అంతర్గత సమస్యలపై రాహుల్‌ దృష్టి

ముఖ్య నేతలతో చర్చిస్తున్న యువనేత

న్యూఢల్లీి,మార్చి18  (జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీలోని అసమ్మతి నాయకులతో కూడిన జి`23 సమావేశం జరిగిన మరుసటి రోజే కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హూడాను కలుసుకుని పార్టీ పునర్వవస్థీకరణపై చర్చించారు. అసమ్మతిని మొగ్లోనే తుంచేయడంతో పాటు పార్టీ పటిష్టతపై రాహుల్‌ చర్చించినట్లు సమాచారం. అలాగే నాయకత్వ సమస్యపైనా రాహుల్‌ సన్నిహితులతో చర్చిస్తున్నారని సమాచారం. ఇటీవల జరిగిన ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలు అయిన నేపథ్యంలో పార్టీని పటిష్టపరిచే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. రాహుల్‌తో సమావేశమైన తర్వాత హూడా జి`23 నాయకులలో ఒకరైన గులాం నబీ ఆజాద్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆజాద్‌ నివాసంలో సమావేశమైన జి`23 నాయకులు పార్టీని పటిష్టపరిచేందుకు సమిష్టి నాయకత్వం అవసరమని పేర్కొంటూ ఒక సంయుక్త ప్రకటనపై సంతకం చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ ఉప నాయకుడైన ఆనంద్‌ శర్మ కూడా ఆజాద్‌ నివాసానికి చేరుకుని భేటీలో పాల్గొన్నారు. జి`23 ప్రకటన, అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆజాద్‌ టెలిఫోన్‌లో మాట్లాడడం వంటి పరిణామాల నేపథ్యంలో హూడా తదితరులతో రాహుల్‌ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్‌ పార్టీని దిగజార్చే ఉద్దేశం తమకు లేదని, పార్టీని పటిష్టపరచడమే తమ కర్తవ్యమని జి`23 వర్గాలు తెలిపాయి. అన్ని స్థాయిల్లో సమిష్టి నాయకత్వం, సమిష్టి నిర్ణయాల తీసుకునే వ్యవస్థను స్థాపించాలనే తాము పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నామని వారు చెప్పారు. ఇలా ఉండగా త్వరలో ఆజాద్‌ సోనియా గాంధీని కలుసుకుని పార్టీ పటిష్టతకు తీసుకోవలసిన ప్రతిపాదనలను తెలియచేస్తారని వర్గాలు తెలిపాయి. మరోవైపు రాహుల్‌ కూడా తన సన్నిహత నేతలతో చర్చిస్తున్నారు. ఈ గగండం నుంచి గట్టెక్కే యత్నాల్లో ఉన్నారు.