all news


 1.తెలంగాణ కోచ్‌ ఫ్యాక్టరీ గుజరాత్‌కు తరలింపు..

` దేశమంటే గుజరాతేనా.. మండిపడ్డ కేటీఆర్‌

` కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటును ‘మోడెమోక్రసీ’ అంటూ ఎద్దేవా 

` గుజరాత్‌కు చెందిన, గుజరాత్‌ చేత, గుజరాత్‌ కోసం పని చేస్తున్నారని మండిపాటు 

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 22(జనంసాక్షి):మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారుపై రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ మరోసారి మండిపడ్డారు. గుజరాత్‌లో లోకోమోటివ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ సెటైర్లు వేశారు. కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటును ‘మోడెమోక్రసీ’ అంటూ ఎద్దేవా చేశారు. గుజరాత్‌కు చెందిన, గుజరాత్‌ చేత, గుజరాత్‌ కోసం పని చేస్తున్నారని ట్విట్టర్‌ వేదికగా ధ్వజమెత్తారు. వరంగల్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు హావిూని విస్మరించారన్న కేటీఆర్‌.. ఎన్‌పీఏ ప్రభుత్వానికి సిగ్గు చేటని మండిపడ్డారు. వరంగల్‌కు కేంద్రం ప్రకటించిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇప్పటికీ రాకపోగా.. గుజరాత్‌కు మాత్రం ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ ఇంజిన్‌ ప్రాజెక్టును ప్రకటిస్తూ కేంద్రం ఇటీవలే కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావు ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టగా.. కేటీఆర్‌ స్పందించారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ఆశీర్వదించి రెండు సార్లు అధికారం కట్టబెట్టిన ఈ రాష్ట్ర ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు అన్నారు.రాష్ట్ర ప్రజలు ఇచ్చిన చేయూత, ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనిదన్నారు. 21 సంవత్సరాల తర్వాత కూడా తెరాస ఇలా ఉందంటే లక్షల మంది కార్యకర్తల శ్రమ, వారి త్యాగాలు ఎన్నో ఉన్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీగా రాజకీయాల్లో అడుగుపెట్టి.. ఎదిగి.. విజయం సాధించిన ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం తర్వాత అదే స్థాయిలో కేసీఆర్‌ నాయకత్వంలో తెరాస ఆవిర్భవించి ఒక సంచలనంగా మారిందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలే కేంద్ర బిందువుగా.. వారి ఆశయాలు, ఆలోచనలే తెరాసను నడిపిస్తున్నాయని అన్నారు‘‘ దేశంలోని 28 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ సాధించిన విజయాలు చూస్తే.. ఒక రకంగా మేం జాతీయ రాజకీయాల్లో ఉన్నట్లే. ఒక రాష్ట్రం దేశస్థాయిలో సంచలనాలు సృష్టిస్తుంటే.. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే సాగునీటి, విద్యుత్‌, తాగునీటి, సంక్షేమ రంగంలో గుణాత్మక మార్పులు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌ తనదైన ముద్ర వేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కేవలం నాలుగేళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తి చేసి చూపించగలిగాం. విద్యుత్‌, ఫ్లోరైడ్‌ సమస్య.. ఇలా చెప్పుకొంటూ పోతే అనేక విషయాలున్నాయి. ఇవన్నీ ఒకరకంగా దేశానికి ఆదర్శంగా మారాయి. మనం పెట్టిన రైతు బంధు ఇవాళ దేశానికి ప్రేరణగా నిలిచింది. కేంద్రం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలకు తెలంగాణలో చేపట్టిన పథకాలే ప్రేరణ, మూలం. దేశానికి ఇప్పటికే తెలంగాణ అజెండా సెట్‌ చేసింది. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది.సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కేసీఆర్‌. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? అనేది సరైన సమయంలో వారే వెల్లడిస్తారు. ఏ దిశగా కార్యచరణ ఉంటుందో వారే వివరిస్తారు. ఒకటి మాత్రం చెప్పగలను. దేశంలో ఎవరూ చేయని పనులు.. దశాబ్దాలుగా ఎక్కడా జరగని పనులను కేసీఆర్‌ చేసి చూపించారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్థికంగా ఆదాయాన్ని ఇస్తున్న నాలుగో పెద్ద రాష్ట్రం తెలంగాణ. ఈ విషయాన్ని ఆర్‌బీఐ స్వయంగా వెల్లడిరచింది. ఇంతటి పురోగతిని ఒక రాష్ట్రం సాధించగలిగితే దేశంలోని మిగతా రాష్ట్రాలు ఎందుకు సాధించలేవు? ఆ రకంగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఇది మా ఆవేదన.. మా బాధ.. ఏ రూపంలో దీన్ని ఆవిష్కరించాలనే విషయాన్ని సరైన సమయంలో కేసీఆర్‌ వెల్లడిస్తారు. ఏ రూపంలో అయినా సరే.. తెలంగాణపై చర్చ జరగాలి. తప్పకుండా దేశవ్యాప్తంగా ఒక కదలిక తీసుకువస్తాం’’ అని అన్నారు.




2.ఆర్డీఎస్‌ అంటే ఎంటో నీకు తెలుసా..!

