40 శాతం కవిూషన్‌’ వ్యవహారంలో కర్ణాటక మంత్రి ఈశ్వరప్పపై కేసు


` అమిత్‌షా ఇంటి వద్ద కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన
` ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోన్న కాంట్రాక్టర్‌ ఆత్మహత్య
మంగళూరు,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): కర్ణాటకలో ఇటీవల వెలుగు చూసిన ‘40 శాతం కవిూషన్‌’ వ్యవహారం భాజపా ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది.ఈ కేసులో కర్ణాటక గ్రావిూణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పపై తాజాగా కేసు నమోదయ్యింది. సివిల్‌ కాంట్రాక్టర్‌ ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలపై మంత్రిపై కేసు నమోదు చేసినట్లు మంగళూర్‌ పోలీసులు వెల్లడిరచారు. సూసైడ్‌ నోట్‌తోపాటు బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, మంత్రి ఈశ్వరప్పతోపాటు మరోఇద్దరిని నిందితులుగా చేర్చినట్లు తెలిపారు.తన చావుకు రాష్ట్ర మంత్రి ఈశ్వరప్ప కారణమని పేర్కొంటూ సంతోష్‌ పాటిల్‌ అనే ఓ సివిల్‌ కాంట్రాక్టర్‌ ఇటీవల ఉడుపిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆశయాలను పక్కనబెట్టి ఈ నిర్ణయం తీసుకున్నానని.. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితోపాటు భాజపా నేత యడియూరప్పలు తన కుటుంబాన్ని ఆదుకోవాలని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో తన సోదరుడి మరణానికి మంత్రి ఈశ్వరప్ప కారణమంటూ సంతోష్‌ సోదరుడు ప్రశాంత్‌ పాటిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందళగ గ్రామంలో చేపట్టిన రూ.4కోట్ల పనుల్లో 40శాతం కవిూషన్‌ కావాలంటూ తన సోదరుడుని మంత్రితోపాటు ఆయన అనుచరులు వేధించినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ కాంట్రాక్ట్‌కు సంబంధించి బిల్లులను విడుదల చేయాలంటూ ఎన్నోసార్లు (దాదాపు 80 సార్లు కలిసినట్లు) మంత్రికి మొరపెట్టుకునప్పటికీ ఫలితం లేదన్నారు. మంత్రి అనుచరులు బసవరాజు, రమేశ్‌లు తమకు 40 శాతం కవిూషన్‌ ఇవ్వాలంటూ వేధించారని ఆరోపించారు.ఇదిలా ఉంటే, 40శాతం కవిూషన్‌ వ్యవహారంపై కర్ణాటకలోని కాంట్రాక్టర్ల సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు సమర్పించాల్సిన కవిూషన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటీవలే ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలోనే సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య చేసుకోవడం కర్ణాటక ప్రభుత్వాన్ని ఇరుకునపడేశాయి. ఈ అంశంపై అటు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మంత్రి ఈశ్వరప్పను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో మంత్రిపై చర్యలకు భాజపా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అమిత్‌ షా ఇంటి వద్ద కాంగ్రెస్‌ ఆందోళన!
కర్ణాటకలో గుత్తేదారు సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య ఉదంతంతో ‘40 శాతం కవిూషన్‌’ ఆరోపణలు భాజపా సర్కార్‌కు తలనొప్పి వ్యవహారంగా మారింది.సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్యకు మంత్రి వేధింపులే కారణమని పేర్కొంటూ కాంగ్రెస్‌ శ్రేణులు దిల్లీలో ఆందోళన చేపట్టాయి. మంత్రి ఈశ్వరప్పను కేబినెట్‌ నుంచి ఉద్వాసన పలకాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ దిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇంటి వద్ద యువజన కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. దీంతో అమిత్‌ షా నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు.. ఈశ్వరప్ప రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి 40శాతం కవిూషను డిమాండ్‌ చేసి వేధింపులకు గురిచేయడం వల్లే ఆత్మహత్య చేసుకొంటున్నట్టు సంతోష్‌ పాటిల్‌ తన ఆఖరి మాటల్లో స్పష్టంగా పేర్కొన్నట్టు యువజన కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. ఆందోళనకారుల్ని అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రిని అరెస్టు చేయడానికి బదులుగా అమిత్‌ షా తమను అరెస్టు చేయిస్తున్నారని యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌ బీవీ మండిపడ్డారు. ఇది ఆరంభం మాత్రమేననీ.. సంతోష్‌ పాటిల్‌కు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.మరోవైపు, తన సోదరుడి ఆత్మహత్యకు మంత్రి ఈశ్వరప్పదే బాధ్యత అని సంతోష్‌ పాటిల్‌ సోదరుడు ప్రశాంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవిూషన్‌ డిమాండ్‌ చేయడంతో పాటు బెదిరింపులకు కూడా పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మంత్రి ఈశ్వరప్పతో పాటు ఆయన సన్నిహితులు బసవరాజ్‌, రమేశ్‌ అనే వ్యక్తులపైనా ఉడిపిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు కావడంతో సీఎం బసవరాజ్‌ బొమ్మై మంత్రికి సమన్లు పంపారు.