ఎంపీ నవనీత్‌ దంపతుల అరెస్టు


ముంబయి,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠించి తీరతామంటూ అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులు సవాలు విసిరిన విషయం తెలిసిందే.కాగా ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ శివసేన పార్టీ కార్యకర్తలు ఎంపీ ఇంటిముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో నవనీత్‌ దంపతులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయితే మత కలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ నవనీత్‌ రాణా దంపతులను ముంబయి పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 153 (ఏ) కింద కేసులు నమోదు చేశారు.తమ నిరసనపై వెనక్కి తగ్గుతున్నట్లు అరెస్టుకు కొద్దిసేపు ముందే ఆ దంపతులు ఓ ప్రకటన చేశారు. రవి రాణా మాట్లాడుతూ.. రేపు ముంబయికి ప్రధాని మోదీ రానుండటంతో తమ నిరసనపై వెనక్కి తగ్గుతున్నామని వెల్లడిరచారు. రాష్ట్రంలో శాంతిభద్రతల కారణంగా ప్రధాని పర్యటనకు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దంపతుల తాజా ప్రకటనతో వారి ఇంటిముందు నిరసన చేపట్టిన శివసేన కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. మిఠాయిల పంచుకున్నారు.సీఎం ఉద్ధవ్‌ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ ముందు హనుమాన్‌ చాలీసా పఠించి నిరసన తెలుపుతామన్న వ్యాఖ్యలతో ముంబయి పోలీసులు ఎంపీ దంపతులకు శుక్రవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నవనీత్‌కు ‘వై’ కేటగిరీ భద్రతను కల్పిస్తోంది. రాష్ట్రంలో శాంతిస్థాపన కోసం హనుమాన్‌ జయంతి రోజు ఠాక్రే హనుమాన్‌ చాలీసా పఠించాలని తాము కోరామని, కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదని రవి రాణా పేర్కొన్నారు. అందుకే తామే ఠాక్రే నివాసం వద్దకు చేరుకొని హనుమాన్‌ చాలీసాను చదువుతామని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులకు సహకరిస్తామని అన్నారు.