` బండి సంజయ్‌ కాదు.. బంగి సంజయ్‌

` ఆర్డీఎస్‌ కొనా..మొదలు తెలియని నీవు ఆరు నెల్లలో ఎలా పూర్తిచేస్తావో చెప్పాలి!

` ప్రాజెక్టుల గురించి తెలియకుండా ఎలా మాట్లాడువు!

` మండిపడ్డ మంత్రి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 22(జనంసాక్షి):ఆర్డీఎస్‌(రాజోలిబండ డైవర్షన్‌ స్కీం) పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తప్పుబట్టారు. ఆయనకు ఆర్డీఎస్‌ కొన తెల్వదు.. మొన తెల్వదు అని నిరంజన్‌ రెడ్డి విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు తెల్వవు.. రిజర్వాయర్లు తెల్వవు అని నిప్పులు చెరిగారు. ప్రాజెక్టుల గురించి తెలవకుండా మాట్లాడితే కనీసం ప్రజలు నవ్వుకుంటున్నారన్న ఇంగితం కూడా సంజయ్‌కు లేదని ఎద్దెవా చేశారు.ఆరు నెలల్లో ఆర్డీఎస్‌ ఎలా పూర్తి చేస్తావో కాగితం రాసిస్తావా? అని బండిని నిరంజన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆర్డీఎస్‌ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏ పనులు చేపడతావ్‌ ? ఎక్కడ నుండి నిధులు తెస్తావో ప్రజలకు వివరాలు వెల్లడిరచాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టుకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్డీఎస్‌ కాలువను నిజాం ప్రభుత్వం ప్రతిపాదించింది. 1946లో పనులు ప్రారంభమై 1958లో పూర్తయిందని మంత్రి తెలిపారు. తుంగభద్ర నదిపై రాయచూర్‌ జిల్లా మాన్వి వద్ద నిర్మించిన అంతర్‌ రాష్ట్ర ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు పూర్తి ఆయకట్టు 93,379 ఎకరాలని నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.ఆర్డీఎస్‌కు కృష్ణా వాటర్‌ ట్రిబ్యునల్‌ 17.1 టీఎంసీల నీటిని కేటాయించిందని మంత్రి గుర్తు చేశారు. ఆర్డీఎస్‌ ప్రధాన కాలువ మొత్తం 142 కిలోవిూటర్లు కాగా, మొదటి 42 కిలోవిూటర్లు కర్ణాటకలో, మిగతా 100 కిలోవిూటర్లు తెలంగాణలో ఉందన్నారు. ఈ కాలువ ద్వారా అలంపూర్‌ నియోజకవర్గానికి తాగు, సాగునీరు అందించడం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. కానీ ఆర్డీఎస్‌ కాలువ ద్వారా ఎన్నడూ కర్ణాటక సంపూర్ణంగా నీరిచ్చిన ధాఖలాలు లేవు. అలంపూర్‌ తాలూకాలో 87,500 ఎకరాల ఆయకట్టుకు 15.9 టీఎంసీల నీరందించాలి. కానీ ఇప్పటి వరకు ఎన్నడూ 20 వేల ఎకరాలకు నీళ్లు పారలేదని నిరంజన్‌ రెడ్డి తెలిపారు.ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతులకు మద్దతుగా 2003 జులై 16న అలంపూర్‌ జోగుళాంబ ఆలయం వద్ద కేసీఆర్‌ పాదయాత్ర ప్రారంభించారు. జులై 25 వరకు పాదయాత్ర కొనసాగించి.. గద్వాలలో లక్ష మందితో బహిరంగసభ నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత 2003, ఆగస్టులో ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతాంగానికి జరుగుతున్న అన్యాయంపై ఉమ్మడి ఏపీలోని ఎంపీలందరికీ కేసీఆర్‌ బహిరంగ లేఖలు రాసిన విషయాన్ని కూడా నిరంజన్‌ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్‌ తీసుకున్న ఈ చర్యల ద్వారానే ఆర్డీఎస్‌ సమస్యపై 2004 లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. ఆర్డీఎస్‌ ద్వారా తెలంగాణకు సాగునీరు అందడం లేదని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 2014 వరకు ఎటువంటి చర్యలు లేవు. అనేకమార్లు టీఆర్‌ఎస్‌ ఆర్డీఎస్‌ ఆయకట్టుపై ఉద్యమించిందని నిరంజన్‌ రెడ్డి గుర్తు చేశారు.2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టుల రీ డిజైన్‌ చేస్తున్న నేపథ్యంలో ఆర్డీఎస్‌ విూద సంపూర్ణ సవిూక్ష నిర్వహించారని నిరంజన్‌ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి 2017లో తెలంగాణ ప్రభుత్వం జీఓ 429 విడుదల చేస్తూ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రూ.780 కోట్లతో చేపట్టి కేవలం పది నెలలలో పూర్తిచేసింది. తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద మల్లమ్మకుంట, జూలకల్‌, వల్లూరు రిజర్వాయర్లను ప్రతిపాదించారు. ఈ రిజర్వాయర్లకు సంబంధించిన సర్వే పూర్తయిందని తెలిపారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్డీఎస్‌ కాలువ కింద సాగునీరందని, 50 వేల ఎకరాలకు నీరందించడం జరుగుతున్నదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఆర్డీఎస్‌ ఆయకట్టుకు నీళ్లు ఇస్తానన్న మాటను తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నిలబెట్టుకున్నారని మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు.పుట్టిన నడిగడ్డను, తెలంగాణను గాలికి వదిలేసి, ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు అన్యాయం చేసి దోచుకుపోయిన హాంద్రీనీవా నీళ్లకు హారతిపట్టిన డీకె అరుణను పక్కనపెట్టుకుని బండి సంజయ్‌ ఆర్డీఎస్‌ ఆయకట్టు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అన్నారు.అసలు ప్రాజెక్టుల విూద బండి సంజయ్‌కు ఉన్న అవగాహన సున్నా.. అరవై ఏండ్ల కింద పూర్తయిన ఆర్డీఎస్‌ను ఆరునెలలలో పూర్తి చేస్తాననడం అవివేకం.. అవగాహనారాహిత్యం అని నిరంజన్‌ రెడ్డి అన్నారు. నిజాం ప్రభుత్వం గద్వాల, వనపర్తి, అలంపూర్‌, కొల్లాపూర్‌ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టును, దానిలో భాగంగా గద్వాల కాలువను ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. దీని ద్వారా దాదాపు 200 టీఎంసీల సాగు నీరు ఉమ్మడి పాలమూరు జిల్లా వాడుకునే అవకాశం ఉండేది. హైదరాబాద్‌ రాష్ట్రం ఆంధ్రలో విలీనం కావడం, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ కాలువ కర్ణాటక వరకే కుదించబడిరదని తెలిపారు. ఈ రోజు అప్పర్‌ కృష్ణాలో భాగమైనటువంటి నారాయణపూర్‌, ఆల్మట్టి డ్యాంలలో దాదాపు 50 టీఎంసీలు ఈ వేసవిలో నిలువ ఉన్నాయి. జూరాల, శ్రీశైలం ఎండిపోయాయి. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఎండాకాలంలో జూరాలను నింపే దమ్ము, ధైర్యం ఉందా ? ఆర్డీఎస్‌ హెడ్‌ వర్క్స్‌ వద్ద 87,500 ఎకరాలకు సాగునీరు తీసుకువెళ్లేలా పనులు చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకురాగలిగే దమ్ముందా ? అని నిరంజన్‌ రెడ్డి ప్రశ్నించారు.ఆర్డీఎస్‌ కాలువకు సాగునీరు తీసుకువచ్చే ప్రాంతం కర్ణాటకలో ఉంది. అక్కడ తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. సుంకేశుల తెలంగాణ వచ్చే వరకు పూర్తిగా నూటికి నూరుపాళ్లు ఆంధ్రాకు ధారాదత్తం. ఇప్పుడు అదే సుంకేశుల నుండి తుమ్మిళ్ల ఎత్తిపోతలకు సాగునీరు లిఫ్ట్‌ చేస్తున్నామని తెలిపారు. పాలమూరు వాగులు, వంకలు తెలియని వాళ్లు పాలమూరు ప్రాజెక్టుల గురించి వంకలు పెట్టడం హస్యాస్పదంగా ఉందని నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు.




