main st page all news

 


1.అమెరికాలో మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం
హైదరాబాద్‌,మార్చి 20(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికా చేరుకున్న ఐటి, పరిశ్రమలు శాఖా మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం తెలిపారు. ఎయిర్పోర్టులో మంత్రి కేటీఆర్‌ కి పూల బొకేలు అందించి స్వాగతం తెలిపారు.మంత్రి కేటీఆర్‌ లాస్‌ ఏంజిల్స్‌లో తనకు స్వాగతం పలికిన ఎన్నారైలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల పైన ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్‌ మన ఊరు మన బడి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు. ఈ పర్యటనలో మంత్రి వెంట టిఆర్‌ఎస్‌ ఎన్నారై కో`ఆర్డినెటర్‌ మహేష్‌ బిగాల ఉన్నారు.

 

2.విప్లవతారకు తుదివీడ్కోలు
` మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాసంఘాల నేతలు నివాళి
` మెడికల్‌ కాలేజీకి భౌతికఖాయం అప్పగింత
హైదరాబాద్‌,మార్చి 20(జనంసాక్షి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ ప్రజాసంఘాల నేతలు నివాళులర్పించారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌కు ఆమె భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కవిత, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నేతలు రాఘవులు, మధు, తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ తదితరులు మల్లు స్వరాజ్యం పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. ఆమెను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎంబీ భవన్‌ వద్దకు చేరుకున్నారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌లో ఉంచారు. అటునుంచి నల్లగొండకు తరలించారు. మధ్యాహన్నం ఒంటి గంటకు పార్టీ కార్యాలయంలో నివాళి అర్పించారు. అంతిమయాత్రి నిర్వహించిన తర్వాత ఆమె పార్థివ దేహాన్ని మెడికల్‌ కాలేజీకి అప్పగించారు.కాగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సంతాపం తెలిపారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం సాహసం ఎందరికో స్ఫూర్తి అన్నారు. స్వరాజ్యం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజాకార్ల దుర్మార్గాలను ఎదురించిన ధీర వనిత మల్లు స్వారాజ్యం అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి యువతరానికి ఆదర్శమన్నారు.నిజాం నిరంకుశాన్ని ఎదురించిన ధీశాలి మల్లు స్వరాజ్యం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణలో గొప్ప యోధురాలి శకం ముగిసిపోయిందన్నారు. తెలంగాణ సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి ఎమ్మెల్సీ కవిత నివాళులు అర్పించారు. స్వరాజ్యం కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. తమలాంటి ఉద్యమకారులకు స్వరాజ్యం ఆదర్శంగా నిలిచారని చెప్పారు. తెలంగాణలో తుపాకీ పట్టిన మొదటి మహిళగా కీర్తి గడిరచారని తెలిపారు.మల్లు స్వరాజ్యంను పట్టిస్తే రూ.10 వేలు బహుమతిగా ఇస్తామని అప్పట్లోనే ప్రకటించడమంటే ఆమె ఎంత గొప్పగా పోరాటం చేశారో అర్థమవుతున్నదని చెప్పారు. రెండోదశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేక సందర్భాల్లో ఆమె నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని వెల్లడిరచారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.మల్లు స్వరాజ్యం తూటాలా పేలే తన మాటను పాటగా మార్చి ప్రజలను, మహిళలను చైతన్య పరిచారన్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నిజాం సర్కారును ఎదిరించారని చెప్పారు. పాలకుర్తిలో చాకలి ఐలమ్మ, దేవులపల్లి వెంకటేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, భీం రెడ్డి నరసింహా రెడ్డి వంటి ఉద్దండులతో కలిసి మల్లు స్వరాజ్యం పనిచేశారని తెలిపారు. పాలకుర్తి ప్రాంతంతో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. ఆమె జీవిత మహిళా లోకానికి, ఉద్యమాలకు ఆదర్శమని వెల్లడిరచారు.గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం (93).. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌లో ఉంచారు. అటునుంచి నల్లగొండకు తరలించారు. మధ్యాహ్నం ఒంటి గంటవరకు పార్టీ కార్యాలయంలో నివాళి అర్పించారు. అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆమె పార్థివ దేహాన్ని మెడికల్‌ కాలేజీకి అప్పగించారు.

