ప్రాణహితకు పుష్కరాలు


` తెలంగాణ, మహారాష్ట్రలో ఘనంగా ప్రారంభం
మంచిర్యాల,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):తెలంగాణ, మహారాష్ట్రలో ప్రాణహిత నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట పుష్కరఘాట్‌ వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పుష్కరిణికి ప్రత్యేక పూజలు చేశారు.ప్రాణహితకు కలశపూజ, గణపతి పూజ, హారతి, విశేషపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పాల్గొన్నారు. ప్రాణహిత పుష్కరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. 12 రోజుల కార్యక్రమం కావడంతో శాశ్వత ఏర్పాట్లు చేయలేదని వివరించారు. కృష్ణా, గోదావరి, ప్రాణహిత పుష్కరాల్లో పాల్గొనే అదృష్టం దక్కిందన్నారు.కుమురం భీం జిల్లా తుమ్మిడిహట్టి వద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా పాలనాధికారి రాహుల్‌ రాజ్‌, అదనపు పాలనాధికారి వరుణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాణహిత నదికి హారతి ఇచ్చి నదిలో స్నానమాచరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పుష్కరాలు ప్రాణహిత వద్ద నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. భక్తులందరూ పుష్కరాల్లో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించాలని కోరారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కాళేశ్వరం వద్ద ప్రాణాహిత పుష్కరాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.తెలంగాణ, మహారాష్ట్రలో రోజూ 2లక్షల మంది స్నానాలు ఆచరిస్తారని అంచనా. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండల కేంద్రం, కోటపల్లి మండలంలో అర్జునగుట్ట వద్ద, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద, మహారాష్ట్రలోని సిరోంచ, నగరం వద్ద పుష్కరఘాట్లను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం నుంచి గోదావరి వంతెన విూదుగా తొమ్మిది కిలోవిూటర్ల దూరంలోని సిరోంచకు వెళ్లేందుకు 10 ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు.