరిలో ఓ చిన్నారి వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొనగా.. రంజిత్ కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థుల్ని పాము కాటు వేసిన ఘటన తీవ్ర దిగ్భార్రతికి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి సొంత నియోజకవర్గంలో జరిగిందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థి మృతి చెందడం, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం తీవ్ర విచారకరమన్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లల్ని సురక్షితంగా చూసుకోవాల్సిన గురుకులాలను జగన్ రెడ్డి సర్కారు పట్టించుకోకపోవడం లేదని లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.