 

3.హైదరాబాద్‌ తరహాలో జిల్లాల్లో వైద్యసౌకర్యం
` మంత్రి హరీశ్‌
హైదరాబాద్‌,మార్చి 20(జనంసాక్షి):ప్రజలకు మెరుగైన ఆర్థోపెడిక్‌ సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్‌ ఆర్థోపెడిక్‌ వైద్యులతో సమావేశమై.. రాష్ట్రంలో అందిస్తున్న ఆర్థోపెడిక్‌ సేవలపై సవిూక్ష నిర్వహించారు. సంబంధిత విభాగంలో ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అవసరమైన నూతన వైద్య విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థో వైద్య నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలందించేలా చూడాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్‌ ఎంఎస్‌ ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు.ఆసుపత్రులకు డెవలప్‌మెంట్‌ కింద ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేసిందని, ఈ నిధులను స్థానికంగా సూపరింటెండెంట్లు వినియోగించుకొని.. ఎప్పటికప్పుడు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌తో పోటీ పడి ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఆర్థోపెడిక్‌ వైద్యసేవలను అందించాలని, మోకాలి చిప్ప మార్పిడి సర్జరీకి కావాల్సిన అన్ని వసతులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమకూర్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 సీఆర్మ్‌ మిషన్లు ఏర్పాటు చేశామని, మోకాలి చిప్ప మార్పిడి సర్జరీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగేలా చూడాలి, దీని వల్ల పేదలకు ఆర్థిక భారం తప్పుతుందన్నారు. సూపరిడెంట్స్‌ ఆర్థోపెడిక్‌ వైద్యులకు సహకారం అందించాలని, అన్ని రకాల ఆర్థో చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం కింద అవకాశం ఉందన్నారు.మన వద్ద అనుభవజ్ఞులైన వైద్యులున్నారని, వారికి తగిన ఏర్పాట్లు చేశామన్న మంత్రి.. పేదలకు వైద్యం బాధ్యత మన అందరిదన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రిజ్వి, టీఎస్‌ ఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, నిమ్స్‌, రిమ్స్‌, మహబూబ్‌నగ్‌, సిద్దిపేట దవాఖానాల డైరెక్టర్లు, టీఎస్‌ ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేకర్‌రెడ్డి, అన్ని మెడికల్‌ కాలేజీ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్థోపెడిక్‌ యూనిట్‌ హెచ్‌వోడీలు, ఆర్థోపెడిక్‌ డాక్టర్లు, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, జిల్లా ఆసుపత్రి ఆర్థోపెడిక్‌ డాక్టర్లు పాల్గొన్నారు. ప్రైవేటు ఆసుప్రతులకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు గురువారెడ్డి, అఖిల్‌ దాడి, సూర్య ప్రకాశ్‌, నితిన్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

4.కాశ్మీర్‌ ప్రజల విభజనకు తిలా పాపం.. తలా పిడికెడు
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌
దిల్లీ,మార్చి 20(జనంసాక్షి): ప్రజల్లో విభజన సృష్టించేందుకు కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు.ఈ విషయంలో వ్యక్తిగతంగా తాను ఏఒక్క రాజకీయ పార్టీని క్షమించనని వెల్లడిరచారు. కశ్మీర్‌ లోయలో చోటుచేసుకున్న అశాంతికి పాకిస్థాన్‌, ఉగ్రవాదమే ప్రధాన కారణం అన్నారు. కశ్మీరీ పండితులకు ఎదురైన అనుభవాల వృత్తాంతంలో రూపొందించిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సమయంలో గులాంనబీ ఆజాద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.’కులం, మతం, ఇతర అంశాల పేరుతో రాజకీయ పార్టీలన్నీ ప్రజల్లో విభజన తెస్తాయి. ఈ విషయంలో నా సొంతపార్టీ (కాంగ్రెస్‌)తో సహా ఏఒక్క రాజకీయ పార్టీని కూడా వెనకేసుకు రావడం లేదు. పౌరసమాజం ఐకమత్యంగా ఉండాలి. కుల, మతాలకు అతీతంగా ప్రతిఒక్కరికీ న్యాయం జరగాలి. మహాత్మా గాంధీ అతిపెద్ద హిందువు, లౌకికవాది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘోరాలకు పాకిస్థాన్‌తోపాటు ఉగ్రవాదులు కారణం. వారివల్ల జమ్మూ కశ్మీర్‌లో హిందువులు, కశ్మీరీ పండిట్‌లు, ముస్లింలతోపాటు డోగ్రాస్‌ వర్గాలు తీవ్ర ప్రభావితమయ్యాయి’ కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. ది కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రాన్ని పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. లోయలో అశాంతికి పాకిస్థాన్‌, ఉగ్రవాదులదే బాధ్యత అని అన్నారు.ఇదిలాఉంటే, ఇటీవల విడుదలైన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం ప్రతిఒక్కరు చూడాల్సిందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలు రాష్ట్రాలు ప్రోత్సహిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డు కలెక్షన్లను నమోదు చేసుకుంటోంది. మరోవైపు అదే స్థాయిలో విమర్శలనూ ఎదుర్కొంటోంది. ఈ చిత్రాన్ని రాజకీయ వేదికగా వాడుకునేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఈ చిత్రాన్ని నిర్మించారంటూ శివసేన మండిపడిరది.