3.మా బంధం బలమైనది

` భారత్‌ టీకా తో ప్రాణాలు నిలిచాయి

` ఆర్థిక నేరస్థులను అప్పగించేందుకు చర్యలు 

` మోడీతో సంయుక్త సమావేశంలో బోరిస్‌ పలు అంశాలు వెల్లడి

న్యూఢల్లీి,ఏప్రిల్‌ 22(జనంసాక్షి):భారత్‌తో తమ బంధం బలమైనదని బ్రిటన్‌ దేశ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ స్పష్టం చేశారు. బ్రిటన్‌ గడ్డపై ఉంటూ, ఇతర దేశాలను బెదిరించే ఉగ్రవాద సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదనేది తమ బలమైన దృక్పథమని చెప్పారు. .భారత దేశానికి సహాయపడేందుకు తాము యాంటీ ఎక్స్‌ట్రీమిస్ట్‌ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి హైదరాబాద్‌ హౌస్‌లో సంయుక్త విూడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక నేరగాళ్ళు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, ఖలిస్థానీ ఉగ్రవాదుల ను భారత దేశానికి అప్పగించడం గురించి విూడియా అడిగిన ప్రశ్నకు జాన్సన్‌ సమాధానం చెప్తూ, భారత దేశాన్ని, ఇతర దేశాలను బెదిరించే ఉగ్రవాద సంస్థల పట్ల తమకు బలమైన దృక్పథం ఉందని చెప్పారు. భారత దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో ఉంటున్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి అప్పగించడం గురించి మాట్లాడుతూ, చట్టపరమైన సాంకేతిక అంశాలు ఇమిడియున్నందువల్ల వీరిని తిరిగి అప్పగించడం సంక్లిష్టమవుతోందని చెప్పారు. వారిని తిరిగి పంపిచేయాలని బ్రిటన్‌ ప్రభుత్వం ఆదేశించిందన్నారు. భారత దేశంలోని చట్టాన్ని తప్పించుకోవడం కోసం బ్రిటన్‌లోని న్యాయ వ్యవస్థను ఉపయోగించు కోవాలనుకునే వారిని తాము స్వాగతించబోమని చెప్పారు. భారత టీకా బాగా పని చేసింది నా చేతికి భారత కోవిడ్‌`19 టీకా వేయించుకున్నాను. అది నాకు మేలు చేసింది. భారత దేశానికి చాలా ధన్యవాదాలు అని బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు.  భారత్‌`బ్రిటన్‌ కోవిడ్‌ టీకా భాగస్వామ్యంభారత్‌`బ్రిటన్‌ మధ్య వ్యాక్సిన్ల భాగస్వామ్య ఒప్పందం ఉంది. 2021 మే నెలలో మోదీ, జాన్సన్‌ మధ్య జరిగిన వర్చువల్‌ సమావేశంలో ఇరు దేశాలు ఈ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడానికి అంగీకారించారు.  కోవిడ్‌ మహమ్మారి నుంచి కోలుకోవడానికి భాగస్వామ్యాన్ని పటిష్టపరచుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో ఉత్పత్తి చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్ల వల్ల దాదాపు 100 కోట్ల మందికి ప్రయోజనం కలిగింది. ఇదిలావుంటే  ఆర్థిక నేరాలకు పాల్పడి భారత్‌ నుంచి పారిపోయి, బ్రిటన్‌లో ఉంటున్నవారిని తిరిగి తమకు అప్పగించాలని బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ను భారత ప్రభుత్వం కోరింది. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ సహా ఆర్థిక నేరగాళ్ళను తిరిగి అప్పగించాలని చేసిన విజ్ఞప్తిని జాన్సన్‌ దృష్టిలో ఉంచుకున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శృంగ్లా శుక్రవారం చెప్పారు. భారత్‌, బ్రిటన్‌ ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, బోరిస్‌ జాన్సన్‌ చర్చల అనంతరం శృంగ్లా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ సహా భారత్‌కు చెందిన ఆర్థిక నేరగాళ్ళను తిరిగి తమకు అప్పటించాలని కోరామని, ఈ విషయాన్ని జాన్సన్‌ దృష్టిలో ఉంచుకున్నారని చెప్పారు. ఆర్థిక నేరగాళ్ళ విషయాన్ని తాము బ్రిటన్‌లో వివిధ స్థాయుల్లో లేవనెత్తుతు న్నామని చెప్పారు. మన దేశంలో చట్టపరమైన చర్యలను, విచారణను ఎదుర్కొనవలసి ఉన్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి రప్పించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ వేల కోట్ల రూపాయల మేరకు బ్యాంకులను మోసగించినట్లు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. నీరవ్‌ మోదీ, ఆయన భార్య అమి 2018లో దేశం విడిచి వెళ్లిపోయారు. ఆయన ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో ఉన్నారు. ఆయనను భారత్‌కు అప్పగించాలన్న కోర్టు ఆదేశాలపై అపీలు చేశారు. మాల్యా 2016 నుంచి లండన్‌లోనే ఉంటున్నారు. బ్యాంకులను మోసగించినట్లు, మనీలాండరింగ్‌ నేరాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి. ఆయనను భారత్‌కు అప్పగించాలనే ఆదేశాలపై బ్రిటన్‌ హోం శాఖ కార్యదర్శి సాజిద్‌ జావిద్‌ 2019లో సంతకం చేశారు. 

ఢల్లీిలో బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌కు ఘనస్వాగతం

బ్రిటన్‌`భారత్‌ సంబంధాలు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉన్నాయని బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. ఆయన రెండో రోజు భారత్‌ పర్యటన శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. గురువారం ఆయన గుజరాత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. అనంతరం జాన్సన్‌ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయన్నారు. తనకు ఘన స్వాగతం పలికినందుకు భారత దేశానికి ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు స్వాగతం పలికినవారిలో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ కూడా ఉన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు సాదర స్వాగతం పలికారు. ఈ క్రమంలో కరచాలనంతో ఇరుదేశాధినేతలు ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు.బోరిస్‌ జాన్సన్‌ గురువారం గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ ఆశ్రమాన్ని సందర్శించిన తొలి బ్రిటన్‌ ప్రధాన మంత్రి ఆయనే. శుక్రవారం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్‌లో, నా మిత్రుడు నరేంద్ర మోదీని నేడు న్యూఢల్లీిలో కలవడం కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఇంధన భద్రత, రక్షణ వంటి రంగాల్లో తమ ప్రజాస్వామిక దేశాల భాగస్వామ్యం చాలా కీలకమైనదని తెలిపారు. నిరంకుశ దేశాల నుంచి ప్రపంచానికి ముప్పు పెరుగుతున్న దశలో ప్రజాస్వామిక దేశాల భాగస్వామ్యం చాలా ముఖ్యమైనదని తెలిపారు. మోదీ, జాన్సన్‌ చర్చల్లో ఉక్రెయిన్‌ యుద్ధం గురించి ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌ పర్యటనపై జాన్సన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్‌, భారత్‌ భాగస్వామ్యం వల్ల వచ్చిన అద్భుతమైన ఫలితాలను గుజరాత్‌లో చూస్తుండటం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని  ఆయన ఇచ్చిన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌ లో మహాత్మా గాంధీకి బోరిస్‌ నివాళులు అర్పించారు. పూలు వేసి మహాత్ముడి సేవలను స్మరించుకు న్నారు. అనంతరం రాజ్‌ఘాట్‌ సిబ్బంది బోరిస్‌కు జ్ఞాపిక అందజేశారు. తనకు ఘన స్వాగతం పలికినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.దేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి పారిపోయిన నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా వంటి వారిని అప్పగించడంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. భారతదేశ వ్యతిరేక అంశాలు, యూకేలో ఖలిస్థాన్‌ మద్దతుదారుల వ్యవహారం కూడా చర్చకు రావచ్చు. అంతేకాకుండా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇండో`పసిఫిక్‌ ప్రాంతం, ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలు సహా భారత్‌లో పెట్టుబడులు, బ్రిటన్‌లోని భారతీయులకు వీసాల సడలింపు వంటి అంశాలపై ప్రధానంగా భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.


