ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు

 అమరావతి జ‌నంసాక్షి : ఇంటర్‌ పరీక్షలకు కొత్త తేదీలను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలపై పడటంతో తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను వెలువరించింది. ఏప్రిల్‌ 22 నుంచి పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగుతాయి. 

ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తవ్వాలి. కానీ జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం.. కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కొత్త తేదీలను ప్రకటించారు.