 

5.ప్రతి గింజా కొనాల్సిందే
` ‘మన ఊరు` మన పోరు ‘ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి
ఎల్లారెడ్డి,మార్చి 20(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యపు గింజకొనే వరకూ కాంగ్రెస్‌ పోరాటం కొనసాగిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘మన ఊరు` మన పోరు ‘ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ... ఏప్రిల్‌ నెల నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధాన్యం కొనేందుకు ఏర్పాట్లు చేయకుంటే రైతులతో కలిసి ఫామ్‌ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెరాసకు రెండు సార్లు అధికారం కట్టబెడితే కేంద్రంపై నెపం మోపి దిల్లీ వెళ్లి పోరాడతానని కేసీఆర్‌ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్‌ జిల్లాలో చెరకు ఫ్యాక్టరీలు తెరుస్తామని హావిూ ఇచ్చిన కవిత ఎంపీగా గెలవగానే ఆ విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు.పసుపుబోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌పై రాసిచ్చిన భాజపా ఎంపీ అర్వింద్‌ ఇచ్చిన హావిూని తుంగలో తొక్కారని మండిపడ్డారు. పసుపుబోర్డు రాక పసుపు రైతులు, గిట్టు బాటు ధరలేక ఎర్రజొన్న రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రూ.2.5లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న తెలంగాణలో రూ.10వేల కోట్లు పెట్టి ధాన్యం కొనలేరా? అని ప్రశ్నించారు. నెపం కేంద్రంపై నెట్టి మరోసారి దిల్లీలో అగ్గి పుట్టిస్తానని కేసీఆర్‌ బయలుదేరుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనకుంటే రైతులతో కలిసి దండుకట్టి ఉద్యమిస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో పండిరచిన ధాన్యాన్ని ఎలా కొంటారో.. పేద రైతులు పండిరచిన వడ్లను ఎలా కొనరో చూస్తామని హెచ్చరించారు. పోడు భూముల సమస్య, తెరాస, భాజపా విధానాలపై ఇతర నేతలు విమర్శలు గుప్పించారు. పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ అధ్యక్షతన జరిగిన సభలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, మల్లు రవి, మదన్‌ మోహన్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు సభకు భారీగా తరలివచ్చారు.

 

6.బల్క్‌ యూజర్లకు
లీటర్‌ డీజిల్‌పై రూ.25 పెంపు
దిల్లీ,మార్చి 20(జనంసాక్షి):అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 40 శాతం పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ‘పెద్ద వినియోగదారుల’ (పబీశ్రీస బీబవతీబ)కు విక్రయించే డీజిల్‌ ధర లీటరుకు రూ.25 పెరిగింది.అయితే పెట్రోల్‌ పంపుల వద్ద కొనే సామాన్య పౌరులకు మాత్రం ఈ రేట్లు వర్తించవని ఈ వ్యవహారంతో నేరుగా సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు.సాధారణంగా బల్క్‌ యూజర్లకు వర్తించే ధరలు రిటైల్‌ ధరలతో పోలిస్తే ఎక్కువుంటాయి. ఈ అధిక ధర నుంచి తప్పించుకోవడానికి వారంతా పెట్రోల్‌ పంపుల వైపు మళ్లారు. మరోవైపు త్వరలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో సామాన్యులు సైతం కొనుగోళ్లను పెంచారు. ఫలితంగా ఈ నెల పెట్రోల్‌ పంపుల వద్ద విక్రయాలు దాదాపు ఐదోవంతు పెరిగాయి. ఇది రిటైల్‌ విక్రయ సంస్థల నష్టాల పెరుగుదలకు దారితీసింది.ముఖ్యంగా నయారా ఎనర్జీ, జియో`బీపీ, షెల్‌ వంటి ప్రైవేటు రిటైల్‌ విక్రయ సంస్థలు భారీ నష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. గత 136 రోజులుగా ధరలు స్థిరంగా ఉండడంతో.. రాయితీ ధరకు చమురును పొందే ప్రభుత్వరంగ సంస్థలతో ఇవి పోటీపడలేకపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంపులను మూసివేయడం తప్ప మరోమార్గం ఉండదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 2008లో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశవ్యాప్తంగా ఉన్న 1,432 పెట్రోల్‌ పంపులను మూసివేసిందని గుర్తుచేశాయి. ఇప్పుడూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయని తెలిపాయి.ఈ నేపథ్యంలోనే పెద్ద వినియోగదారులు పెట్రోల్‌ పంపుల వద్దకు వెళ్లకుండా నియంత్రించేందుకు ప్రత్యేకంగా వీరికి మాత్రమే ప్రభుత్వ రిటైల్‌ సంస్థలు ధరలను పెంచాయి. దీంతో ముంబయిలో బల్క్‌ యూజర్లకు లీటరు డీజిల్‌ ధర రూ.122.05కు చేరింది. అదే సామాన్యులకు మాత్రం ఈ ధర రూ.94.14గా కొనసాగుతోంది. దిల్లీలో ఈ రేట్లు వరుసగా రూ.115, రూ.86.67గా ఉన్నాయి.నవంబరు 4, 2021 తర్వాత ప్రభుత్వ రంగ రిటైల్‌ విక్రయ సంస్థలు ధరల్ని పెంచలేదు. మరోవైపు ఈ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ధరల్ని పెంచుతారని భావించినప్పటికీ.. అలా జరగలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పోటీని తట్టుకునేందుకు ప్రైవేటు రిటైలర్లూ ధరల్ని పెంచలేదు. దీంతో నష్టాలు పెరిగిపోతున్నాయి.