4.అదానీ షేర్లకు కాసుల వర్షం

` నెల రోజుల్లో లక్షకు లక్ష

ఢల్లీి,ఏప్రిల్‌ 22(జనంసాక్షి):మార్కెట్‌ విలువ పరంగా తొలి 50 కంపెనీల జాబితాలోకి అదానీ పవర్‌ చేరింది. గత నెల వ్యవధిలో ఈ కంపెనీ స్టాక్‌ విలువ రెండిరతలు కావడం విశేషం. గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని ఈ సంస్థ షేర్లు శుక్రవారం ఇంట్రాడేలో రూ.259.20 వద్ద తాజా గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఎన్‌ఎస్‌ఈలో నెల క్రితం రూ.125.50 వద్ద ఉన్న ఈ స్టాక్‌ ధర ఇప్పటి వరకు 106 శాతం ఎగబాకింది. అంటే మార్చి 25న రూ.1,00,000 పెట్టుబడిగా పెట్టినవారు ఇప్పటి వరకు రూ.1,06,000 లాభాన్ని గడిరచారన్నమాట! కేవలం ఒక్క నెల వ్యవధిలో పెట్టిన పెట్టుబడి రెట్టింపవడం విశేషం.మార్కెట్‌ క్యాపిటలైజేషన్పరంగా అదానీ పవర్‌ రూ.లక్ష కోట్లకు చేరువైంది. ప్రస్తుతం రూ.99,972 కోట్లతో అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీల జాబితాలో 49వ స్థానంలో ఉంది. డాబర్‌ ఇండియా (రూ.98,470 కోట్లు), డీఎల్‌ఎఫ్‌ (రూ.95,052 కోట్లు)ను దాటేసింది. అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఇప్పటి వరకు ఆరు సంస్థలు టాప్‌`50లో చోటు సంపాదించుకున్నాయి. అదానీ గ్రీన్‌ (రూ.4.44 లక్షల కోట్లు), అదానీ ట్రాన్స్మిషన్‌ (రూ.2.92 లక్షల కోట్లు), అదానీ టోటల్‌ గ్యాస్‌ (రూ.2.66 లక్షల కోట్లు), అదానీ ఎంటర్ప్రైజెస్‌ రూ.(రూ.2.51 లక్షల కోట్లు), అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ (రూ.1.85 లక్షల కోట్లు) ఈ జాబితాలో ఉన్నాయి. ఇటీవల మార్కెట్లో లిస్టయిన అదానీ విల్మర్‌ రూ.94,493 కోట్లతో 12వ స్థానంలో కొనసాగుతోంది.అదానీ పవర్‌ భారత్లో అతిపెద్ద ప్రైవేట్‌ థర్మల్‌ విద్యుదుత్పత్తి సంస్థ. ఈ కంపెనీకి 12,410 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, ఛత్తీస్గడ్‌, గుజరాత్లో దీని విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.218.49 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.



5.మేరియుపొల్‌లో మారణహోమం..? 

` సామూహిక సమాధులు వెలుగులోకి..!

` వేల సంఖ్యలో మరణాలు ఉండవచ్చన్న ఉక్రెయిన్‌ అధికారులు

కీవ్‌,ఏప్రిల్‌ 22(జనంసాక్షి):ఉక్రెయిన్‌లో భీకర దాడులకు తెగబడుతోన్న రష్యా సేనలు పలు నగరాల్లో సామాన్య పౌరులపై దుశ్చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.ఇప్పటికే బుచాలో వెలుగు చూసిన దారుణ ఘటన మరువక ముందే మేరియుపొల్‌లోనూ అటువంటి ఆకృత్యాలే జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రష్యా సేనల అధీనంలో ఉన్న మేరియుపొల్‌లో వేల సంఖ్యలో ఉక్రెయిన్‌ పౌరులను హతమార్చి.. ఆ నేరాలను దాచిపెట్టేందుకు మృతదేహాలను పాతిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేరియుపొల్‌ సవిూపంలో తాజాగా వెలుగు చూసిన సామూహిక సమాధులు ఉక్రెయిన్‌ అధికారుల ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు వెలుగు చూడడంతో ఇటీవల బుచాలో బయటపడిన దానికంటే దారుణాలు మేరియుపొల్‌లో చోటుచేసుకున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఉక్రెయిన్‌ ప్రధాన నగరాల్లో ఒకటైన మేరియుపొల్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో వేల మంది పౌరులను పొట్టనబెట్టుకున్నాయనే వార్తలు వెలుబడ్డాయి. తాజాగా మేరియుపొల్‌కు సవిూపంలోని మన్‌హుష్‌ పట్టణంలో 200లకు పైగా సమాధులు తవ్విన విషయం మాక్సర్‌ టెక్నాలజీస్‌ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో వెలుగు చూసింది. మేరియుపొల్‌లో ప్రతిఘటించిన పౌరులను హతమార్చి సవిూప పట్టణంలో తవ్విన ఈ సమాధుల్లో పూడ్చివేస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. కేవలం యుద్ధ నేరాలను కప్పిపుచ్చుకోవడానికే రష్యా సైన్యం ఈ దాష్టీకాలకు పాల్పడుతోందని మేరియుపొల్‌ మేయర్‌ వాదిం బోయ్‌కెన్‌కో ఆరోపించారు. ఇప్పటివరకు 9వేల మందిని పూడ్చగలిగే సమాధులను గుర్తించినట్లు మేరియుపొల్‌ సిటీ కౌన్సిల్‌ అంచనా వేసింది.

