ALL NEWS

 1.ప్రపంచబాక్సింగ్‌ ఛాంపియన్‌గా తెలంగాణ బిడ్డ,మన హైదరాబాదీ నిఖత్‌ జరీన్‌ ఘన విజయం
` ఫైనల్‌లో స్వర్ణం కైవసం
` జిట్‌పాంగ్‌ (థాయ్‌లాండ్‌)పై 5`0 తేడాతో అద్భుత విజయం
` బౌట్‌ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం
ఇస్తాంబుల్‌,మే19(జనంసాక్షి): భారత బాక్సింగ్‌ యువ సంచలనం.. తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ చరిత్ర సృష్టించింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌ స్వర్ణపతకం గెలిచింది.52 కిలోల విభాగంలో ఫైనల్‌లో జిట్‌పాంగ్‌ (థాయ్‌లాండ్‌)పై 5`0 తేడాతో అద్భుత విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలంగాణ అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది. బౌట్‌ ఆరంభం నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించింది. రింగ్‌లో దూకుడుగా కదిలిన ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు.ప్రత్యర్థిపై ముష్టి ఘాతాలతో విరుచుకుపడిరది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఐదో బాక్సర్‌గా రికార్డు సృష్టించింది. అంతకుముందు మేరీ కోమ్‌, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ కేసీ మాత్రమే గోల్డ్‌ మెడల్‌ను సాధించారు. హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో జలంధర్‌లో జరిగిన ఆలిండియా యూనివర్సిటీస్‌ పోటీల్లో ఆమె బెస్ట్‌ బాక్సర్‌ ఛాంపియన్‌ షిప్‌ను సాధించింది.విశాఖపట్నంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో బాక్సింగ్‌ శిక్షణ తీసుకుంది. నిఖత్‌ ప్రముఖబాక్సర్‌ మేరికోమ్‌ను స్పూర్తిగా తీసుకుని బాక్సింగ్‌లో దూసుకుపోతోంది.


2.భారత్‌, యూకే సంబంధాలు మరింత బలోపేతం
` మంత్రి కేటీఆర్‌ సమక్షంలో లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌తో ఒప్పందం..
హైదరాబాద్‌,మే19(జనంసాక్షి): ప్రతిష్టాత్మక లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకడమిక్‌ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కింగ్స్‌ కాలేజ్‌ కలిసి పనిచేయనుంది.యూకే పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌, కింగ్స్‌ హెల్త్‌ పార్ట్‌నర్స్‌ ఈడీ ప్రొఫెసర్‌ రిచర్డ్‌ ట్రెంబాత్‌లో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.గత నెలలో బ్రిటీష్‌ కౌన్సిల్‌ నేతృత్వంలో లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌ ప్రెసిడెంట్‌, ప్రిన్సిపాల్‌ సహా కాలేజ్‌ ప్రతినిధులు భారత్‌లో పర్యటించారు. దానికి కొనసాగింపుగా మంత్రి కేటీఆర్‌ లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ క్యాంపస్‌ను సందర్శించారు. తాజా ఒప్పందంతో ఫార్మా రంగంలో ఉన్నత విద్యా అవకాశాలు, పరిశోధన, విద్యార్థుల బదలాయింపుతో పాటు పాఠ్యాంశాల తయారీలో కింగ్స్‌ కాలేజ్‌ సహకారం అందించనుంది. ఫార్మా సిటీ, లైఫ్‌ సైన్సెస్‌ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్‌ కాలేజ్‌ తోడ్పాటు ఇవ్వనుంది. టెక్నాలజీ, హెల్త్‌ కేర్‌ రంగాల్లో ఉన్నత విద్యా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాజా ఒప్పందం దోహదపడుతుందని కింగ్స్‌ కాలేజ్‌ ప్రెసిడెంట్‌, ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ శితిజ్‌ కపూర్‌ తెలిపారు.కేటీఆర్‌ మాట్లాడుతూ.. కింగ్స్‌ కాలేజ్‌తో ఒప్పందం భారత్‌, యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. హైదరాబాద్‌ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా మారబోతుందని తెలిపారు. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు ఆ ప్రణాళికలో భాగమేనని చెప్పారు. తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ ఎకో సిస్టం విలువ 50 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని.. ఫార్మా పరిశోధన, శిక్షణలో ప్రపంచంలోని అత్యంత్య నైపుణ్యం కలిగిన విశ్వవిద్యాలయంతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. కింగ్స్‌ కాలేజ్‌, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం యూకే, భారత్‌ సంబంధాల్లో మైలురాయి లాంటిదని యూకే ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ఛాంపియన్‌ సర్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నారు. ఈ ఒప్పందంతో ఫార్మా రంగంలో పరిశోధన, బోధనాంశాల్లో తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, సహకారం అందుతుందని అభిప్రాయపడ్డారు.


3.సిద్ధూకు ఏడాది జైలు
` 34 ఏళ్ల క్రితం నాటి మర్డర్‌ కేసులో తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు
` రివ్యూ పిటిషన్‌లో దోషిగా తేల్చిన సిద్దూ
న్యూఢల్లీి,మే19(జనంసాక్షి):పంజాబ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. మూడు దశాబ్దాల నాటి రోడ్‌? రేజ్‌? కేసులో సిద్ధూకు ఒక సంవత్సరం శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 30 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో సిద్ధూ నేరస్థుడు అనడానికి తగిన ఆధారాలేవీ లేవనే కారణంతో 2018 మేలో సుప్రీంకోర్టు ఆయనకు జైలు శిక్ష లేకుండా కేవలం 1000 రూపాయలు జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాధితుడి కుటుంబం.. మరోసారి అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో సుప్రీం.. మరోసారి సిద్ధూ కేసుపై దృష్టిసారించింది. 1998 నాటి కేసులో సిద్ధూ నేరస్థుడేనా, కాదా అనే కోణంలో మరోసారి విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో ఆయనను నేరస్థుడిగా పరిగణించిన సుప్రీం కోర్టు.. సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.1988, డిసెంబర్‌ 27న రోడ్డుపై సిద్ధూకు, గుర్నామ్‌ సింగ్‌ అనే 65 ఏళ్ల వృద్ధుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో గుర్నామ్‌ సింగ్‌ అనే వృద్ధుడిని సిద్ధూ క్షణికావేశంలో తలపై కొట్టడంతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. పాటియాలాలోని ట్రాఫిక్‌ జంక్షన్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆ వృద్ధుడిని వాహనంలో నుంచి బయటకు లాగి మరీ సిద్ధూ పిడిగుద్దులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన గుర్నామ్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసును విచారించిన ట్రయల్‌ కోర్టు సెప్టెంబర్‌, 1999లో నవజోత్‌ సింగ్‌ సిద్ధూను, అతని స్నేహితుడు సంధూను నిర్దోషులుగా తేల్చుతూ తీర్పిచ్చింది. బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించడంతో ట్రయల్‌ కోర్టు తీర్పును హైకోర్టు పక్కకు పెట్టింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నవజోత్‌, అతని స్నేహితుడు సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2007లో ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించిన సుప్రీం సిద్ధూకు సెక్షన్‌ 323 కింద వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. ఈ కేసులో సిద్ధూకు కేవలం వెయ్యి రూపాయల జరిమానా మాత్రమే విధిస్తూ తీర్పు రావడంపై బాధిత కుటుంబం అభ్యంతరం తెలుపుతూ సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ రివ్యూ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ 34 ఏళ్ల నాటి కేసులో సుప్రీం తీర్పును వెలువరించింది. గుర్నామ్‌ సింగ్‌ బంధువు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను జస్టిస్‌ ఏఎమ్‌ ఖాన్విల్కర్‌, ఎస్‌కే కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు అనుమతించింది. తాజాగా ఈ తీర్పును వెలువరించింది.
 ఇక, ఈ తీర్పుపై సిద్ధూ స్పందించారు. కోర్టు ఇచ్చిన తీర్పుకు శిరసావహిస్తానంటూ ట్వీట్‌ చేశారు.


4.నల్లాల ఓదేల దంపతులు కాంగ్రెస్‌ తీర్థం.1
` రేవంత్‌ ఆధక్వర్యంలో సోనియాతో భేటీ
` కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రియాంక
` ప్రజలు కెసిఆర్‌ను తిరస్కరిస్తున్నారన్న రేవంత్‌ రెడ్డి
మంచిర్యాల బ్యూరో,మే19(జనంసాక్షి):తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్‌ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి.. టీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గురువారం పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం టీపీసీసీ చీఫ్‌ రేవంతరెడ్డి నేతృత్వంలో వారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. అనంతరం, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారిద్దరికీ పార్టీ కండువా వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అయితే, భాగ్యలక్ష్మికి జడ్పీ చైర్‌పర్సన్‌గా మరో రెండేళ్ల కాలం ఉండటం విశేషం. ఇక, నల్లాల ఓదెలు 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ప్రభుత్వ విప్‌గా కూడా ఓదెలు పనిచేశారు. అయితే బాల్క సుమన్‌కు టిక్కెట్‌ కోసం ఆయనను తప్పించారు. ఆయన భార్యకు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు.వీరు పార్టీలో చేరిన అనంతరం పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విూడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఉద్ఘాటించారు. నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్‌లో చేరడం శుభసూచక మన్నారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాల్సిన సమయం వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సమస్యలను సోనియా గాంధీ మాత్రమే తీర్చగలరన్న రేవంత్‌... ప్రాణహిత ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేశారని ఆరోపించారు. తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్‌ వైపు అడుగులేస్తోందని తెలిపారు. సోనియా గాంధీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్‌ అమలయితే మాదిగలకు న్యాయం జరుగుతందని అంతా బావించారు. కానీ అలా జరగలేదన్నారు. ఓదేలును వాడుకుని వదిలేశారని మండిపడ్డారు. అంతకుముందు సోనియా గాంధీతో కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నేత దామోదర రాజనరసింహ భేటీ అయ్యారు. సోనియా దగ్గరకు నల్లాల ఓదెలు దంపతులను రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు. అనంతరం ఓదెలు దంపతులకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


5.ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో యాసిన్‌ మాలిక్‌ దోషి
` తీర్పు వెలువరించిన దిల్లీ కోర్టు
దిల్లీ,మే19(జనంసాక్షి): ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ దోషిగా తేలాడు.ఈ మేరకు దిల్లీలోని ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) కోర్టు నేడు తీర్పు వెలువరించింది. మాలిక్‌ ఇటీవల తన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. మే 25న అతడికి శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది.యాసిన్‌ మాలిక్‌ ఆర్థిక పరిస్థితిపై నివేదిక అందించాలని కోర్టు ఎన్‌ఐఏ అధికారులు ఆదేశించింది. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత అతడికి ఎంత జరిమానా విధించాలన్నది నిర్ణయిస్తామని పేర్కొంది. ఈ కేసులో మాలిక్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలున్నట్లు సమాచారం. మే 10న యాసిన్‌ మాలిక్‌ తనపై నమోదైన అన్ని కేసుల్లో కోర్టు ఎదుట నేరాన్ని అంగీకరించాడు.2017లో కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో మాలిక్‌పై ఎన్‌ఐఏ కోర్టు కేసు నమోదు చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద, చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం మాలిక్‌.. ‘ఫ్రీడమ్‌ స్ట్రగుల్‌’ పేరుతో నిధుల సమకూర్చాడని దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. మాలిక్‌తో పాటు పలువురు కశ్మీరీ వేర్పాటువాద నేతలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌లపై కూడా ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.



6.ప్రపంచానికి భారత్‌ ఆశా దీపం
ప్రధాని మోదీ ఉద్ఘాటన
దిల్లీ,మే19(జనంసాక్షి): ప్రపంచ వ్యాప్తంగా అశాంతి, ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ ప్రపంచానికి భారత్‌ ఓ ఆశాదీపంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ఖ్యాతి పెరుగుతుందన్న ఆయన.. పురాతన సంప్రదాయాన్ని అనుసరిస్తూ నవ భారత నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసిన ‘యువ శివిర్‌’ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న మోదీ.. యువతను ఉద్దేశించి ప్రసంగించారు.’కరోనా సంక్షోభం వేళ వ్యాక్సిన్‌లు, ఔషధాలను ప్రపంచ దేశాలకు పంపిణీ చేయడం మొదలు సప్లైచైన్‌ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిన సమయంలోనూ భారత్‌ కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయంగా అశాంతి, ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో శాంతికోసం సమర్థమైన పాత్రను నిర్వహిస్తోన్న భారత్‌.. నేడు ప్రపంచానికి ఓ ఆశాదీపంగా మారింది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రష్యా`ఉక్రెయిన్‌ సంక్షోభం వేళ వస్తు సరఫరాలో అంతరాయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటితోపాటు యోగా మార్గాన్ని అనుసరించేందుకు ప్రపంచదేశాలకు మనం దారి చూపుతున్నామన్న ఆయన.. ఆయుర్వేద శక్తిని యావత్‌ ప్రపంచానికి తెలియజేస్తున్నామని చెప్పారు. సమిష్టి నిర్ణయాలతో నూతన భారత్‌ను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో పురాతన సంప్రదాయాన్ని అనుసరించి సరికొత్త విధానంలో ముందుకు వెళ్తున్నామన్న మోదీ.. మొత్తం మానవాళికే దిశానిర్దేశం చేసే శక్తిగా భారత్‌ ఎదుగుతోందని అన్నారు.వడోదర కరేలీబాగ్‌, కుండల్‌ధామ్‌లలోని శ్రీ స్వామినారాయణ్‌ దేవస్థానాలు సంయుక్తంగా ‘యువ శివిర్‌’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. సామాజిక సేవ, దేశాభివృద్ధిలో ఎక్కువ మంది యువతను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడిరచారు.


7.మరోమారు గ్యాస్‌ బాదుడు
` సిలిండర్‌పై రూ.3.50 పెంచిన కేంద్రం
న్యూఢల్లీి,మే19(జనంసాక్షి): పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. సామాన్యుడిపై గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరుగుదల రూపంలో మరో భారం పడిరది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. గ్యాస్‌ బండ ధరను రూ.3.50 పెంచారు. అలాగే వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.8 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల భారాన్ని మోస్తున్న సామన్యులపై తాజా పెరుగుదలతో మరింత భారం పడనుంది.ఈనెలలో గ్యాస్‌? ధరలు పెరగడం ఇది రెండోసారి. మే 7న సిలిండర్‌?పై రూ.50 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకన్నాయి. అంతకుముందు మార్చి 22న కూడా 50 రూపాయలు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. తాజా నిర్ణయంతో సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్‌?పీజీ సిలిండర్‌? ధర రూ. 1003కు చేరింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ బండపై రూ.3.50, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్‌పై రూ.8 వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటింది. తాజా పెంపుతో ఢల్లీి, ముంబైలో గృహావసరాలకు ఉపయోగించే 14 కిలోల సిలిండర్‌ ధర రూ.1003కు చేరింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1029, చెన్నైలో రూ.1018.5, హైదరాబాద్‌లో 1056కు పెరిగింది. ఈ నెల 7న సిలిండర్‌పై రూ.50 పెంచిన విషయం తెలిసిందే. ఇక 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.8 పెంచడంతో రూ.2364కు చేరింది. 19 రోజుల వ్యవధిలో వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ ధర పెరగడం ఇది రెండోసారి. ఈ నెల 1న సిలిండర్‌పై రూ.102.50 భారం మోపిన విషయం విధితమే.


8.ఇక మద్యం మరింత ప్రియం
` అమల్లోకి పెరిగిన మద్యం ధరలు
` ఉత్తర్వులు జారీచేసిన ఆబ్కారీ శాఖ
హైదరాబాద్‌,మే19(జనంసాక్షి): రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 180 ఎంఎల్‌పై రూ. 20, రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 375 ఎంఎల్‌పై రూ. 40, రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 750 ఎంఎల్‌పై రూ. 80 పెంచింది. రూ. 200 కంటే ఎక్కువ ఎంఆర్పీ ఉన్న 180 ఎంఎల్‌పై రూ. 40, రూ. 200 కంటే ఎక్కువ ఎంఆర్పీ ఉన్న 375 ఎంఎల్‌పై రూ. 80, రూ. 200 కంటే ఎక్కువ ఎంఆర్పీ ఉన్న750 ఎంఎల్‌పై రూ. 160 పెంచింది. మద్యం ఎంఆర్పీ క్వార్టర్‌పై రూ. 10, హాఫ్‌ పై రూ. 20, ఫుల్‌ బాటిళ్లపై రూ. 40 పెరిగింది. అన్ని రకాల బీర్‌ బాటిల్‌ ఎంఆర్పీపై రూ. 10 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.చివరి సారిగా 2020, మే నెలలో మద్యం ధరలను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. పాత ఎంఆర్పీలు ఉన్నా కొత్త ధరలు వర్తిసాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంఆర్పీ ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సమస్యల పరిష్కారానికి సంప్రదించాల్సిన టోల్‌ ఫ్రీ నంబర్‌ ? 1800 425 2523.ధరల పెంపు కారణంగా బుధవారం రాత్రి విక్రయాలు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వైన్స్‌, బార్‌, రెస్టారెంట్లను ఆబ్కారీశాఖ అధికారులు సీజ్‌చేశారు. ఆయా దుకాణాల్లో ఉన్న స్టాక్‌ వివరాలు సేకరించారు. ఇప్పటికే దుకాణదారులు మద్యం డిపోల నుంచి తెచ్చుకున్న స్టాక్‌కు కొత్త ధరలు అమలు చేయడంలో భాగంగా వివరాలు తీసుకున్నారు. నూతన ధరల ప్రకారం ఆ స్టాక్‌కు అనుగుణంగా దుకాణదారులు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.




9.అసోంలో ఎడతెరిపిలేని వానలు
` భారీ వర్షాలతో 8మంది మృతి
` ముంచెత్తిన వరదలతో ప్రసల అవస్థలు
` కొండచరియలు విరిగి పడడంతో వేలాదిమంది నిరాశ్రయులు
` సహాయకచర్యల్లో పాల్గొంటున్న ఆర్మటీ, పారామిలిటరీ బలగాలు
` వరద పరిస్థితులపై అసోం సిఎంతో అమిత్‌ ఆరా
` కర్నాటక, కేరళలోనూ వర్షాలు
గౌహతి,మే19(జనంసాక్షి): ఎడతెరిపి లేని వర్షాలు  అస్సాంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలు రాష్టాన్న్రి  ముంచెత్తుతున్నాయి. కొండ చరియలు విరిగిపడి వరద నీరు పోటెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 27 జిల్లాల్లో సుమారు 1,089 గ్రామలు నీటమునిగాయి. సుమారు 6 లక్షల మంది  వరదల ప్రభావానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, పోలీసులు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఈశాన్య రాష్ట్రం అసోంను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల ప్రభావానికి ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారు. మొత్తం 5 లక్షల మందికి పైగా అసోం ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. అసోంలోని పరిస్థితులపై కేంద్రహోంమంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మతో మాట్లాడారు. కేంద్రం తరఫున అన్ని విధాలా సాయం చేస్తామని హావిూ ఇచ్చారు.కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి. కోజికోడ్‌, వయనాడ్‌, కన్నూర్‌, కాసరగోడ్‌, పాలక్కడ్‌, మలప్పురం, త్రిశూర్‌ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. రానున్న 5 రోజులపాటు కేరళలో భారీ వర్షాలు పడే అవకాశముందంది వాతావరణ శాఖ. కన్నూర్‌, కాసరగోడ్‌ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షానికి కర్ణాటక రాజధాని బెంగళూరు వణికిపోయింది. బెంగళూరులో కాల్వలు నిండిపోయాయి. రోడ్లపై నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో వాహన సరఫరాకు అంతరాయం ఏర్పడిరది. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఎయిర్‌ పోర్టుకు వెళ్లే మార్గంలో 4 అడుగుల మేర నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ఏపీలోని కృష్ణా జిల్లా ప్రజలు వారం రోజులుగా తీవ్ర ఎండలకు అల్లల్లాడిపోతున్నారు. ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారింది. గుడివాడలో ఉదయం నుంచి తేలికపాటి వర్షం పడుతుంది. అసోంలో  ఇప్పటి వరకు వరద చేరిన ఇళ్లల్లో చిక్కుకున్న  3,427 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.142 పునరావాస శిబిరాలు, 115 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 48,000 మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు. వాన బీభత్సంతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. దిమా హసావో జిల్లాలో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరదల ప్రభావంతో ఇప్పటి వరకు 9 మంది మృత్యువాతపడ్డారు. కాచర్‌లో ఇద్దరు, ఉదల్‌గురిలో ఒకరు మరణించగా.. కొండ చరియలు విరిగిపడి దిమా హసావోలో నలుగురు, లఖింపూర్‌లో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు కనిపించకుండా పోయారు. వరద బాధిత జిల్లాలకు అస్సాం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా రాష్టాన్రికి కేంద్రం రూ. 1,000 కోట్లు మంజూరు చేసిందన్నారు.వరద బాధిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల సరఫరాను కొనసాగించేందుకు, కమ్యూనికేషన్‌ మార్గాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రైల్వే లింక్‌ పునరుద్ధరించడానికి దాదాపు 45 రోజులు పడుతుందని, రెండు`మూడు రోజుల్లో రోడ్డు కనెక్టివిటీని పునరుద్దరిస్తామని  సీఎం తెలిపారు. ప్రస్తుతం కంపూర్‌, ధర్మతుల్‌ వద్ద కోపిలి నది, నంగ్లమురఘాట్‌ వద్ద దిసాంగ్‌ నది, ఏపీ ఘాట్‌ వద్ద బరాక్‌ నది, కరీంనగర్‌ వద్ద కుషియారా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అయితే రానున్నఈ ప్రాంతంలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గౌహతి ఆధారిత ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, రానున్న రెండు రోజుల పాటు వర్షాలు మరింత కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా శుక్రవారం నుంచి ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు కొద్దిగా మెరుగుపడవచ్చని తెలిపింది. వరదనీరు పోటేత్తడంతో దిమా హసావ్‌ ప్రాంతంలోని హాఎª`లాంగ్‌ రైల్వే స్టేషన్‌ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. స్టేషన్‌లోని రెండు రైళ్లు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. గౌహతి`సిల్చార్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన కొన్ని బోగీలు తిరగబడుతున్న దృశ్యాలు సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారాయి. అయితే ముందే ప్రమాద తీవ్రతను అంచనా వేసిన అధికారులు  ప్రయాణికులను సురక్షితంగా తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది. రైల్వే అధికారులు 29 రైళ్లను నిలిపివేశారు. ప్యాసింజర్‌ రైళ్లలోని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.



10.నిద్రిస్తున్న వలసకూలీలపై దూసుకెళ్లిన లారీ..
నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురి మృతిÑ 12మందికి గాయాలు!
చండీగఢ్‌,మే19(జనంసాక్షి):హరియాణాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిద్రపోతున్న వలస కూలీల పైనుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. హరియాణాలోని రaజ్జర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు మృతిచెందగా..12మంది గాయపడినట్టు పోలీసులు వెల్లడిరచారు. బొగ్గు లోడుతో వెళ్తున్న ట్రక్కు డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం నిద్రపోతున్న కూలీలపైకి దూసుకెళ్లినట్టు చెబుతున్నారు. ఆ రహదారిపై ప్రమాదకరంగా వాహనాలు తిరుగుతుండటంతో అక్కడ నిద్రపోవద్దంటూ వలస కూలీలకు పెట్రోలింగ్‌ పోలీసు బృందాలు హెచ్చరించిన మరుసటి రోజే ఈ విషాదం చోటుచేసుకుంది.బహదుర్‌గఢ్‌లోని ఆసోడా టోల్‌ప్లాజా సవిూపంలో కుండ్లి`మానేసర్‌`పాల్వాల్‌ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ దుర్ఘటన జరిగిన సమయంలో అక్కడ 18 మంది కూలీలు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రోప్‌ాతక్‌లోని పీజీఐఎంఎస్‌ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. మృతులంతా కాన్పూర్‌కు చెందిన వారు కాగా.. గాయపడిన వారిలో యూపీలోని కాన్పూర్‌, కన్నౌజ్‌, ఫరూఖాబాద్‌లకు చెందినవారు ఉన్నారన్నారు. ఓ వంతెన రిపైర్‌ పనులు జరుగుతుండగా పనిచేసేందుకు వచ్చిన వీరంతా రాత్రిపూట రోడ్డుపక్కనే నిద్రపోతుంటారని పోలీసులు తెలిపారు. అయితే, కూలీలు అక్కడే నిద్రిస్తున్నా.. అలాగే వదిలేసిన కాంట్రాక్టర్‌, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.





11.తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
హైదరాబాద్‌,మే19(జనంసాక్షి): తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఆరుగురు అధికారులను బదిలీ/అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న డా.జ్యోతి బుద్ధప్రకాశ్‌ను చేనేత, జౌళి, హస్తకళల కార్యదర్శిగా బదిలీ చేసింది. అలాగే, ఆయనకు రవాణాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సీఎం కార్యదర్శి రాహుల్‌ బొజ్జాను రిజిస్ట్రేషన్లు, స్టాంపుల కమిషనర్‌గా, సర్వే సెటిల్మెంట్‌, భూ రికార్డుల డైరెక్టర్‌, భూభారతి పీడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే, ఆరోగ్యశాఖ కమిషనర్‌గా ఉన్న వాకాటి కరుణను విద్యాశాఖ కమిషనర్‌గా బదిలీ చేసిన ప్రభుత్వం.. వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీకి ఔషధ నియంత్రణ సంచాలకులుగా, ప్రజారోగ్య ` కుటుంబసంక్షేమశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పించింది. సీఎం కార్యదర్శిగా ఉన్న వి.శేషాద్రిని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శిగా, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాను యువజన సర్వీసులు, పర్యాటకశాఖ కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు ఇచ్చారు.




సీఎం కేసీఆర్‌ దేశవ్యాప్త పర్యటన
` రాజకీయ ఆర్ధిక మీడియా ప్రముఖులతో సమావేశం
` కేజ్రీవాల్‌,కుమారస్వామి,పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌సింగ్‌లతో భేటి
` రైతుఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్‌,హర్యానా,ఢల్లీి,ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన రైతు కుటుంబాలకు ఆర్ధిక సహాయం
` 29లేదా 30న బెంగాల్‌ బీహార్‌ పర్యటన
హైదరాబాద్‌,మే19(జనంసాక్షి):జాతీయ స్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు గారు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా  రాజకీయ, అర్థిక,  విూడియా రంగాలకుచెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. దేశంకోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. వ్యవసాయం రైతుల హక్కుల కోసం పోరాడి కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించిన జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను కలిసి సిఎం పరామర్శించనున్నారు. సీఎం కేసీఆర్‌ నేడు ఢల్లీికి వెళ్లి వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమౌతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. అదే సందర్భంగా ప్రముఖ జాతీయ విూడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తారు. 22న ఢల్లీినుంచి చంఢీఘర్‌  పర్యటన చేపడతారు. గతంలో ప్రకటించిన విధంగా  జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని... ఢల్లీి సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సిఎం భగవంత్‌ మాన్‌సింగ్‌లతో కలిసి చేపడతారు.  సంచలనం సృష్టించిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన.. పంజాబ్‌, హర్యాన, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఢల్లీి రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు  చెక్కులను  అందచేస్తారు.26న బెంగళూరు పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ భారత ప్రధాని దేవగౌడ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమౌతారు. బెంగుళూరు నుంచి 27న రాలేగావ్‌ సిద్ది పర్యటనను  చేపట్టనున్నారు. అక్కడ ప్రముఖ సమాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు.  అటునుంచి  సాయిబాబా దర్శనం కోసం షిరిడీ వెళతారు. అక్కడనుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైద్రాబాదకు చేరుకుంటారు. అటు తర్వాత మే 29 లేదా 30 న బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాల పర్యటనకు సంసిద్దం కానున్నారు.  గాల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సిఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సిఎం కెసిఆర్‌ ఆదుకోనున్నారు.