 

7.భోధన్‌లో ఉద్రిక్తత..
` 144 సెక్షన్‌ విధింపు
బోధన్‌,మార్చి 20(జనంసాక్షి):నిజామబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.శివాజీ విగ్రహం తొలగించాలని ఓ వర్గం పట్టుబట్టగా... మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. వాగ్వాదం క్రమంగా ఘర్షణగా మారి రెండు వర్గాల వారు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఓ వర్గం వారు పోలీసులపైకి రాళ్లు రువ్వటంతో లాఠీ ఛార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ అమల్లో ఉందని నిజామాబాద్‌ సీపీ నాగరాజు తెలిపారు. పాలనాపరమైన అనుమతులు ఉంటేనే ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తాని సీపీ స్పష్టం చేశారు.

 

8.చర్చలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధమే
` ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పునరుద్ఘాటన
` యుద్ధంలో హైపర్‌సోనియక్‌ ఆయుధాలను వినియోగిస్తున్న రష్యా
కీవ్‌,మార్చి 20(జనంసాక్షి):ఉక్రెయిన్‌లోని పట్టణాల్లో దాడులను తీవ్రం చేసేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తుందని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్‌ సమాచారం ఉందని వెల్లడిరచింది. గత వారం నుంచి రష్యా దళాలు పట్టణ ప్రాంతాలపై దాడులను తీవ్రం చేశాయి. నగర ప్రాంతాల్లో రష్యాసేనలు ముందుకు కదలడంలేదు. ఈ నేపథ్యంలో నగరాల్లో ప్రతిఘటన అణచివేతకు భారీ ఆయుధాలను వినియోగించే అవకాశం ఉంది. ఈ దాడుల ఫలితంగా భారీ సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోవచ్చని పేర్కొంది. దీంతోపాటు భారీగా ఆస్తి నష్టం కూడా చోటు చేసుకోనుంది. రెండో హైపర్‌సానిక్‌ క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా న్యూస్‌ ఏజెన్సీ టాస్‌ పేర్కొంది. మైకొలైవ్‌ నగర సవిూపంలో ఇంధన డిపోను పేల్చివేసేందుకు రెండో సారి కింజల్‌ హైపర్‌ సానిక్‌ క్షిపణిని ప్రయోగించింది. కాగా ప్రస్తుత పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం పునరుద్ఘాటించారు. ఒకవేళ చర్చల ప్రయత్నాలు విఫలమైతే మాత్రం.. రెండు దేశాల మధ్య పోరాటం.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ఓ అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘పుతిన్‌తో చర్చలకు గత రెండేళ్లుగా సిద్ధంగా ఉన్నా. చర్చలు లేకుండా ఈ యుద్ధాన్ని ముగించలేం’ అని అన్నారు.

 

9.కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గింపు!
దిల్లీ,మార్చి 20(జనంసాక్షి): నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని 8`16 వారాలకు తగ్గించేందుకు నిర్ణయించింది. కాగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటివరకు రెండు డోసుల మధ్య వ్యవధి 12`16 వారాలగా (84రోజులు) ఉంది. అయితే, భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా రెండు డోసుల మధ్య గడువు మాత్రం అదేవిధంగా ఉంచింది. ప్రస్తుతం మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత కొవాగ్జిన్‌ రెండో డోసు అందిస్తున్నారు.‘అంతర్జాతీయ స్థాయిలో నిరూపితమైన సమాచారాన్ని బట్టి నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది’ అని అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. కొవిషీల్డ్‌ రెండో డోసును 8 వారాల తర్వాత గానీ.. 12`16 వారాల వ్యవధిలో ఇచ్చినప్పుడు గానీ యాంటీబాడీల పెరుగుదల దాదాపు సమానంగా ఉన్నట్లు తేలిందని అధికారులు పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా 6`7 కోట్ల మంది ప్రజలు కొవిషీల్డ్‌ రెండో డోసును వేగంగా తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం గతేడాది మే నెలలో ఈ వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య వ్యత్యాసాన్ని 6`8 వారాల నుంచి 12`16 వారాలకు పొడిగించింది.

 

 

10.అసమ్మతి నేతల సమావేశం అట్టర్‌ ఫ్లాఫ్‌
హైదరాబాద్‌,మార్చి 20(జనంసాక్షి):సీనియర్‌ నాయకుల ప్రత్యేక సమావేశం కాంగ్రెస్‌ పార్టీలో హీటుపుట్టిస్తున్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సీనియర్‌ నాయకులు హైదరాబాద్‌లోని అశోకా హోటల్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వీ హనుమంతరావు, జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌ రెడ్డి, శ్యామ్‌మోహన్‌ రావు, కమలాకర్‌రావుతోపాటు పలువురు నేతలు హోటల్‌కు చేరుకున్నారు.అయితే సీనియర్‌ నేతలు ప్రత్యేక భేటీలు వద్దని పార్టీ అధినాయకత్వం సూచించింది. సమస్యలుంటే అధిష్ఠానానికి తెలపాలని సూచించింది. పార్టీ సూచనలు ధిక్కరించి సమావేశం కావొద్దని ఏఐసీసీ హెచ్చరించింది. అయినప్పటికీ నాయకులు సమావేశానికి హాజరుకావడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.కాగా, తాము చేస్తున్నదాంట్లో తప్పేవిూ లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పార్టీలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధిష్ఠానానికి తెలియజేయడమే తమ లక్ష్యమని చెప్పారు. పంజాబ్‌ తరహాలో పార్టీ నష్టపోవద్దనేదే తమ ఉద్యేశమని వెల్లడిరచారు. పూర్తిగా నష్టం జరిగాక చర్చించుకుంటే లాభం ఉండదని తెలిపారు.

 

11.శ్రీలంకలో చుక్కల్లో ధరలు..
కొలంబో,మార్చి 20(జనంసాక్షి):శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అల్లాడుతోంది. రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకోగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలపొడి నుంచి లీటర్‌ పెట్రోల్‌ వరకు ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం లంక రూపాయి విలువ డాలర్‌లో పోల్చిచే రూ. 275కు చేరుకుంది. దీంతో లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీలంకలో నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయి. ముడి చమురు నిల్వలు అయిపోయిన తర్వాత శ్రీలంక తన ఏకైక ఇంధన శుద్ధి కర్మాగారంలో ఆదివారం కార్యకలాపాలను నిలిపివేసినట్లు పెట్రోలియం జనరల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు అశోక రన్‌వాలా తెలిపారు. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి ఏర్పడిరది. పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 283కు చేరుకోగా, డీజిల్‌ ధర రూ. 220కి చేరుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఏకంగా రూ. 1,359 చేరుకుంది. కాగా, వంట గ్యాస్‌ కొరతతో చాలా హోటళ్లు మూసుకుపోయాయి. గ్యాస్‌ ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు కిరోసిన్‌ వాడుతున్నారు.ఇక కోడి గుడ్డు ధర రూ. 35, కిలో చికెన్‌ రూ. 1000, కిలో ఉల్లి ధర రూ. 600, పాలపొడి ప్యాకెట్‌ ధర రూ. 250, టీ ధర రూ. 100కు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా.. పెట్రోల్‌, డీజిల్‌ కోసం క్యూలో నిలుచున్న ఇద్దరు వ్యక్తులు ఆదివారం మృతిచెందినట్టు లంక పోలీసులు తెలిపారు. వీరు ఇంధనం కోసం క్యూలైన్‌లో నిలుచుకొని అస్వస్థతకు గురై చనిపోయినట్టు కొలంబోలో పోలీసు ప్రతినిధి నలిన్‌ తల్దువా పేర్కొన్నారు. మరోవైపు లంకేయులు విద్యుత్‌ కొరతను సైతం ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజూ కొన్ని గంటల పాటు కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నట్టు సమాచారం.