20వేల మంది మృతి..?

4లక్షలకు పైగా జనాభా కలిగిన మేరియుపొల్‌లో ప్రస్తుతం లక్ష మంది చిక్కుపోయినట్లు సమాచారం. క్షిపణి దాడులతో నాశనమవుతోన్న నగరంలో ఆహారం, నీరు, ఔషధాల లేమితో వారందరూ తీవ్రంగా సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ అధికారుల లెక్కల ప్రకారం, రష్యా సేనల ఆధీనంలో ఉన్న మేరియుపొల్‌లోనే 20వేలకుపైగా పౌరులు మరణించి ఉండవచ్చని అంచనా. అయితే, ఆ నగర సవిూపంలోని గ్రామాల్లో హత్యాకాండకు పాల్పడుతూ మృతదేహాలను సామూహిక ఖననాలు చేస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. తాజాగా మేరియుపొల్‌ సవిూపంలోని మన్‌హుష్‌ పట్టణంలో వెలుగు చూసిన వందల సంఖ్యలో సమాధులు మార్చి నెలలోనే తవ్వినప్పటికీ ఈ మధ్యే వాటి సంఖ్య పెరిగినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోందన్నారు.ఇదిలా ఉంటే, ఉక్రెయిన్‌ నుంచి మేరియుపొల్‌కు విముక్తి కలిగించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవల ప్రకటించారు. ఇదే సమయంలో అక్కడి అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉన్న సొరంగాల్లో 2వేల మంది ఉక్రెయిన్‌ సైనికులు ఉన్నట్లు అంచనా. అయినప్పటికీ ఆ ప్రాంతం మొత్తం ముట్టడిరచి ఏ ఒక్కరినీ అందులోకి వెళ్లనీయొద్దని రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షోయిగును అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశించారు. కనీసం మూడు, నాలుగు రోజుల తర్వాతైనా సొరంగంలో వారు ఆహారం, నీటి కోసం బయటకు వస్తారని.. అలా వచ్చేవారిని అదుపులోకి తీసుకోవాలని రష్యా సేనలు వ్యూహరచన చేసినట్లు సమాచారం.




6.బోర్డు సమావేశానికి ఆంధ్రా అధికారుల డుమ్మా

` గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మరోసారి వాయిదా 

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 22(జనంసాక్షి):గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మరోసారి వాయిదా పడిరది. ఏపీ సభ్యుల ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి రాలేదని, దీంతో భేటీ వాయిదా పడిరదని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ అన్నారు. బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌ అధ్యక్షతన జరగాల్సిన ఈ భేటీకి తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, ఇంజినీర్లు హాజరయ్యారు. కానీ ఏపీకి చెందిన ఒక్క అధికారి కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో బోర్డు ఈ సమావేశాన్ని వాయిదా వేసింది. ఏపీ సభ్యుల గైర్హాజరుతో మార్చి 11న కూడా భేటీ వాయిదా పడిరది. ఏపీ సభ్యులు కావాలనే సమావేశానికి రాలేదని రజత్‌ కుమార్‌ అన్నారు. వరుసగా రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ వారు హాజరుకాలేదని చెప్పారు. తెలంగాణకు సంబంధించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు బోర్డు ఆమోదం తెలపాలని వెల్లడిరచారు. ఏపీ సభ్యులు రాకపోవడంతో అనుమతులకు ఆలస్యమవుతోందని చెప్పారు. సీతమ్మసాగర్‌, తుపాకులగూడెంకు హైడ్రలాజికల్‌ అనుమతి వచ్చిందన్న తెలిపారు. ఆరు నెలల్లోపు అన్ని ప్రాజెక్టులకు అనుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై కేంద్రం ఇంకా ట్రైబ్యునల్‌కు నివేదించడం లేదన్నారు.



7.మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 22(జనంసాక్షి):ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయిగణెళిశ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అతని ఆత్మహత్యకు సంబంధించి హైకోర్టులో దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. పోలీసుల వేధింపులు తాళలేక సాయి గణెళిశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని కోరారు. అయితే సాయి గణెళిశ్‌ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్‌ ధాఖలు చేస్తామని ఏజీ ధర్మాసనానికి విన్నవించారు. దీంతో న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 14న ఖమ్మం త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు సాయి గణెళిశ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బీజేపీ కార్యకర్తలు వెంటనే ఆయనను హాస్పిటల్‌ లో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరణానికి ముందు విూడియాతో మాట్లాడిన సాయి గణెళిశ్‌ తనను మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వేధింపులకు గురి చేసినట్లు చెప్పారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు తనపై 16 కేసులు పెట్టడంతో పాటు రౌడీ షీట్‌ ఓపెన్‌ చేశారని చెప్పాడు.



8.ప్రేమోన్మాది ఘాతుకం

యువతిపై కత్తితో దాడి

ఆస్పత్రికి తరలింపు

హనుమకొండ,ఏప్రిల్‌ 22(జనంసాక్షి):మరో ప్రేమోన్మాది చెలరేగాడు. తనను ప్రేమించట్లేదనే కోపంతో ఆ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన హనుమకొండలోని సుబేదారి పోలీసు స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. నర్సంపేట పరిధిలోని లక్నెపల్లి గ్రామానికి చెందిన అనూష(23) కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ్గªనైలియర్‌ చదువుతోంది. చదువు రీత్యా అనూషతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పోచమ్మ గుడి సవిూపంలోని గాంధీ నగర్‌లో నివాసముంటున్నారు. అయితే తనను ప్రేమించాలని అజహర్‌ అనే యువకుడు.. అనూషను గత కొంతకాలం నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడు. అనూష మాత్రం అజహర్‌ ప్రతిపాదనను తిరస్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గాంధీ నగర్‌ చేరుకున్న అజహర్‌.. ఇంట్లో అనూష ఒక్కరే ఉన్నట్లు నిర్దారించుకున్నాడు. దీంతో ఇంట్లోకి ప్రవేశించిన అజహర్‌.. తనను ప్రేమించాలని పట్టుబట్టాడు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తన వెంట తెచ్చుకున్న కత్తితో అనూష గొంతును కోసి పరారీ అయ్యాడు. అప్పుడే ఇంటికి వచ్చిన తల్లి.. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అనూషను చూసి షాక్‌కు గురైంది. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్‌లో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనూషకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సుబేదారి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అజహర్‌ను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు.



9.ఢల్లీిలో వయోజనులకు ఉచితంగా బూస్టర్‌ డోస్‌

న్యూఢల్లీి,ఏప్రిల్‌ 22(జనంసాక్షి):దేశ రాజధాని నగరమైన ఢల్లీిలో వయోజనులందరికీ కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌ ఉచితంగా ఇస్తున్నారు. అన్ని ప్రభుత్వ టీకా కేంద్రాల్లో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల అర్హులైన వారందరికీ బూస్టర్‌ కొవిడ్‌`19 డోస్‌ ఉచితంగా వేస్తున్నట్లు ఢల్లీి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.దేశ రాజధానిలో కరోనావైరస్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢల్లీి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, రెండవ డోస్‌ తీసుకున్న తర్వాత తొమ్మిది నెలలు నిండిన వారందరూ ముందు జాగ్రత్త మోతాదుకు అర్హులు.ఢల్లీిలో గురువారం 965 కొత్త కొవిడ్‌`19 కేసులు నమోదయ్యాయి. ఢల్లీిలో ప్రస్థుతం యాక్టివ్‌ కేసులు 3,000కి చేరుకున్నాయి.


10.విదేశీ ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం... 

` సీఈసీ సుశీల్‌ చంద్ర

దిల్లీ,ఏప్రిల్‌ 22(జనంసాక్షి):ఎన్నికల్లో నమోదవుతున్న విదేశీ ఓట్ల సంఖ్య తక్కువగా ఉందని అందుకే వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించాలని భావిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్‌ చంద్ర తెలిపారు.దక్షిణాఫ్రికా, మారిషస్‌లోని భారత సంతతితో మాట్లాడుతూ ఈ ఆలోచనను వ్యక్తం చేశారు. ఇరు దేశాల్లో అధికారికంగా పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడి భారతీయులతో ఆయన శుక్రవారం సంభాషించారు. భారతీయ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. విదేశీయులకు ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌విూటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టమ్‌ (ఈటీపీబీఎస్‌) సదుపాయాన్నికల్పించనున్నట్లు చెప్పారు.ఈ ఈటీపీబీఎస్‌ సదుపాయం ఇప్పటి వరకు సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాల సభ్యులు, భారతీయ రాయబార కార్యాలయాలు, దౌత్య సంబంధాల అధికారులకు మాత్రమే విస్తరించి ఉంది. 2020లో అర్హత కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించాలని ఎన్నికల కమిషన్‌ కేంద్రానికి నివేదించిందని తెలిపారు. నవంబర్‌ 27, 2020న న్యాయ మంత్రిత్వశాఖలోని శాసనసభ కార్యదర్శికి పంపిన లేఖలో, సేవా ఓటర్ల విషయంలో ఈ ఈటీపీబీఎస్‌ సదుపాయం విజయవంతంగా అమలు చేశారని ఇప్పుడు విదేశాల్లో కూడా అందుబాటులోకి తేవాలని కోరినట్లు చెప్పారు. ఎన్నికల కమిషన్‌ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపి ఈ విషయంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి ప్రయత్నిస్తోందన్నారు. ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐలు తమ నమోదిత నియోజకవర్గాల్లో ఓటు వేస్తున్నారన్నారు.భారత్‌లో ఎన్నికల నిర్వహణ: దాదాపు 1,12,000 మంది విదేశీయులు భారతీయ ఓటర్లుగా నమోదయ్యారని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. రెండు దేశాల పర్యటన సందర్భంగా సుశీల్‌ అనేక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణలో తన అనుభవాలను ప్రవాస భారతీయులతో పంచుకున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో దాదాపు 950 మిలియన్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు ఓటు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్‌ ప్లాట్‌ఫాంలను ఉపయోగించుకుని ఏకీకృత ప్రాతిపదికన న్యాయమైన ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎస్‌వీఈఈపీ, ఈవీఎమ్‌, వీవీపీఎటీ వంటి సాంకేతిక వేదికల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.



11.రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వానలు 

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 22(జనంసాక్షి):గత కొన్ని రోజులుగా భాణుడి ప్రతాపం, వేడి గాలులు, ఉక్కబోతతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, తెలంగాణ విూదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, ఈ నెల 25 వరకు దాని ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని వెల్లడిరది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిన విషయం తెలిసిందే. నగర వ్యాప్తంగా వాన కురింది. ఇప్పటికే నగరం మొత్తం మేఘావృతమై ఉన్నది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిరది.



12.ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతోన్న జమ్ముకశ్మీర్‌.. 

` ప్రధాని పర్యటనకు ముందు భారీ ఉగ్రదాడి..!

శ్రీనగర్‌,ఏప్రిల్‌ 22(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ 2019 తర్వాత తొలిసారి జమ్ములో పర్యటించడానికి 48 గంటల ముందు భారీ ఉగ్ర దాడులు జరిగాయి.ఈ క్రమంలో భారీ ఎన్‌కౌంటర్‌ మొదలైంది. జమ్ములో ఓ సైనిక చెక్‌పోస్టు సవిూపంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా.. ఒక సీఐఎస్‌ఎఫ్‌ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.జమ్ములో ఉగ్రదాడి జరగొచ్చని 21వ తేదీన భద్రతా దళాలకు నమ్మకమైన సమాచారం అందడంతో.. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని సుంజ్వాన్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. అదే సమయంలో సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్సును తరలిస్తున్న ఓ బస్సును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు అండర్‌ బ్యారెల్‌ గ్రనేడ్‌ లాంఛర్‌ సాయంతో దాడి మొదలుపెట్టారు. ఈ ఘటనలో ఒక అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితోపాటు జమ్ముకశ్మీర్‌ పోలీసులు కూడా ఉన్నారు.దాడి సమయంలో బస్సులో 15 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారు వెంటనే అప్రమత్తమై ఎదురుదాడి ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు ఆంగ్ల వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. మృతి చెందిన ఉగ్రవాదులు జైషే మహమ్మద్‌ గ్రూపునకు చెందినవారుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌, మొబైల్‌ సర్వీసులను నిలిపివేశారు. డ్రోన్లను రంగంలోకి దించి ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్‌ డీజీపీ దల్బీర్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘’సుంజ్వాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతాదళాలపై భారీ ఎత్తున దాడి చేయడం కోసం వారు అక్కడ పొంచి ఉన్నారు’’ అని వెల్లడిరచారు. 2018లో కూడా సుంజ్వాన్‌లోని సైనిక క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పట్లో ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు ఆ ఘటనలో మరణించారు.జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో గురువారం ప్రారంభమైన మరో ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తోయిబ కమాండర్‌ యూసఫ్‌ కంత్రూ కూడా ఉన్నట్లు సమాచారం. ఇతడు పోలీసుల టాప్‌టెన్‌ మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్నాడు. బారాముల్లాలోని మాల్వా ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉగ్రమూక నక్కినట్లు భ్రదతా దళాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాడి మొదలుపెట్టడంతో నలుగురు సైనికులు, ఒక అధికారి స్వల్పంగా గాయపడ్డారు. దీంతో దళాలు కూడా ఎదురు దాడి ప్రారంభించడంతో ఎన్‌కౌంటర్‌ మొదలైంది.యూసఫ్‌ కంత్రూ 2005లో ఓవర్‌ గ్రౌండర్‌ వర్కర్‌గా హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థలో చేరాడు. అతడిని అదే ఏడాది పోలీసులు అరెస్టు చేశారు. 2008లో జైలు నుంచి బయటకు వచ్చిన అతడు 2017లో తిరిగి ఉగ్రవాదుల్లో చేరాడు. అమాయక పౌరులు, పోలీసులు, రాజకీయ పార్టీల కార్యకర్తల హత్యల్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత హిజ్బుల్‌ నుంచి లష్కరేలో చేరాడు. బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదులు గతంలో చాలా దాడుల్లో పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఈ ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతోంది.2019 ఆగస్టులో 370 అధికరణను ఉపసంహరించుకొన్న తరవాత తొలిసారి ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 24న జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా జమ్మూ ప్రాంతంలోని సాంబా జిల్లా పల్లీ గ్రామం నుంచి గ్రావిూణ స్థానిక సంస్థలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి.